పండుగ అనగానే అందరికీ ముందుగా స్వీట్లు గుర్తుకువస్తాయి. ఉత్సవాలు, వేడుకల్లో తీపి పదార్థాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కేవలం పండుగలనే కాదు.. దేశంలో ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అక్కడ తీపి పదార్థాలు తప్పక కనిపిస్తాయి. రాబోయే సంక్రాంతి సందర్బంగా ‘స్వీట్ క్యాపిటల్ ఆప్ ఇండియా’ ఎక్కడుంది? అక్కడ లభించే తీపి పదార్థాల ప్రత్యేకత ఏమిటి? మొదలైన అంశాలపై ప్రత్యేక కథనం..
సంస్కృతిలో మిఠాయిల ప్రాముఖ్యత
భారతదేశంలో మిఠాయిలకు ఉన్న ప్రాధాన్యత చెప్పనలవి కాదు. పండుగలు, శుభకార్యాల నుండి సాదాసీదా వేడుకల వరకు ప్రతి సందర్భంలోనూ మిఠాయిలు అంతర్భాగంగా కనిపిస్తాయి. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన రుచులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ, దేశంలోని ఆ నగరం మాత్రం ‘మిఠాయిల రాజధాని’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సుదీర్ఘమైన వంటకాల చరిత్రతో, అద్భుతమైన రుచులతో ఆ నగరం లక్షలాది మంది ఆహార ప్రియుల మనసు గెలుచుకుంది. అదే పశ్చిమ బెంగాల్‌లోని ‘కోల్‌కతా’. బెంగాలీ మిఠాయిలకు నిలయమైన కోల్‌కతాను ‘స్వీట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు.
కళాత్మకమైన తయారీ విధానం
కోల్‌కతాలో మిఠాయిల సంస్కృతికి ఘనమైన చరిత్ర ఉంది. తీపి పదార్థాల కళాత్మక తయారీ విధానం, అద్భుతమైన రుచులు ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. తాజా ఛానా (పనీర్), బెల్లం, సుగంధ ద్రవ్యాల కలయికతో ఇక్కడ తయారయ్యే స్వీట్లు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. పండుగ సమయాల్లోనే కాకుండా, సాధారణ రోజుల్లో కూడా నగరంలోని మిఠాయి దుకాణాలు వినియోగదారులతో రద్దీగా ఉంటాయి.
‘జిఐ ట్యాగ్’తో నోరూరించే రసగుల్లా
కోల్‌కతా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఎంతో మృదువైన రసగుల్లా. ఛానా, రవ్వతో తయారుచేసి, చక్కెర పాకంలో నానబెట్టిన ఈ తీపి ఉండలకు ‘జిఐ ట్యాగ్’ (భౌగోళిక గుర్తింపు) కూడా లభించింది. కేసీ దాస్ తదితర సంస్థలు రసగుల్లాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చాయి. రసగుల్లాకున్న మెత్తని ఆకృతి, మితమైన తీపి కారణంగా, ఇది ప్రపంచవ్యాప్తంగా స్వీట్ లవర్స్‌కు ఆల్-టైమ్ ఫేవరెట్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు.
సందేష్.. డ్రై ఫ్రూట్స్ అలంకరణతో..
ఛానా, చక్కెర, కుంకుమపువ్వు, పిస్తా, చాక్లెట్ తదితర రుచులను జోడించి తయారుచేసే ‘సందేష్’ కోల్‌కతాలో లభ్యమయ్యే మరో అద్భుతమైన స్వీట్. దీని సున్నితమైన ఆకృతి, మితమైన తీపి దీనిని ఒక ప్రత్యేకమైన డెజర్ట్‌గా మార్చివేసింది. సందేష్‌ను డ్రై ఫ్రూట్స్, వెండి రేపర్‌తో అలంకరిస్తారు, ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఎంతో అందంగా కనిపిస్తుంది.
మిష్టీ దోయ్: సంప్రదాయ పెరుగు
కోల్‌కతా స్వీట్ మెనూలో ‘మిష్టీ దోయ్’ (తీపి పెరుగు)కు ప్రత్యేక స్థానం ఉంది. మట్టి పాత్రలలో పాలను సన్నని సెగపై వేడి చేసి, చక్కెర కలిపి నిల్వచేయడం ద్వారా ‘మిష్టీ దోయ్’కి మంచి రంగు, రుచి వస్తాయి. మట్టి పాత్రలో తయారు చేయడం వల్ల దీనికి ఒక రకమైన మట్టి వాసన కూడా వస్తుంది. ఇది ‘మిష్టీ దోయ్’కి అద్భుతమైన రుచిని అందిస్తుంది. బెంగాలీయుల ఇళ్లలో భోజనం తర్వాత ఇది తప్పనిసరిగా మారింది.
చంచం: రంగురంగుల స్వీట్
కోల్‌కతాలోని మరో ప్రసిద్ధ మిఠాయి ‘చంచం’. రంగురంగులతో ఓవల్ ఆకారంలో ఉండే ఈ మిఠాయిని ఛానాతో తయారు చేసి, చక్కెర పాకంలో నానబెడతారు. వీటిపై ఎండు కొబ్బరి పొడి లేదా కోవాను చల్లడం వల్ల చంచం మరింత రుచికరంగా మారుతుంది. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ స్వీట్, పండుగలు, వేడుకల సమయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
శీతాకాలం స్పెషల్స్
శీతాకాలంలో లభించే తాటి బెల్లం (నోలెన్ గుర్)తో చేసే రసగుల్లాలు, సందేష్‌లు అందరినీ నోరూరింపజేస్తాయి. ఈ బెల్లం మిఠాయిలకు ఒక ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. కాలానుగుణంగా లభించే ఈ మిఠాయిల కోసం స్థానికులు, పర్యాటకులు ఏడాది పొడవునా వేచి చూస్తుంటారు. ఇది కేవలం తీపి పదార్థం మాత్రమే కాదని, ఒక భావోద్వేగం అని స్థానికులు చెబుతుంటారు.
తీపి అనుభూతులు
కోల్‌కతా తీపి చురుచుల సంస్కృతి భారతీయ వంటకాల గొప్పతనానికి ఒక నిదర్శనంగా నిలిచింది. రసగుల్లా నుండి నోలెన్ గుర్ వరకు.. ప్రతి మిఠాయి ఒక తీపి గుర్తును అందిస్తుంది. తీపిని అమితంగా ఇష్టపేడేవారికి కోల్‌కతా అత్యుత్తమ గమ్యస్థానం అని చెప్పుకోవచ్చు. కోల్‌కతాలోని ప్రతి వీధిలోనూ కనిపించే పురాతన మిఠాయి దుకాణాలు అందరికీ స్వాగతం పలుకుతూ, మరువలేని తీపి అనుభూతులను మిగులుస్తాయి.
ఇది కూడా చదవండి: సంక్రాంతికి 150 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..


