విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి | Mahesh attacked student with a hammer in suryapet | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి

Feb 20 2026 4:28 AM | Updated on Feb 20 2026 4:28 AM

Mahesh attacked student with a hammer in suryapet

నిందితుడిని స్తంభానికి కట్టేసిన స్థానికులు

తనను దూరం పెడుతోందనే అక్కసుతో సుత్తితో కొట్టిన నిందితుడు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో ఘటన 

చివ్వెంల(సూర్యాపేట): తనను దూరం పెడుతోందనే అక్కసుతో లా విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిపై ప్రేమెన్మాది సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్‌ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బోయిండ్ల మహేశ్, సమీప గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 

ఈ విషయం ఇరు కుటుంబాల సభ్యులకు తెలియడంతో ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఆ యువతి హైదరాబాద్‌లో లా నాల్గవ సంవత్సరం చదువుతోంది. ఇటీవలే ఆమె స్వగ్రామానికి వచ్చింది. అక్కడ నుంచి చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలోని స్నేహనగర్‌లో అద్దెకు ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చి ఉంటోంది. తాను ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందని ఆమెపై మహేశ్‌ ద్వేషం పెంచుకున్నాడు. 

ఈ క్రమంలో మహేశ్‌ సూర్యాపేట పట్టణంలోని ఓ షాపులో సుత్తి కొనుగోలు చేసి గురువారం ఆ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. యువతి అక్క, బావ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. ఆ యువతి ప్రతిఘటించడంతో తనతో తెచ్చుకున్న సుత్తితో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె కేకలు వేయడంతో ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారు వచ్చి మహేశ్‌ను పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. 

డీఎస్పీ ప్రసన్న కుమార్‌ ఆధ్వర్యంలో సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ మహేశ్వర్‌ ఘటనా స్థలానికి చేరుకుని యువతిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మహేశ్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేశ్వర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement