ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ | Mumbai to varanasi a Girl Aarohi hearfelt rescue story | Sakshi
Sakshi News home page

ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ

Nov 24 2025 3:44 PM | Updated on Nov 24 2025 4:57 PM

Mumbai to varanasi a Girl Aarohi hearfelt rescue story

ఒడిలో ఆదమర్చి నిద్రపోతున్న బిడ్డ అకస్మాత్తుగా మాయమైపోతే.. ఆ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి  బాధ వర్ణనాతీతం. ఎవరెత్తుకుపోయారో.. ఏం  చేశారో, ఏమైపోయిందో.. అసలు బతికి ఉందో లేదో తెలియక  ప్రతీక్షణం నరకయాతన తప్పదు.  ఆరు నెలలు పాటు  మానసిక క్షోభను అనుభవించారో తల్లితండ్రులు.

కానీ ఆ బిడ్డ ఆచూకీ దొరికేదాకా పోలీసులు కూడా అదే ఆవేదనను అనుభవించడమే ఈ వార్తలోని ప్రత్యేకత. చిన్నారి దొరికేదాకా వారికి ఊపిరి ఆడలేదు. సొంత బిడ్డ పోయినట్టుగా విలవిల్లాడి పోయారు. రాత్రింబవళ్లు కష్టపడ్డారు.  చివరికి ఆరు నెలలకు వారి కష్టం ఫలించింది. అలా ఈ ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం అనుకోకుండా అటు తల్లి దండ్రుల జీవితాల్లోనూ, ఇటు పోలీసు అధికారుల జీవితాల్లోనూ ఒక మర్చిపోలేని  మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.

అసలు కథ ఏంటంటే..
అది మే 20, (2025)రాత్రి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌. షోలాపూర్‌కు చెందిన  ఒక సాధారణ జంట. తమ కలల పంట అయిన నాలుగేళ్ల  ఆరోహిని వెంట బెట్టుకొని ఈ దంపతులు, తన తండ్రి చికిత్స కోసం ముంబైకి వచ్చారు.  ప్రయాణంలో అలసిపోయారు. కాసేపు సేద దీరుతామని అలా కూర్చున్నారు. ఇంతలో తల్లిగా మాగన్నుగా నిద్ర పట్టింది.  ఉన్నట్టుండి ఒడిలో ఉన్న బిడ్డ మాయమైపోయింది. కళ్లు మూసి తెరిచేలోపే అంతా జరిగిపోయింది. దీంతో కంటిధారగా విలపించిన వారు పోలీసులను ఆశ్రయించారు. అనేక సార్లు అధికారులను వేడుకున్నారు. బిడ్డ ఫోటోను రైళ్లలో, మురికివాడల్లో, అనాథాశ్రమాలలో అపరిచితులకు చూపించారు. అలా ఆరు నెలలు తిండీ తిప్పలు లేకుండా  గడిపారు. కళ్లుమూసినా, తెరిచినా ‘‘ఆరోహి…ఆరోహి’’ ఒకటే ఒకటే ధ్యాస. బిడ్డ ఏమైపోయిందీ అనీ. మాయ దారి నిద్ర బిడ్డను దూరం చేసిందనే బాధతో నిద్రకే దూరమయ్యారు.

అటు ముంబై పోలీసులుకూడా ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఆరోహి పోస్టర్‌లను ముద్రించారు, లోకమాన్య తిలక్ టెర్మినస్ నుండి భూసావల్ నుండి వారణాసి కాంట్ వరకు ప్రతి ప్లాట్‌ఫామ్‌పైనా అతికించారు. పేపర్లలలో ప్రకటనలు ఇచ్చారు. మరో విధంగా చెప్పాలంటే చేయని ప్రయత్నం లేదు. చివరికి జర్నలిస్టులను సంప్రదించారు. కొంతమంది అధికారులైతే చిన్నారిని తమ సొంత బిడ్డలా భావించి  ఫోటోను తమ చొక్కా జేబుల్లో పెట్టుకొని మరీ ఆచూకీ కోసం  ప్రయత్నించారు.

ఆనందం వెల్లివిరిసిన క్షణాలు
నవంబర్ 13న, వారణాసిలోని ఒక స్థానిక రిపోర్టర్  ఆరోహి పోస్టర్‌  చూశాడు. అంతే అతడి బుర్రలో ఏదో క్లిక్ అయింది. నిద్రలో మరాఠీ పదాలు మాట్లాడే  ఒక అమ్మాయిని  గురించి తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. మరుసటి రోజు ఉదయం, ముంబై పోలీస్ ఇన్‌స్పెక్టర్ వారణాసిలో ల్యాప్‌టాప్ ముందు కూర్చుని వీడియో కాల్చేవాడు. అపుడు స్క్రీన్‌పై ఒక అద్భుతమైన దృశ్యం  కనిపించింది. పింక్ ఫ్రాక్‌లో  తన పాప. అదృశ్యమైన రోజుధరించింది అదే రంగుగౌను. ముంబైలో అధికారి వెనుక నిలబడి ఉన్న తల్లి తన కూతుర్ని తల్లికి నోట మాట రాలేదు.  తండ్రి మాత్రం  కళ్లనీళ్లతో సంతోషంగా "అది నా ఆరోహి... అది నా బిడ్డ..." అని   అరవడం మొదలు పెట్టాడు.

