బరాజ్‌ల పునరుద్ధరణ ఖర్చు మీదే.. | Government letter to Annaram and Sundilla contractors | Sakshi
Sakshi News home page

బరాజ్‌ల పునరుద్ధరణ ఖర్చు మీదే..

Feb 20 2026 4:24 AM | Updated on Feb 20 2026 4:24 AM

Government letter to Annaram and Sundilla contractors

అన్నారం, సుందిళ్ల కాంట్రాక్టర్లకు ప్రభుత్వం లేఖ

సహకరించపోతే చర్యలు తప్పవని హెచ్చరిక

మరోసారి నోటీసులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ఒప్పంద కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకి నష్టాలు జరిగిన నేపథ్యంలో వాటి పునరుద్ధరణ వ్యయాన్ని భరించాల్సిందేనని.. వాటి నిర్మాణ సంస్థలు ఆఫ్కాన్స్, నవయుగ కంపెనీలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. బరాజ్‌లను నిర్మాణ సంస్థలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి అప్పగించలేదని, దీంతో వాటి పునరుద్ధరణ బాధ్యత వాటిదేనని తేల్చిచెప్పింది. బరాజ్‌ల పునరుద్ధరణకు అవసరమైన పరిశోధనలు, తదనంతర చర్యల విషయంలో నీటిపారుదల శాఖ, సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) డిజైన్‌ కన్సల్టెంట్‌కు పూర్తి సహకారం అందించాలని కోరింది. 

ఈ మేరకు ఆఫ్కాన్స్‌ (అన్నారం), నవయుగ (సుందిళ్ల)కు నీటిపారుదల శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది. పునరుద్ధరణ పనులకు సహకరించడానికి నిర్మాణ సంస్థలు తమ సిబ్బంది, సామగ్రి, యంత్రాలను బరాజ్‌ల వద్దకు తరలించాలని ఆదేశించింది. సహకరించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిర్మాణ సంస్థల నిర్లక్ష్యంతోనే బరాజ్‌లకు నష్టం జరిగిందని, పునరుద్ధరణ వ్యయభారాలను ఆ సంస్థలే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. 

బరాజ్‌ల నిర్మాణంలో నిర్మాణ సంస్థలు ఒప్పందాన్ని ఉల్లంఘించాయని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ), జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు తమ నివేదికల్లో తేల్చాయని గుర్తు చేసింది. దర్యాప్తు సంస్థలు చేసిన సూచనలను పునరుద్ధరణ సందర్భంగా కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. నీటిపారుదల శాఖ నియమించిన డిజైన్‌ కన్సల్టెంట్‌ నుంచి డిజైన్లు అందిన వెంటనే పునరుద్ధరణ చర్యలను ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థలు గతంలో హామీ ఇచ్చాయని తెలిపింది. 

డిజైన్‌ కన్సల్టెంట్‌గా ఆఫ్రీ ఇండియా అనే సంస్థను ఎంపిక చేశామని, త్వరలో ఒప్పందం చేసుకుంటామని తెలిపింది. బరాజ్‌లలో భారీగా సీపేజీలు ఏర్పడినప్పుడు సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో నష్టం మరింత పెరిగిందని, దీనికి నిర్మాణ సంస్థలే బాధ్యులని పేర్కొంది. మరమ్మతులు చేపట్టాలని తాము పలుమార్లు లేఖలు రాసినా నిర్మాణ సంస్థలు ఒప్పందాల గడువులోగా మరమ్మతులు చేపట్టలేదని, దీంతో నష్టం తీవ్రత పెరిగిందని తప్పుబట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement