గ్రహంతరవాసులు.. ట్రంప్‌ సంచలన ప్రకటన | Trump Orders Release Of Files On Aliens And Ufos | Sakshi
Sakshi News home page

గ్రహంతరవాసులు.. ట్రంప్‌ సంచలన ప్రకటన

Feb 20 2026 10:04 AM | Updated on Feb 20 2026 11:29 AM

Trump Orders Release Of Files On Aliens And Ufos

అంతుచిక్కని రహస్యంగా మారిన గ్రహాంతరవాసులపై ప్రపంచవ్యాప్తంగా మరోమారు చర్చ నడుస్తోంది. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఏలియన్స్ ఉనికిపై వ్యాఖ్యలు సంచలనం సృష్ఠించిన సంగతి తెలిసిందే. ఈ  క్రమంలో గ్రహాంతర వాసుల సమాచారం బహిర్గతం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు ఈ మేరకు ఫెడరల్‌ ఏజెన్సీలకు ఆయన మార్గదర్శకాలు జారీ  చేశారు.

అనేక దశాబ్దాలుగా అమెరికన్లు కోరుతున్న విధంగా యూఎఫ్‌వో, గ్రహాంతర వాసులకు సంబంధించిన ప్రభుత్వ ఫైళ్లను గుర్తించి.. విడుదల చేయాలంటూ ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. విడుదల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు.

"ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, గ్రహాంతర వాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువులకు (UFO) సంబంధించిన ప్రభుత్వ ఫైళ్లను గుర్తించి విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని సంబంధిత విభాగాలను ఆదేశిస్తున్నాను" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. వర్గీకరించబడిన అత్యంత రహస్య పత్రాలను బహిరంగపరుస్తారా?  అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. అత్యంత సంక్లిష్టమైన, ఆసక్తికరమైన ప్రతి సమాచారాన్ని ఆ ఫైళ్లలో చేర్చాలని ట్రంప్ పేర్కొన్నారు.

భూమికి ఆవల తెలివైన జీవం ఉందనడానికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. మార్చి 2024లో పెంటగాన్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. యూఏపీలు గ్రహాంతర సాంకేతికత అనడానికి తమ వద్ద ఆధారాలు లేవని.. అనుమానాస్పదంగా కనిపించిన చాలా వస్తువులు వాతావరణ బెలూన్లు, గూఢచారి విమానాలు, శాటిలైట్లు మాత్రమేనని స్పష్టం చేసింది. మరో వైపు, శత్రు దేశాలు ఏవైనా అత్యంత అధునాతన సాంకేతికతను పరీక్షిస్తున్నాయేమో అన్న ఆందోళనల నేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది.

 

Advertisement
 
Advertisement
Advertisement