ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ ఎన్నిక వివాదంలో ఈసీకి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ‘వన్ మ్యాన్.. వన్ ఎపిక్ కార్డు’పై వివరాలు ఇవ్వాలని, అలాగే పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కలెక్టర్, ఆర్డీవోతోపాటు కౌన్సిలర్ బుగ్గా రాములుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా వేసింది. పంచాయతీ, మున్సిపాలిటీలో వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులున్న చిలకల బుగ్గ రాములు (బీఆర్‌ఎస్) నామినేషన్‌ను తిరస్కరించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఈగల రాములు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మున్సిపాలిటీలో ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్)తో పోటీచేసి వార్డు సభ్యుడిగా గెలుపొందిన రాములు, పంచాయతీ ఎన్నికల్లో మరో ఓటరు కార్డుతో ఓటు వేశారన్నారు. దీనిపై పిటిషనర్ గత నెలలో ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎన్నిక ముగిసినందున ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి మూడు నెలలకోసారి ఓటర్ల జాబితాను సవరిస్తూ ఉంటుందని, ఈ జాబితా మేరకు ఆయా పంచాయతీ, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు.
ఈ జాబితా ఆధారంగా ఎస్‌ఈసీ వార్డుల వారీగా ఓటర్ల జాబితా విభజిస్తుందని.. ఒక వ్యక్తికి ఒక ఎపిక్ కార్డు మాత్రమే ఉంటుందన్నారు. పల్లెలో, నగరంలో ఇల్లున్నా ఒకచోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘వన్ ఎలక్షన్.. వన్ ఓట్ ’లేదా ‘వన్ మ్యాన్.. వన్ ఎపిక్ కార్డు’పై ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఏముందో వివరాలు సమర్పించాలని చెప్పారు. ఈ పిటిషన్‌లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కూడా పార్టీగా చేర్చి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.


