ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భోపాల్‌లో(మధ్యప్రదేశ్) ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్యురాలు ఇక లేదు. గత 24 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 24 ఏళ్ల డాక్టర్ రష్మి వర్మ తుది శ్వాస విడిచింది.
ఎయిమ్స్ భోపాల్‌లోని ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వర్మ డిసెంబర్ 11న అధిక మోతాదులో ఎనస్తీషియా ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అపస్మారక స్తితిలో ఉన్న ఆమెను భర్త అదే ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారు. అప్పటి నుండి వెంటిలేటర్ మద్దతుపై చికిత్స తీసుకుంటూ సోమవారం ఉదయం కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించామని ఎయిమ్స్ భోపాల్ అధికారి తెలిపారు. అయితే, ఈ సంఘటనపై కొనసాగుతున్న పోలీసు దర్యాప్తు కారణంగా మరిన్ని వివరాలను పంచుకోవడానికి నిరాకరించారు.
ఎయిమ్స్‌లో టాక్సిక్ వర్క్ కల్చర్ ఆరోపణలు
ఆమె సీనియర్ విభాగాధిపతి డాక్టర్ మొహమ్మద్ యూనస్ డా. వర్మను గత కొంతకాలంగా దీర్ఘకాలం మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. బలమైన ఆరోపణలున్నప్పటికీ, ఆసుపత్రి యాజమాన్యం మొదట్లో మౌనం వహించింది. అయితే బాధితురాలి ఆత్మహత్యా యత్నం, వైద్యుల సంఘాలు , పౌర సమాజం నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో డాక్టర్ మొహమ్మద్ యూనస్‌ను యాజమాన్యం తన పదవి నుండి తొలగించింది. తాత్కాలికంగా అనస్థీషియా విభాగానికి అటాచ్ చేసింది. ఈ విషయంపై రహస్య విచారణ నిర్వహించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ఆమె సహచరులు అందించిన వివరాల ప్రకారం, డాక్టర్ వర్మ డిసెంబర్ 11న తన డ్యూటీని పూర్తి చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె భర్త, ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రతన్ వర్మ, ఆమె అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆమెను ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు.
ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్
గుండెపోటు , మెదడుకు నిలిచిపోయిన ఆక్సిజన్
అత్యవసర విభాగానికి చేరుకునేసమయానికి ఆలస్యం జరిగిపోయింది. దాదాపు 25 నిమిషాలు కావడంతో ఆమె గుండె దాదాపు ఏడు నిమిషాలు కొట్టుకోవడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారు.వెంటనే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ప్రారంభించారు. మూడు రౌండ్ల పునరుజ్జీవనం తర్వాత, గుండె స్పందించింది. కానీ మెదడుకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా, అప్పటికే తీవ్రమైన నాడీ సంబంధిత నష్టం జరిగింది. గుండెపోటు సమయంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మెదడు కణజాలానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని కోలుకునే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు వివరించారు. ఆసుపత్రిలో చేరిన 72 గంటల తర్వాత నిర్వహించిన MRI స్కాన్‌లో మెదడు డ్యామేజ్, దీర్ఘకాలిక ఆక్సిజన్ కొరత ఉన్నట్లు ఆధారాలు వెల్లడయ్యాయని ఎయిమ్స్ భోపాల్ గతంలో పేర్కొంది.
మంచి మనిషిని, టీచర్‌ను కోల్పోయాం
ఐదేళ్లకు పైగా బోధనా అనుభవంతో, ఆమె క్లినికల్ నైపుణ్యం ఆమె సొంతమని ప్రధానంగా రోగులు పట్ల చాలా దయతో ఉండేదని విద్యార్థులు సహచరులు గుర్తు చేసుకున్నారు. తన సొంత డబ్బులను రోగుల చికిత్స కోసం చెల్లించేదని కంటతడిపెట్టారు. ఆమె మరణించే సమయానికి బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్, నర్సింగ్ శిక్షణా సెషన్‌లకు ఇన్‌ఛార్జ్ ఫ్యాకల్టీగా, నోడల్ ఆఫీసర్‌గా కూడా పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: 5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యం
కాగా డాక్టర్ వర్మ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని MLN మెడికల్ కాలేజీ నుండి MBBS పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్‌లో MD డిగ్రీ చదివారు. AIIMS భోపాల్‌లో అనేక పరిపాలనా బాధ్యతలను కూడా నిర్వహించారు. అలాగే LN మెడికల్ కాలేజీ, పీపుల్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMS), భోపాల్‌లో కూడాసేవలందించారు.
ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం


