చిరంజీవిది నాలుగు దశాబ్దాల కెరీర్. ఎన్నో హిట్స్, బ్లాక్‌బస్టర్స్ చూశారు. ఫ్లాప్స్, ఘోరమైన డిజాస్టర్స్ కూడా అందుకున్నారు. అయినా సరే నిలబడ్డారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈయన లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం చిరు చాలా ఆశలు పెట్టుకున్నారు.
(ఇదీ చదవండి: 'జన నాయగణ్' వాయిదా? 'రాజాసాబ్'కి లైన్ క్లియర్)
సరే ఈ సంగతి అలా పక్కనబెడితే చిరంజీవి కెరీర్‌లోనూ ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రకటించిన తర్వాత రద్దయితే.. మరికొన్ని షూటింగ్ చేసిన తర్వాత ఆగిపోయాయి. కారణాలు ఏమైనా సరే చిరు కెరీర్‌లో పదికి పైగా మూవీస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇంతకీ అవేంటి? ఎందుకు ఆగిపోయాయనేది ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. చిరంజీవి హీరోగా 'వినాలని ఉంది' పేరుతో ఓ సినిమా మొదలుపెట్టారు. కొంత షూటింగ్ కూడా చేశారు. కానీ వర్మ.. పలు హిందీ ప్రాజెక్టులతో బిజీగా కావడంతో ఇది ఆగిపోయింది. ఇందులో ఊర్మిళ, టబు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం కోసం తీసిన పాటలని తర్వాత 'చూడాలని ఉంది' మూవీ కోసం ఉపయోగించుకున్నారు.
(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)
స్టార్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.. 'భూలోక వీరుడు' పేరుతో ఓ మూవీ ప్లాన్ చేశారు. చిరంజీవి హీరోగా అశ్వనీదత్ నిర్మాతగా ఫిక్స్ అయ్యారు. టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. కానీ షూటింగ్ మొదలుపెట్టకముందే ఇది ఆగిపోయింది. తర్వాత ఈ టైటిల్‌ని కాస్త మార్చి 'జగదేక వీరుడు అతిలోక సుందరి'గా ఉపయోగించుకున్నారనే ఇండస్ట్రీలో టాక్.
ఒకానొక టైంలో తెలుగులో దొంగ అనే పేరు టైటిల్‌లో ఉండేలా చాలా సినిమాలు వచ్చాయి. చిరంజీవివి కూడా వీటిలో చాలానే ఉన్నాయి. అయితే సురేశ్ కృష్ణ దర్శకుడిగా చిరుతో 'బాగ్దాద్ గజదొంగ' అని ఓ ప్రాజెక్ట్ అనుకున్నారు. షూటింగ్‌కి ముందే ఓ వివాదం తలెత్తేసరికి ఆగిపోయింది. అలానే చిరంజీవికి చాలా హిట్స్ ఇచ్చిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరు హీరోగా 'వజ్రాల దొంగ' అనే మూవీ అనుకున్నారు. హీరోయిన్‌గా శ్రీదేవిని తీసుకుని పాట కూడా తీశారు. కానీ తర్వాత ఇది కూడా మధ్యలోనే ఆపేశారు. ఇదే దర్శకుడితో ఇద్దరు పెళ్లాల స్టోరీతో ఓ మూవీ అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ టైంలోనే సమస్యలు రావడంతో ప్రారంభానికి ముందే ఈ ప్రాజెక్టు కూడా రద్దయిపోయింది.
(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?)
వీటితో పాటు శాంతి నివాసం, వడ్డీ కాసుల వాడు, పెద్దపులి చిన్నపులి తదితర సినిమాలు కూడా చిరంజీవితో అనుకుని రకరకాల కారణాలతో సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. దర్శకుడు వీఎన్ ఆదిత్య, ఎస్వీ కృష్ణారెడ్డిలతోనూ చిరు సినిమాలు చేయాలనుకున్నారు. ప్రకటన, పూజా కార్యక్రమాల వరకే ఇవి పరిమితమయ్యాయు
చిరంజీవి తన రీఎంట్రీ సినిమాని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఆటో జానీ' అనే స్టోరీతో తీద్దామనుకున్నారు. ఇది మాటల వరకే పరిమితమైపోయింది. రీసెంట్ టైంలో అయితే చిరు హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల- నిర్మాత డీవీవీ దానయ్య ఓ ప్రాజెక్టుని ప్రకటించారు. కారణమేంటో తెలీదు గానీ ఇదీ ఆగిపోయింది. 'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనూ చిరు ఓ మూవీ చేయాల్సింది గానీ దీన్ని పక్కనబెట్టేశారు. చేస్తారో లేదో సందేహమే. ఇలా రకరకాల కారణాలతో ఆగిపోయిన చిరంజీవి సినిమాలు చాలానే ఉన్నాయండోయ్!
(ఇదీ చదవండి: చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?)


