ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పంజాబ్ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మకు చుక్కలు చూపించాడు.
15 బంతుల్లోనే
అభిషేక్ శర్మ (Abhishek Sharma) వేసిన ఓవర్లో సర్ఫరాజ్ వరుసగా 6,4,6,4,6,4 బాదాడు. వన్‌డౌన్‌లో వచ్చి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఒకే ఓవర్లో ఏకంగా ముప్పై పరుగులు పిండుకున్నాడు. వన్డే మ్యాచ్‌లో టీ20 తరహాలో విశ్వరూపం ప్రదర్శిస్తూ కేవలం.. 15 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు.
మార్కండే బౌలింగ్‌లో
పంజాబ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan).. 62 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే, మయాంక్ మార్కండే బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగడంతో సర్ఫరాజ్ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
అభిషేక్ ఫెయిల్
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూపులో భాగంగా.. జైపూర్ వేదికగా పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ అభిషేక్ శర్మ (8) సహా మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11).. వన్‌డౌన్ బ్యాటర్ హర్నూర్ సింగ్ డకౌట్ కావడంతో ఆదిలోనే పంజాబ్‌కు షాక్ తగిలింది.
అన్మోల్, రమణ్ అర్ధ శతకాలు
ఈ క్రమంలో అన్మోల్‌ప్రీత్ సింగ్ అర్ధ శతకం (57)తో రాణించగా.. నమన్ ధిర్ (22) అతడికి సహకరించాడు. ఇక రమణ్‌దీప్ సింగ్ సైతం హాఫ్ సెంచరీ (72)తో ఆకట్టుకున్నాడు. అయితే, మిగతా వారంతా తేలిపోవడంతో 45.1 ఓవర్లలో కేవలం 216 పరుగులు చేసి పంజాబ్ ఆలౌట్ అయింది.
ముంబై బౌలర్లలో సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగగా.. శివం దూబే, శశాంక్ అట్రాడే, ఓంకార్ తుకారాం టర్మాలే తలా రెండు వికెట్లు కూల్చారు. సాయిరాజ్ పాటిల్‌కు ఒక వికెట్ దక్కింది. నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై ధనాధన్ బ్యాటింగ్‌తో విజయం దిశగా పయనించిన ముంబై.. అనూహ్య రీతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.
చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్.. సెలక్టర్లు పట్టించుకోరుగా!


