కొంచెం రిస్క్‌ ఉన్నా.. లాభం రావాలంటే? | ICICI Prudential Business Cycle Fund Details | Sakshi
Sakshi News home page

కొంచెం రిస్క్‌ ఉన్నా.. లాభం రావాలంటే?

Feb 23 2026 7:29 PM | Updated on Feb 23 2026 9:29 PM

ICICI Prudential Business Cycle Fund Details

ఈక్విటీలలో థీమ్యాటిక్‌/సెక్టోరల్‌ ఫండ్స్‌ అన్నవి కొంచెం రిస్క్‌ ఉన్నా సరే, రాబడులు కూడా బలంగా ఉండాలని కోరుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. ఇవి తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌ మాత్రం భిన్నమైన, మెరుగైన పనితీరుతో ఆకర్షిస్తోంది. ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని వైవిధ్యం కోసం కేటాయించుకోవాలని భావించేట్టు అయితే.. ఈ ఫండ్‌ను పరిశీలించొచ్చు.

రాబడులు
ఈ పథకం 2021 జనవరిలో ప్రారంభమై.. ఐదేళ్ల ట్రాక్‌ రికార్డును పూర్తి చేసింది. ఈ పథకం ఆరంభంలో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేసి ఉంటే అది రూ.2.51లక్షలుగా మారి ఉండేది. ఐదేళ్లలోనూ ఏటా 20.56 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇదే కాలంలో నిఫ్టీ 500 టీఆర్‌ఐ రాబడి 15.47 శాతమే ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో పెట్టుబడులపై 18 శాతం రాబడిని అందించింది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడి 22.82 శాతంగా ఉంది. ఇక ఇదే విభాగంలో ఇతర పథకాలతో పోలి్చతే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌ ట్రాక్‌ రికార్డు పటిష్టంగా ఉంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఆరంభం నుంచి ఈ పథకంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే రూ.6.10 లక్షలు ఐదేళ్లలో రూ.9.74 లక్షలుగా మారి ఉండేది. అంటే ఏటా 18.47 కాంపౌండెడ్‌ రాబడి (సీఏజీఆర్‌)కి సమానం.

పెట్టుబడుల విధానం..
బిజినెస్‌ సైకిల్స్‌ అంటే.. కొన్ని వ్యాపారాలకు ఒక్కో సమయంలో డిమాండ్‌ బలంగా ఉంటుంది. ప్రస్తుతం మెటల్స్‌లో బంగారం, వెండి, అల్యూమినియం, రాగి ధరలు గణనీయంగా పెరగడం, ఈ రంగాల్లోని కంపెనీలు బలంగా లాభాలు ఆర్జించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సైకిల్స్‌ను ఈ ఫండ్‌ ముందే గుర్తించి ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. స్థూల ఆర్థిక పరిస్థితులకు (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, వృద్ధి గమనం, ద్రవ్య పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు) అనుగుణంగా ప్రయోజనం పొందే రంగాలను, థీమ్యాటిక్‌ అవకాశాలను ముందే గుర్తించి, ఆయా రంగాల్లోని బలమైన కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. తద్వారా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులను వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశం. పరిస్థితులకు అనుగుణంగా విదేశీ స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది.

పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,808 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 97.88 శాతం మేర ఈక్విటీలకు కేటాయించగా, డెట్‌ సాధనాల్లో 0.75 శాతం, నగదు రూపంలో 1.37 శాతం కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను గమనించగా.. లార్జ్‌క్యాప్స్‌ కంపెనీల్లో 73.54 శాతం, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 9.6 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 5.51 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 84 స్టాక్స్‌ ఉన్నాయి. రంగాల వారీ కేటాయింపులను పరిశీలిస్తే.. అత్యధికంగా 32.28 శాతం మేర బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్స్‌ కంపెనీల్లో 17.52 శాతం, కన్జ్యూమర్‌ డిస్క్రిషినరీ కంపెనీల్లో 12.90 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement