అగ్రరాజ్యం అమెరికా సైనిక చర్యతో వెనెజువెలాపై విరుచుకుపడి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెనెజువెలా దేశం గత కొన్ని రోజులుగా వార్తల్లో హాట్‌టాపిక్ నిలిచింది. ఒక రకంగా అమెరికా ఈ దుందుడుకు చర్య కారణంగా వ్యతిరేకతనే ఎక్కువగా మూటగట్టుకుంది. ఇదంతా ఎలా ఉన్నా..అందమైన దేశం చిక్కుల్లో పడటం పర్యాటక ప్రేమికులనే కాదు ఇతర దేశాలను సైతం కదిలిచింది. ఎన్నో ప్రకృతి అద్భుతాలకు నెలవైన వెనెజువెలా ఇదివరకటిలా పరిస్థితి చక్కబడలని ఆశిస్తూ..అక్కడ అత్యంత పేరుగాంచిన ఏంజెల్ జలపాతం విశేషాల గురించి తెలుసుకుందామా..!.
వెనెజువెలాలో ఉన్న ఏంజెల్ జలపాతం అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. దాదాపు 979 మీటర్ల నుంచి పడుతుంది ఈ జలపాతం. భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన, నిరంతర జలపాతంగా పేరొందింది ఇది. అంతేగాదు నయాగరా జలపాతం కంటే 16 రెట్లు ఎత్తులో ఉంటుందట. ఈ నీరు ఆయాన్-టెపుయ్ అనే చదునైన పర్వతం పై నుండి పడిపోతుంది.
ఇక్కడ మాత్రమే కనిపించే పురాత టేబుల్ పర్వతం ఇది. నిజానికి ఇది జలపాతాన్ని చూస్తున్నట్లుగా ఉండదు. మేఘాలు గాల్లో కరిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి యునెస్కో గుర్తింపు కూడా ఉంది. ఆ అందమైన జలపాతం కనైమా నేషనల్ పార్క్‌లో ఉంది. దీని చుట్టూ పెద్ద నగరాలు, రహదారులు, జనసముహం ఉండుదు. దట్టమైన అడవి, వంకరలు తిరిగిన నదులు దాటి..నేరుగా కొండల నడుమ అందంగా కొలువుదీరి ఉంటుంది ఈ జలపాతం.
ఆ పేరు ఎలా వచ్చిందంటే..
1930లలో గాలి నుంచి జలపాతాన్ని మొదటిసారిగా గుర్తించిన అమెరికన్ పైలట్ జిమ్మీ ఏంజెల్ కారణంగా వచ్చిందట. అయితే, స్థానిక ప్రజలు దీనిని ఎల్లప్పుడూ 'కెరెపాకుపై మేరు' అని పిలుస్తారు. దీని అర్థం 'లోతైన ప్రదేశంలోని జలపాతం'. చమత్కారంగా ఈ రెండు పేర్లు దాని అద్భుతం, శక్తి గురించి చెప్పకనే చెబుతున్నాయి కదూ..!.
ఎలా చేరుకోవాలంటే..
ఏంజెల్ జలపాతాన్ని చేరుకోవడం అనేది ఒక సాహసం. ముందుగా సియుడాడ్ బోలివర్ లేదా ప్యూర్టో ఓర్డాజ్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి నేషనల్ పార్కు లోపల ఉన్న కనైమా క్యాంప్‌కు వెళ్లే చిన్న విమానంలో ఎక్కాలి. ఆ తర్వాత వంకరలు తిరుగుతున్న నదులలో పడవ ప్రయాణం చేసి.. వర్షారణ్యం గుండా ఒక చిన్న నడక. అయితే వర్షాకాలంలో నదులు నిండి ఉంటాయి అందువల్ల పడవ ప్రయాణం సులభతరమవుతుంది.
సందర్శించడానికి తగిన సమయం
ఏంజెల్ జలపాతాన్ని చూడాలనుకుంటే జూన్, నవంబర్ మధ్య సందర్శించడం మంచిది. వర్షాలు జలపాతాన్ని మరింత అందంగా చూపిస్తాయి. వర్షాలు లేని నెలల్లో కూడా ఇది అద్భుతమైన దృశ్యమే.
చూడాల్సిన కమనీయ ప్రదేశాలు..
ఏంజెల్ జలపాతం చూడటం హైలైట్, కానీ ఈ ప్రాంతం దీంతోపాటు మరిన్ని జాయ్‌ఫుల్‌నెస్‌నిచ్చేవి ఎన్నో ఉన్నాయి ఇక్కడ . పడవలో అడవి నదులలో మునిగిపోవడం, సహజ కొలనులలో ఈత కొట్టడం లేదా సమీపంలోని స్పష్టమైన నీటి మడుగులను అన్వేషించడం తదితరాలెన్నో ఉన్నాయి. అరుదైన వన్యప్రాణుల కోసం పార్క్ గుండా నడవాలి. ఉత్కంఠభరితమైన వైమానిక వీక్షణ కోసం చిన్న విమానంలో జలపాతం మీదుగా వెళ్లడం పర్యాటకులకు ఓ థ్రిల్.
(చదవండి: వామ్మో ఇదేం విచిత్రం..జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమా..?!)


