వెనెజువెలాలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజలు
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, మూతపడిన దుకాణాలు
కరాకస్: వెనెజువెలా రాజధాని కరాకస్‌తోపాటు సమీప నగరాలు, పట్టణాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అమెరికా సైన్యం వైమానిక దాడులకు పాల్పడడం, అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసి విదేశానికి తరలించడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సూపర్ మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. ఆహారం, నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అమెరికా దాడుల్లో విద్యుత్ గ్రిడ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. మళ్లీ విద్యుత్ సరఫరా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అధికారులు చేతులెత్తేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయడం లేదు. రాత్రయితే అంధకారంలో జీవించాల్సి వస్తోంది. వీధులు నిర్మానుష్యంగా మారాయి. కొన్నిచోట్ల సరకులు, మందుల దుకాణాలు తెరవడంతో ఆహారం, ఔషధాల కోసం జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా అనిశ్చితి, భయాందోళన కనిపించాయి.
ప్రజా రవాణా వ్యవస్థ సేవలను రద్దు చేశారు. జన జీవనం స్తంభించింది. విద్యుత్ సదుపాయం ఉన్నచోట సెల్‌ఫోన్లను చార్జింగ్ చేసుకొనేందుకు జనం ఎగబడుతున్న దృశ్యాలు కనిపించాయి. చార్జింగ్ కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని, అంతటా గందరగోళం నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరాకస్‌లో నివసిస్తున్న భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. వారి సూచనలు జారీ చేస్తోంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. నిత్యం రాత్రి, పగలు జనంతో కిటకిటలాడే రాజధాని కరాకస్ సిటీలో ఆదివారం నిశ్శబ్దం, గందరగోళం రాజ్యమేలాయి.


