శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ఆత్మీయ సమ్మేళనం | special meet Venkaiah naidu by Sri Samskrutika Kalasaradhi At Singapore | Sakshi
Sakshi News home page

శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ఆత్మీయ సమ్మేళనం

Jan 3 2026 5:59 PM | Updated on Jan 3 2026 6:43 PM

special meet Venkaiah naidu by Sri Samskrutika Kalasaradhi At Singapore

శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం సింగపూరులోని నేషనల్ పబ్లిక్ స్కూలు ఆవరణలో దాదాపు 400 మంది ఆహూతులు సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ప్రారంభమే  వెంకయ్య నాయుడు ఆశీస్సుల సందేశంతో జరిగిందని, అప్పటి నుంచి ప్రతి దశలోనూ వారి మార్గదర్శకత్వం, సూచనలు, ప్రోత్సాహం తమకు నిరంతరం లభిస్తూనే ఉన్నాయని తెలిపారు. అలాగే అతి తక్కువ సమయంలో సమాచారం అందించినప్పటికీ, సమయాన్ని సర్దుబాటు చేసుకుని కార్యక్రమానికి హాజరైన సింగపూరు భారతీయ హైకమిషనర్ డా. శిల్పక్ అంబులే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కుటుంబంలో, సమాజంలో, దేశంలో ఐక్యత ఉన్నప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ, నేతలందరూ ఐక్యంగా ఉండాలి. ఎన్నికల వరకే ప్రత్యర్థులు. ఆ తర్వాత అందరం భారతీయులం. ఐక్యంగా ఉంటే శాంతి ఉంటుంది. ‘‘భాష పోతే శ్వాస పోతుంది" అంటూ మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను శ్రీ వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. తెలుగులోని గొప్ప సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి ప్రపంచానికి అందించాలని విదేశాల్లోని తెలుగువారికి పిలుపునిచ్చారు.

శ్రీ సాంస్కృతిక కళాసారథి గాయని–గాయకులు ఆలపించిన “మా తెలుగు తల్లికి” గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సింగపూరులోని ప్రముఖ తెలుగు సంస్థలైన తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగుదేశం ఫోరమ్, కాకతీయ సంస్కృతిక పరివారం, APNRT ప్రతినిధులు హాజరై శ్రీ వెంకయ్య నాయుడు గారిని ఘనంగా సన్మానించారు.

తదుపరి కార్యక్రమానికి హాల్‌ను సమకూర్చిన కొత్తమాస్ వెంకటేశ్వర రావు (KV Rao, SIFAS) , నేషనల్ పబ్లిక్ స్కూల్ సిబ్బందిని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌షిప్ అందించిన హనుమంత రావు మాదల, నాగులపల్లి శ్రీనివాసు, శివప్రసాద్ టీమ్, సరిగమ గ్రాండ్, సూపర్ డీలక్స్, కూల్ టైం, వీర ఫ్లేవర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గాయని–గాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, చంద్రహాస్ ఆనంద్, శేషుకుమారి యడవల్లి, ఉషాగాయత్రి నిష్టల, అలాగే శరజ అన్నదానం, సౌమ్య ఆలూరు, కృష్ణ కాంతి లను శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ, రామాంజనేయులు చామిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సుబ్బు వి. పాలకుర్తి వ్యాఖ్యానం అందించగా, వంశీ కృష్ణ శిష్ట్లా, కుమారస్వామి గుళ్లపల్లి సాంకేతిక సహకారం అందించారు. అలాగే మాధవి పాలకుర్తి, మమత మాదాబత్తుల సత్య జాస్తి, రేణుక చామిరాజు, ప్రసన్న భరద్వాజ్, శ్రీలలిత తదితరులు వాలంటీర్ సేవలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం విచ్చేసిన ఆహుతులందరికీ సరిగమ గ్రాండ్ వారు ఏర్పాటు చేసిన విందు భోజనంతో కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement