'నాన్న-పులి' కథ చాలామందికి తెలిసే ఉంటుంది. ఏం చెప్పినా నిజాయితీగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే రిస్క్. వందల కోట్లతో డీల్ చేసే సినిమా ఇండస్ట్రీలోనూ ప్రేక్షకులతో పరాచకాలు ఆడకూడదు. ఎందుకంటే దక్షిణాదిలో కొందరు దర్శకులు సినిమాలతో బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నారు. కానీ తమ క్రియేటివిటీతో థియేటర్‌కి వచ్చేవాళ్లని మోసం చేస్తున్నారు. తాజాగా వచ్చిన 'రాజాసాబ్'తో మరోసారి అలాంటిదే రిపీటైంది.
(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)
'రాజాసాబ్'నే తీసుకుందాం. ప్రభాస్.. ఓల్డ్ గెటప్‌ని ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో చూపించారు. ఈ గెటప్‌కి అదిరిపోయే డైలాగ్స్, ఫైట్ సీక్వెన్స్ ఉందని ఊరించి అభిమానులకు ఆశలు పెంచేశారు. కట్ చేస్తే మూడు గంటల సినిమాలో దీనికి సంబంధించిన ఒక్క సీన్ లేదు. కథకు అడ్డొస్తుందని తీసేశారా? సీక్వెల్ కోసం దాచుకున్నారా? తెలియదు. ఇప్పుడొచ్చిన ఫస్ట్ పార్ట్‌లో ఇది ఉండదు అని ఫిక్సయినప్పుడు.. ప్రమోషన్లలో వీటిని ఉపయోగించడం అవసరమా? అసలు సినిమాకు కాస్తోకూస్తో హైప్ ఏర్పడిందే ఈ లుక్ వల్ల. అలాంటి ఈ గెటప్ సీన్స్ తీసేస్తే.. ప్రేక్షకుల్ని మోసం చేసినట్లేగా!
గతంలోనూ ఇలాంటి షాకులే స్టార్ హీరోల సినిమాలతో దర్శకులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళ దర్శకుడు శంకర్.. చాన్నాళ్ల క్రితమే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. 'రోబో' తర్వాత విక్రమ్ హీరోగా 'ఐ' అనే స్ట్రెయిట్ సినిమా తీశాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌లో విక్రమ్ బీస్ట్(జంతువు గెటప్)లా కనిపించడం చూసి అంతా వావ్ అని ఆశ్చర్యపోయారు. లుక్కే ఇంత బాగుందంటే సినిమాలో ఆయా సీన్స్ ఇంకెలా ఉంటాయోనని తెగ ఊహించేసుకున్నారు. కట్ చూస్తే పాటలో ఒకటి రెండు సీన్స్‌లో మాత్రమే దీన్ని చూపించి మోసం చేశారు!
(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)
మహేశ్ బాబు 'స్పైడర్' సినిమా నుంచి తొలి గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు.. మెషీన్ స్పైడర్‌ని చూపించి హైప్ ఇచ్చారు. కానీ దీన్ని సినిమాలో ఎక్కడా పెట్టలేదు. ప్రమోషన్ కోసమే చేసింది ఇది అని అభిమానులు, ప్రేక్షకులకు ముందే చెప్పి ఉంటే బాగుండేది. కానీ మూవీ టీమ్ అలా చేయలేదు. తీరా సినిమా రిలీజయ్యా ప్రేక్షకులు.. చాలా డిసప్పాయింట్ అయ్యారు. దర్శకుడిని గట్టిగా తిట్టుకున్నారు.
రజనీకాంత్ 'కూలీ' ఫస్ట్ లుక్, గ్లింప్స్‌లో గోల్డెన్ వాచీలని హైలైట్ చేసి చూపించారు. దీంతో చాలామంది ఆడియెన్స్.. ఇదేదో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అని రకరకాల థియరీలు వేసుకున్నారు. అది వాచీల స్మగ్లింగ్ కోసమే అని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీరా రిలీజైన తర్వాత మూవీ చూస్తే ఈ వాచీల కాన్సెప్ట్‌కి సినిమాలో అసలు ప్రాధాన్యమే లేదు. ఇది తెలిసి చాలామంది ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఇలా పలుమార్లు పలువురు దర్శకులు.. ఫస్ట్ లుక్‌తో ఒకలా, మూవీలో ఆ కాన్సెప్ట్ మరోలా చూపించి మోసం చేశారు!
(ఇదీ చదవండి: జనవరి 10.. టాలీవుడ్ భయపడుతోందా?)