అంతే వేగంగా  స్పందించిన పోలీసులు  విమానంలో పాపను  తీసుకొచ్చారు.   ముంబై క్రైమ్ బ్రాంచ్ మొత్తం  అక్కడ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కొత్త బెలూన్లు , నీలి రంగు కొత్త ఫ్రాక్‌. కానీ  చిన్నారి  బయటకు వచ్చి ఖాకీ యూనిఫాంల సముద్రాన్ని చూసి తొలుత నివ్వెర పోయింది. మరుక్షణం పరుగెత్తుకుంటూ వచ్చి చేతులు  చాచి, ఆమె సమీపంలోని అధికారిని మెడ చుట్టూ చేతులు వేసి చుట్టేసింది. ఆరు నెలలు మాయమైపోయిన అందమైన చిరునవ్వుతో, స్వచ్ఛంగా, నోరారా విరబూసిననవ్వులు చూసిన ప్రతీ హృదయం  ఆనందంతో ఒప్పొంగి పోయింది. 

తల్లిదండ్రులైతే నిశ్చేష్టులైపోయారు. గొంతు పూడుకుపోయింది. అడుగు ముందుకు పడలేదు. దీంతో పోలీసులే ఆమెను కన్నవారి వద్దకు తీసుకెళ్లారు. తల్లి  బిడ్డను తడిమితడిమి చూసుకుంది. ఆరు నెలలపాటు దూరమైన తన బంగారాన్ని ఆత్రంగా నిమురుకుంది. తండ్రి అయితే ఆ చిన్ని పాదాలపై మోకరిల్లిపోయాడు. ఇది నిజమేనా అనుకుంటూ బిడ్డ, భగవంతుడా నా బిడ్డను నాకు తిరికి నాకిచ్చావు అంటూ ఆ తల్లిదండ్రులు ఒకర్నొకరు తడిమి తడిమి చూసుకున్నారు.  ఒకరి కన్నీరు ఒకరు తుడుచుకున్నారు. ఆరు నెలల ఆవేదన, చీకటి వారి కౌగిలింతలు, ముద్దుల్లో దూదిపింజలా తేలిపోయింది.

ఇంతకీ పాప ఎక్కడెళ్లిపోయింది
రైల్వే స్టేషన్‌లో మాయమైన  పాప, వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వారణాసిలో తేలింది.  ఆమెను ఎత్తుకుపోయిన కిడ్నాపర్‌ చెరనుంచి తప్పించుకుందో, లేదంటే వాళ్లే వదిలివేశారో తెలియదు కానీ,  జూన్‌లో రైల్వే పట్టాల దగ్గర ఏడుస్తూ, చెప్పులు లేకుండా, బిక్కు  బిక్కు మంటూ కనిపించడంతో, అనాథాశ్రమం అక్కున చేర్చుకుంది.   నీడనిచ్చి  కొత్త పేరు కూడా ఇచ్చింది. తన అసలు పేరు గుర్తులేని ఆ చిన్నారి “కాశీ”గా మారిపోయింది. కానీ  రాత్రిళ్లు మాత్రం దుప్పటి అంచుని పట్టుకుని "ఆయ్" (మరాఠీలో  అమ్మ) అని  మౌనంగా రోదించేది. ఆ జ్ఞాపకమే ఆమెను కన్నతల్లి ఒడికి తిరిగి తీసుకెళ్లింది.

కిడ్నాపర్ మాత్రం ఎవరు?ఏంటి అనేది మాత్రం తెలియదు. కానీ ముంబైలో తప్పిపోయి, కాశీలో తేలి, తిరిగి తల్లి ఒడికి  చేరింది. ఇలాంటి తప్పిపోయిన పిల్లలను తిరిగి కన్న ఒడికి చేర్చే ఇలా కన్నీటి గాథలు విన్నపుడు ఖాకీలు కూడా మనుషులే. వారిలోనూ మానవత్వం ఉంది అన్న మాటలు అక్షర సత్యాలు అనిపించకమానదు.  హ్యాట్సాఫ్‌..!

ఆనంద్‌ మహీంద్ర పొగడ్తలు 
మోహిని మహేశ్వరి అనే ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్‌ అయిన ఈ  ఘనటపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర  ఎక్స్‌లో స్పందించారు. ముంబై పోలీసులను ప్రశంసించారు.  మీరు  ఆశను, ఆనందాన్ని గొప్ప బహుమతిగా ఇచ్చారు.  ఈ ఒక్క కారణంతోనే మీరు మీరు ప్రపంచంలోని అత్యుత్తమ దళాలలో ఒకరు అంటూ కొనియాడటం విశేషం. ఈ కథనం నెట్టింట వైరల్‌గా మారింది.ముంబై పోలీసులపై చిన్మయి శ్రీపాద, ఇతర సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా అభినందనలు వెల్లువెత్తాయి 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement