breaking news
government letter
-
కేటీఆర్‌పై కేసుకు అనుమతినివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా– ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీ రామారావుపై కేసు నమోదు, విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉంది. దీనిపై ఆయన తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. ఈ–కార్ రేస్ వ్యవహారంపై ‘కేటీఆర్ చుట్టూ ‘ఫార్ములా–ఈ’ ఉచ్చు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. కాగా 2024 ఫిబ్రవరిలో ఈ కార్ రేస్ నిర్వహణ కోసం ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో)కు జరిపిన రూ.55 కోట్ల చెల్లింపులపై విచారించడానికి 2018 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17(ఏ) కింద అనుమతి కోరింది. ఈ చెల్లింపులకు అప్పటి హెచ్ఎండీఏ పాలకమండలి అమోదం కూడా లేదని, అంతేకాక ఈ నిధులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ మారకం రూపంలో చెల్లించినట్లు ప్రభుత్వం గవర్నర్‌కు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెల్లింపులకు అనుమతినిచ్చినందున ఇప్పుడు ఆయన విచారణకు గవర్నర్ అనుమతి తప్పనిసరైంది. కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ కూడా అయిన అర్వింద్‌కుమార్ చెల్లింపులు చేశారు. గవర్నర్‌తో రేవంత్ భేటీలోనూ ‘విచారణ’ ప్రస్తావన! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా కూడా కేటీఆర్ విచారణ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం రాసిన లేఖపై గవర్నర్ త్వరగానే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాల సమాచారం. గురువారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఫార్ములా–ఈకి రూ.55 కోట్లు చెల్లింపునకు సంబంధించిన బాధ్యత పూర్తిగా తనదేనంటూ ప్రకటించగా, ఖమ్మంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఆటం బాబు పేలబోతుందంటూ వ్యాఖ్యానించడం.. రాష్ట్రంలో రాజకీయ సంచలనానికి సంకేతాలనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు డీవోపీటీ అనుమతి తప్పనిసరి! ఫార్ములా–ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి అర్వింద్‌కుమార్‌తో పాటు సంబంధిత ఇంజనీర్లపై విచారణకు ప్రభుత్వం ఇదివరకే అనుమతి ఇచ్చిన విషయం విదితమే. కాగా విచారణ అనంతరం ఐఏఎస్ అధికారిని ప్రాసిక్యూషన్ చేయడానికి మాత్రం కేంద్ర సిబ్బంది శిక్షణా విభాగం (డీవోపీటీ) అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు. డీవోపీటీకి మాత్రమే ఐఏఎస్‌ను ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఉన్నందున వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల శాఖ కమిషనర్‌గా పనిచేసిన బీపీ ఆచార్య ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన వ్యవహారంలోనూ ముందస్తు అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం విదితమే. ఏమిటీ సెక్షన్ 17(ఏ).. ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి జరిగిదంటూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేసి విచారణ చేసేందుకు అవకాశం ఉండడంతో.. ఆ కక్ష సాధింపును నివారించేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17(ఏ)ను కొత్తగా చేర్చింది. ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కే ఉన్నందున, వారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై, వారు మాజీలైన తర్వాత కేసులు నమోదు చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి. కాగా 2018లో చట్ట సవరణ తర్వాత నమోదు చేసే కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుందని పార్లమెంట్లో కేంద్రం స్పష్టం చేసింది. -
లేఖ కలకలం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు రద్దు చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ గ్రామపాలన అధ్వానంగా మారుతుందంటున్న నేతలు కేంద్రం ఆమోదిస్తే జిల్లాలో 1,102 ఎంపీటీసీ, 60 జెడ్పీటీసీ పదవులకు ఎసరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం జిల్లాలో కలకలం రేపింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే జిల్లాలోని 1,102 ఎంపీటీసీ, 60 జెడ్పీటీసీ పదవులు రద్దవుతాయి. అదే జరిగితే గ్రామ పాలన మరింత అధ్వానంగా మారుతుందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మండపేట : పంచాయతీరాజ్ వ్యవస్థలో గతంలో మూడంచెలు ఉండేవి. గ్రామ సర్పంచ్, మండల అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ ఉండేవారు. పరిపాలన సౌలభ్యం కోసం 1994లో అప్పటి ప్రభుత్వం మూడంచెల స్థానంలో ఐదంచెల వ్యవస్థ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం పై ముగ్గురితోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కూడా తోడయ్యారు. మండల పరిషత్ నుంచి ఎంపీటీసీ సభ్యులకు, జిల్లా పరిషత్ నుంచి జెడ్పీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపులు జరిగేవి. వారు తమ పరిధిలో అభివృద్ధి పనులకు ఆ నిధులు వెచ్చించేవారు. తమ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మండల, జెడ్పీ సమావేశాల్లో ఆయా సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. ఫలితంగా గ్రామ పాలనలో సౌలభ్యం మరింత పెరిగింది. ఇటువంటి కీలక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని చూడడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు రద్దయితే గతంలో మాదిరిగా సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులు మాత్రమే కొనసాగుతాయి. గ్రామస్థాయిలో ఎన్నికైన సర్పంచులు మండల స్థాయిలో ఎంపీపీలను ఎన్నుకుంటే, ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేవిధంగా మూడంచెల విధానం ఉంటుంది. కాగా, దాదాపు ఆరు నెలలుగా ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనాల చెల్లింపును నిలిపివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మొత్తం ఆ పదవుల రద్దుకే పావులు కదుపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చిన చంద్రబాబు.. నేడు ఆ పదవులనే రద్దు చేయాలని లేఖ రాయడం ఆయన కుట్ర పూరిత రాజకీయాలకు నిదర్శనం. అధికార వికేంద్రీకరణ జరగకుండా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనం. 93వ రాజ్యాంగ సవరణ ప్రకారం కొన్ని అధికారాల బదలాయింపులో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిధులు, విధులు కేటాయిస్తే గ్రామాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే వ్యవస్థ ఇది. దీనిని రద్దు చేయాలనుకోవడం దురదృష్టకరం. – సాకా ప్రనన్నకుమార్, జెడ్పీ ప్రతిపక్ష నేత, రావులపాలెం సరైన ఆలోచన కాదు జెడ్పీటీసీ, ఎంపీటీసీల వ్యవస్థను రద్దు చేయాలన్న ఆలోచన సరైంది కాదు. నాలాంటి గృహిణులు ఈ వ్యవస్థ వల్లే జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నిక కాగలుగుతున్నారు. మండల వ్యవస్థలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆ మండల స్థాయి అభివృద్ధి కోసం చర్చించుకుంటారు. మండలాల్లో జిల్లా పరిషత్ పనులు, నిధులకు సంబంధించి చర్చించేందుకు కచ్చితంగా మండలం నుంచి ఎన్నికయ్యే జెడ్పీటీసీ సభ్యుడు ఉన్నప్పుడే వాటికి సరైన న్యాయం జరుగుతుంది. – అధికారి జయవెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు, అమలాపురం రూరల్ పరిషత్తుల్లో ప్రాతినిధ్యం తొలగించేందుకే.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేసేదిగా ఉంది. ఐదంచెల పరిపాలనతో గ్రామాభివృద్ధే ఆశయంగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను మూడంచెలకు కుదిస్తే పాలన స్థంభిస్తుంది. గ్రామాల నుంచి మండల, జిల్లా పరిషత్‌లలో ప్రాతినిధ్యం తొలగించేందుకే ఈ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం పూనుకుంటోంది. – పల్లేటి నీరజ, ఎంపీపీ, తుని