ముంబైకి ఊహించని షాకిచ్చింది పంజాబ్. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆఖరికి అభిషేక్ శర్మ సేన పైచేయి సాధించడంతో.. శ్రేయస్ అయ్యర్ బృందానికి నిరాశ తప్పలేదు.
పంజాబ్ టాపార్డర్ కుదేలు
దేశీ వన్డే టోర్నీ తాజా ఎడిషన్ ఎలైట్ గ్రూపులో భాగంగా గురువారం ముంబై- పంజాబ్ జట్లు తలపడ్డాయి. జైపూర్ వేదికగా టాస్ ఓడిన పంజాబ్.. ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ముంబై బౌలర్ల దెబ్బకు పంజాబ్ టాపార్డర్ కుదేలైంది.
ఆదుకున్న అన్మోల్, రమణ్‌దీప్
టీమిండియా విధ్వంసకర ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ (8), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11), హర్నూర్ సింగ్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్ట దశలో అన్మోల్‌ప్రీత్ సింగ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ (75 బంతుల్లో 57) ఆడగా.. నమన్ ధిర్ (22) ఫర్వాలేదనిపించాడు.
216 పరుగులు
ఆరో స్థానంలో వచ్చిన రమణ్‌దీప్ సింగ్ అర్ధ శతకం (74 బంతుల్లో 72) సాధించగా.. బౌలర్లు హర్‌ప్రీత్ బ్రార్ (15), సుఖ్‌దీప్ బజ్వా (17) తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా 45.1 ఓవర్లలో పంజాబ్ 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. శశాంక్ అట్రాడే, ఓంకార్ తుకారాం టర్మాలే, శివం దూబే తలా రెండు వికెట్లు తీశారు. సాయిరాజ్ పాటిల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం
నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై శుభారంభమే అందుకుంది. ఓపెనర్లు అంగ్‌క్రిష్ రఘువన్షి (23), ముషీర్ ఖాన్ (21) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం (20 బంతుల్లో 62) సాధించాడు.
శ్రేయస్ అయ్యర్ ధనాధన్
ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధనాధన్ దంచికొట్టగా (34 బంతుల్లో 45).. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ (15) మరోసారి విఫలమయ్యాడు. శ్రేయస్ అవుటైన తర్వాత ముంంబై వేగంగా వికెట్లు కోల్పోయింది. శివం దూబే (12), హార్దిక్ తామోర్ (15) విఫలం కాగా.. సాయిరాజ్ పాటిల్ (2), శశాంక్ (0), ఓంకార్ (0) కనీస పోరాటపటిమ కనబరచలేకపోయారు. షామ్స్ ములానీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.
ఒకే ఒక్క పరుగు తేడాతో
అయితే, పంజాబ్ బౌలర్ల దెబ్బకు 26.2 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ముంబై చాపచుట్టేసింది. దీంతో పంజాబ్ ఒకే ఒక్క పరుగు తేడాతో జయభేరి మోగించింది. పంజాబ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, పేసర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గుర్నూర్ బ్రార్ చెరో నాలుగు వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. మిగతా వారిలో హర్‌ప్రీత్ బ్రార్, హర్నూర్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్.. సెలక్టర్లు పట్టించుకోరుగా!


