న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని తుర్క్‌మన్ గేట్ వద్ద బుధవారం జరిగిన హింసాత్మక ఘటనలో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించారు. ఐదుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ఈ అల్లర్లకు సంబంధించిన ఆధారాల కోసం పోలీసులు సోషల్ మీడియాలో కనిపిస్తున్న సుమారు 400 వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులు, పోలీసులు ముఖాముఖి తలపడిన దృశ్యాలు ఈ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకలు పోలీసులపై రాళ్లు, గాజు సీసాలతో దాడి చేస్తున్న దృశ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆ వీడియోల ద్వారా మరికొంతమందిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసుకు సంబంధించి సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాంపూర్ ఎంపీ మోహిబుల్లా నద్వీకి దర్యాప్తులో పాల్గొనాలంటూ పోలీసులు నోటీసులు పంపనున్నారు. హింస జరగడానికి కొద్దిసేపటి ముందు ఆయన ఫైజ్-ఎ-ఇలాహీ మసీదు వద్దకు చేరుకున్నారని, ఆ సమయంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ ఘర్షణ వెనుక ఆయన పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు తుర్క్‌మన్ గేట్ సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు ఎంసీడీ (ఎంసీడీ) అధికారులు బుధవారం తెల్లవారుజామున చర్యలు చేపట్టారు. అయితే మసీదును కూల్చివేస్తున్నారనే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో రావడంతో, వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. కొందరు నిరసనకారులు రాళ్ల వర్షం కురిపించగా, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, భాష్పవాయువును ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సోలీసు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘మిఠాయిల రాజధాని’ ఎక్కడ?.. ఏ స్వీట్‌కు ఐజీ ట్యాగ్?


