అమెరికా తెలుగువారి ఆత్మీయుడు | Tribute to Veluri Venkateswara Rao | Sakshi
Sakshi News home page

అమెరికా తెలుగువారి ఆత్మీయుడు

Feb 18 2026 7:40 PM | Updated on Feb 18 2026 7:46 PM

Tribute to Veluri Venkateswara Rao

నివాళి/ వేలూరి వేంకటేశ్వర రావు

ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్‌ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ‌ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి.  

వేలూరి గారంటే...
లింక్డిన్‌లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్‌ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్‌ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు.  

వేలూరి స్నేహాలు  
ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్‌ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.

వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో  ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత.  

ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్‌ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్‌ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే  ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్‌ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.

ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్‌గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్‌ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.

వేలూరికి మనుషులు కావాలి!  
వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్‌కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు.  

వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్‌ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్‌ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని!  

కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్‌గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు.    

ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్‌ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 

👉 సోల్‌మేట్ క‌థ చ‌దివారా? 

న్యూయార్కర్‌ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్‌ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్‌ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్‌ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్‌ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న.  

– అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement