మూలధన వ్యయం నిధుల వినియోగంలో ఏపీ స్థానం ఎంతంటే.. | UP Received Highest Allocation Of Funds Under SASCI Usage Of Funds, US Gets The Largest Share | Sakshi
Sakshi News home page

మూలధన వ్యయం నిధుల వినియోగంలో ఏపీ స్థానం ఎంతంటే..

Jan 13 2026 8:34 AM | Updated on Jan 13 2026 10:11 AM

UP received highest allocation of funds under SASCI usage of funds

రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయం-స్కీమ్‌ ఫర్‌ స్పెషల్‌ అసిస్టెంట్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(SASCI)’ పథకం కింద నిధులను పొందడంలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2026 బడ్జెట్ ప్రతిపాదనల నేపథ్యంలో వెలువడిన గణాంకాల ప్రకారం, యూపీ తర్వాత మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు అత్యధిక నిధులు పొందిన జాబితాలో ఉన్నాయి.

నిధుల కేటాయింపు వివరాలు

కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం, ఈ పథకం కింద రాష్ట్రాలకు 50 ఏళ్ల కాలపరిమితితో వడ్డీ లేని రుణాలను కేంద్రం అందజేస్తోంది. ఇందులో భాగంగా 2025-26 బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1.5 లక్షల కోట్లను కేటాయించగా, జనవరి 4, 2026 నాటికి రూ.83,600 కోట్లను రాష్ట్రాలకు విడుదల చేశారు. అయితే అక్టోబర్ 2020 నుంచి ఇప్పటి వరకు (జనవరి 4, 2026 వరకు) ఈ పథకం కింద మొత్తం రూ.4.50 లక్షల కోట్లను రాష్ట్రాలకు అందజేశారు. గత మూడేళ్ల డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు రూ.52,000 కోట్లు, మధ్యప్రదేశ్, బిహార్‌కు చెరో రూ.36,000 కోట్లు, మహారాష్ట్ర, అస్సాంకు రూ.23,000 కోట్లకు పైగా కేటాయించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.21,590 కోట్లు కేటాయించడంతో ఏడో స్థానంలో నిలిచింది.

పథకం నేపథ్యం - ప్రాధాన్యత

కొవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు, రాష్ట్రాల్లో ఆస్తుల కల్పనను వేగవంతం చేయడానికి కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదట రూ.12,000 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం, రాష్ట్రాల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో 2025-26 నాటికి రూ.1,50,000 కోట్లకు చేరుకుంది. రాష్ట్రాలు తమకు నచ్చిన మూలధన ప్రాజెక్టుల కోసం ఈ నిధులను వాడుకోవచ్చు. కేంద్రం నిర్దేశించిన నిర్దిష్ట రంగాల్లో సంస్కరణలు చేపట్టినందుకు ప్రోత్సాహకంగా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు.

బడ్జెట్ వేళ రాష్ట్రాల విజ్ఞప్తి

ఇటీవల జరిగిన బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో మెజారిటీ రాష్ట్రాలు ఎస్‌ఏఎస్‌సీఐ పథకాన్ని మరిన్ని నిధులతో కొనసాగించాలని కోరాయి. మూలధన వ్యయం వల్ల ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయని, ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి మరింత ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందనే అభిప్రాయాలున్నాయి.

ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు యాపిల్ అత్యవసర హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement