‘‘రవితేజగారు అద్భుతమైన నటుడు. ఆయనతో కలసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నటించడం హ్యాపీగా ఉంది. వినోదం, భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ మూవీలో మానస శెట్టిగా ఈ తరం అమ్మాయిలు రిలేట్ అయ్యే క్యారెక్టర్ చేశాను. నా పీఏ క్యారెక్టర్‌లో సత్య కనిపిస్తారు. రవితేజ, సునీల్‌గార్లు, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను... అందరూ అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటులు. వాళ్ల టైమింగ్‌ని మ్యాచ్ చేయడం సవాల్ అనిపించింది’’ అని ఆషికా రంగనాథ్ తెలిపారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు.
ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి విలేకరులతో మాట్లాడారు. ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘నా సామి రంగ’లోని ΄ాత్రతో పోల్చుకుంటే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో చేసిన పాత్ర వైవిధ్యంగా ఉంటుంది.
ప్రస్తుతం ‘విశ్వంభర, సర్దార్ 2, అది నా పిల్లరా’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. డింపుల్ హయతి మాట్లాడుతూ– ‘‘కిశోర్ తిరుమలగారు ఈ కథ చెప్పగానే రవితేజగారి భార్య బాలామణి పాత్ర చేయాలనుకున్నాను. ‘ఖిలాడి’ మూవీ తర్వాత రవితేజగారితో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. డైరెక్టర్‌గారు ప్రతిదీ నటించి, చూపించారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరూ రిలేట్ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’’ అని పేర్కొన్నారు.


