ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి, భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (నాడు ఎంపీ)పై 2023లో దాఖలైన కేసులో ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి హైకోర్టు ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు రేవంత్‌కు ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా వేసింది.
2023, ఫిబ్రవరి 22న భూపాలపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి తనపై భూకబ్జాదారుడినని, పెట్రోల్, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డానని, సింగరేణిలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డానని తీవ్ర ఆరోపణలు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు మొగుళ్లపల్లి, భూపాలపల్లి పీఎస్‌ల్లో కేసు నమోదైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని కోరుతూ రేవంత్ మూడు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుజన కళాసికం ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.


