సర్పంచ్ ఎన్నికలకూ మంగళం
కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు రూ.1,500 కోట్లు, పన్నుల ఆదాయం రూ.1,000 కోట్లపై కన్నేసిన బాబు సర్కారు
ఆ నిధులను మళ్లించి ఇష్టానుసారం ఖర్చు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు నిర్ణయం!
రెండు నెలల్లో ముగియనున్న పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం
ఆ తరువాత ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన నడిపేలా చర్యలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముందుగానే ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినా పట్టని ప్రభుత్వం
ఉన్న నిధులను సైతం పంచాయతీలు ఖర్చు పెట్టుకోకుండా ఇప్పటికే ఆంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఏటా వచ్చే దాదాపు రూ.2,500 కోట్లను మళ్లించేందుకు చంద్రబాబు సర్కారు కుటిల పన్నాగం పన్నుతోంది. ఆ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రాధాన్యత అవసరాలకు మళ్లించే కుట్రకు తెర లేస్తోంది. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం రెండు నెలల్లో ముగిసిపోనుండగా.. పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు లేదా పర్సన్ ఇన్‌చార్జిల పాలన తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
పంచాయతీల ఆదాయంపైనే గురి
పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరిగి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలు ఎనుకున్న సర్పంచ్, వార్డు సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటైతే.. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతోపాటు స్థానికంగా పన్నుల ద్వారా వసూలైన సొమ్మును కూడా పూర్తిగా గ్రామ అవసరాలకు వినియోగించుకునే అవకాశం 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ఉంది. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించే అవకాశం మాత్రమే అధికారులకు ఉంటుంది. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల)కు కేంద్ర ప్రభుత్వం ఏటా నేరుగా రూ.2,100 కోట్ల వరకు నిధులు విడుదల చేస్తోంది.
ఇందులో 70 శాతం అంటే రూ.1,500 కోట్లు, గ్రామ పంచాయతీలకే కేటాయించాలనే నిబంధన ఉంది. దీనికి తోడు పంచాయతీలు ఏటా ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో వసూలు చేసే దాదాపు మరో రూ.1,000 కోట్లు సైతం పంచాయతీ పాలకవర్గాలు స్థానిక అవసరాల కోసం వినియోగించుకుంటాయి. ఇలా ఏటా రూ.2,500 కోట్లను పంచాయతీ తీర్మానాల మేరకు సర్పంచ్‌ల ఆధ్వర్యంలో స్థానిక అవసరాలకు ఖర్చు చేస్తుంటారు.
పాలకవర్గాలు లేకుండా చేసి..
రాష్ట్రంలో ప్రస్తుత సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగిస్తుంది. అంటే సుమారు 2 నెలలు మాత్రమే పంచాయతీ పాలకవర్గాలు మనుగడలో ఉంటాయి. ఆ తరువాత పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహించి.. కొత్త పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు.
ఎన్నికలు జరగని పక్షంలో ప్రత్యేకాధికారుల పాలన.. లేదంటే పర్సన్ ఇన్‌చార్జిలను నియమించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరపకుండా ప్రత్యేకాధికారులు/పర్సన్ ఇన్‌చార్జిల పాలన తెచ్చేందుకు సన్నద్ధమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 13 వేలకు పైగా పంచాయతీ సర్పంచ్, లక్షన్నర వార్డు పదవులకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత ఏడాది సెపె్టంబర్‌లోనే ప్రణాళిక రూపొందించి జనవరి నాటికే ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేలా సూచనలిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, ప్రభుత్వం ఆ ప్రక్రియను చేపట్టకకుండా కాలయాపన చేస్తూ వస్తోంది.
బీసీ రిజర్వేషన్లు సైతం తేల్చలేదు
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదు. సర్పంచ్ పదవులకు మండల ప్రాతిపదికన, వార్డు సభ్యుల పదవులకు పంచాయతీల ప్రాతిపదికన ఏ గ్రామ సర్పంచ్ పదవి, ఏ వార్డు పదవి ఎవరి కేటాయించాలన్నది ఇప్పటికే ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. బీసీ రిజర్వేషన్ ఖరారు చేయాలంటే.. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమరి్పంచాల్సి ఉంటుంది. ఇంతవరకు పంచాయతీల వారీగా ప్రభుత్వానికి ఆ నివేదిక కూడ అందలేదు.
రిజర్వేషన్ల ప్రక్రియను ఏప్రిల్ 2వ తేదీ నాటికి పూర్తిచేస్తే తప్ప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఆ లోగా బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే ఏప్రిల్ 2 తర్వాత సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేకాధికారులను కూర్చోబెట్టి పంచాయతీల్లోనూ ప్రభుత్వమే పాలన చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తద్వారా పంచాయతీల నిధులను ఇష్టానుసారం ఖర్చుచేసే కుటిలయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. 2018లో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసినా అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు 2019 జూన్ వరకు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారు. ఇప్పుడు కూడా అదే పంథాలో వెళ్తున్నారు.
ఉన్న నిధులూ ఖర్చు పెట్టకుండా ఆంక్షలు
కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రస్తుత పాలకవర్గాలు గ్రామాల అవసరాల నిమిత్తం ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లోనే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా అక్టోబర్‌లోనే రూ.1,026 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు మరో రూ.1,000 కోట్ల వరకు రెండో విడత నిధులు ఈ మార్చిలోపే విడుదలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్‌లో కేంద్రమిచ్చిన నిధులను 10 రోజుల్లోనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం గడచిన డిసెంబర్ 18 వరకు తన అవసరాలకు వాడుకుంది. ఆ తరువాత నిధులను గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది.
అంతకుముందు కూడా 8 నెలలపాటు ప్రభుత్వ అవసరాలకు నిధులను మళ్లించి.. ఆ తరువాత ఆలస్యంగా ఆ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. ఆలస్యంగా విడుదల చేసిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ రూపంలో తెలియజేసిన పనులకే ఖర్చు పెట్టేలా చర్యలు చేపట్టాలంటూ డిసెంబర్ నెలాఖరున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇంటి పన్నుల రూపంలో వసూలు చేసుకునే పంచాయతీ సాధారణ నిధులపైనా సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ (సీఎఫ్‌ఎంఎస్) ద్వారా ఆంక్షలు అమలు చేస్తోందని సర్పంచ్‌ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, ఆ శాఖ అధికారులను కలిసి సంఘాల ప్రతినిధులు వినతిపత్రాలు సమరి్పంచినా.. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని సర్పంచ్‌ల సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు.


