అప్పుల బాబు బరితెగింపు | Chandrababu naidu sketch to divert university funds | Sakshi
Sakshi News home page

అప్పుల బాబు బరితెగింపు

Jan 31 2026 5:22 AM | Updated on Jan 31 2026 5:24 AM

Chandrababu naidu sketch to divert university funds

వర్సిటీల నిధులు దారి మళ్లించేందుకు చంద్రబాబు స్కెచ్‌ 

తొలి విడతలో రూ.1200 కోట్లు లాక్కునేందుకు టార్గెట్‌

బ్యాంకుల్లోని డిపాజిట్లు రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేసేలా తీవ్ర ఒత్తిడి  

సీఎంవో, విద్యాశాఖ అధికారుల తిట్లదండకంతో హడలిపోతున్న ఉన్నత విద్యామండలి, వర్సిటీ వర్గాలు   

ఒత్తిడి భరించలేక చాలా వర్సిటీల నుంచి నిధుల బదిలీ ప్రారంభం 

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన బాబు

20 నెలల్లో రూ.3.11 లక్షల కోట్లు అప్పు చేసినా రాష్ట్రాన్ని నడపలేని దుస్థితి  

ఈ పరిస్థితుల్లో వర్సిటీల నిధులు మళ్లీ వెనక్కు ఇచ్చే పరిస్థితి లేదంటున్న విద్యావేత్తలు       

రూ.7800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన నిధులే చెల్లించని బాబు సర్కార్‌   

వర్సిటీలకు నిధులివ్వకపోగా వాటి డబ్బులే పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి: అప్పుల బాబు బరితెగించేసి వర్సిటీల నిధులపై కన్నేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికినచోటల్లా రుణాలు తీసుకున్న చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి దివాళా అంచున నెలబెట్టేశారు. ఇరవై నెలల్లో రూ.3.11 లక్షల కోట్లు మేర అప్పులు చేసినా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు యూనివర్సిటీ నిధులపై కన్నేశారు. తొలివిడతలో ఉన్నత విద్యా మండలితోపాటు వర్సిటీల నిధులు సుమారు రూ.1200 కోట్లు లాక్కునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీటిని వర్సిటీల నుంచి రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయించి ఇష్టారీతిన ఖర్చు చేసుకునేందుకు స్కెచ్‌ వేశారు.   

డిపాజిట్లు దారి మళ్లించేందుకు కుట్ర  
దశాబ్దాలుగా విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులతో వర్సిటీలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి. ప్రభుత్వాల సాయం కోసం ఎదురు చూడకుండా ఆ నగదును జాతీయ బ్యాంకుల్లో ఫిక్సిడ్‌ డిపాజిట్ల రూపంలో భద్రపరుచుకున్నాయి. ఇప్పుడు ఆ డిపాజిట్లనే బయటకు తీయించి దారి మళ్లించేందుకు చంద్రబాబు సర్కార్‌ ఒత్తిడి చేస్తోంది. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ వర్సిటీలకు నష్టమే జరుగుతోందని, ఈ సారి ఏకంగా ప్రభుత్వ వర్సిటీలను ఆర్థికంగా కుదేలు చేసి శాశ్వతంగా మూసేసే కుట్రకు పాల్పడుతున్నారని విద్యావేత్తలు మండిపడుతున్నారు. డిపాజిట్లను బయటకు తీసి రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో జమ చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మౌఖిక ఆదేశాలతోనే వర్సిటీలపై ఒత్తిడి    
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లో­నూ నిబంధనలు తుంగలో తొక్కేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం వర్సిటీల నిధుల మళ్లింపు విషయంలోనూ అదే పంథా కొనసాగిస్తోంది. నిధుల బదిలీకి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎక్కడా దరఖాస్తు చేయకుండా మౌఖిక ఆదేశాలతోనే బెదిరిస్తూ పాశవికంగా వ్యవహరిస్తోంది. 

కొద్ది రోజులుగా ముఖ్యనేత కార్యాలయంలోని ఓ కీలక అధికారితోపాటు, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి ఓఎస్‌డీ కలిసి ఉన్నత విద్యా మండలి, వర్సిటీల వర్గాలకు పదేపదే ఫోన్లు చేసి అమానవీయ రీతిలో తిడుతూ ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చేసేది లేక కొన్ని వర్సిటీల్లో డిపాజిట్ల బదిలీ ప్రక్రియ ప్రారంభించేశారు.

బాబు జమానాలో వర్సిటీలకు గడ్డుకాలమే 
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏనాడూ విద్యారంగాన్ని, వర్సిటీలను పట్టించుకోలేదు. అటువంటి బాబు ప్రస్తుతం కూటమిగా అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యా మండలి ఖజానాలోని రూ.10 కోట్లను వాడేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా చినబాబు లోకేశ్‌ ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు  మళ్లించేశారు. మరోవైపు శతాబ్ది ఉత్సవాలతో కళకళాడాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం సైతం కళావిహీనంగా మారిపోయింది. 

వర్సిటీ కనీసం ప్రశ్నాపత్రాల ముద్రణకు కూడా నోచుకోవట్లేదు. ఇటీవల ఏయూ దూరవిద్య పరీక్షల నిర్వహణలో బయటపడిన డొల్లతనమే ఇందుకు నిదర్శనం. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగాల్సిన దూర విద్య పరీక్షలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఫలితంగా మాస్‌ కాపీయింగ్, ప్రశ్నాపత్రాలను ఈ మెయిల్‌లో పంపించడం, చేతిరాతతో ఉన్న ప్రశ్నాపత్రాన్ని జిరాక్స్‌ తీసి అప్పటికప్పుడు విద్యార్థులకు అందించే దుస్థితికి దిగజారింది.

ఇదంతా విశాఖ తీరంలోని ఓ కార్పొరేట్‌ వర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకు చేస్తున్నట్టు వినికిడి. అందుకే ప్రభుత్వ వర్సిటీకి రావాల్సిన ఎన్నో విలువైన ప్రాజెక్టులు సైతం ఆ కార్పొరేట్‌ వర్సిటీకి తరలిపోయాయి. ఇది ఒక్క ఏయూనే కాదు.. అమరావతికి కూతవేటు దూరంలోని ఆచార్య నాగార్జున వర్సిటీ, సాక్షాత్తూ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూలనూ పట్టిపీడిస్తున్న సమస్య.

చంద్రబాబును నమ్మితే అసలుకే ఎసరు..! 
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు సర్కారు అప్పుల కోసం ఏ వ్యవస్థనూ వదలడం లేదు. రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సంస్థల నుంచి నిధులను లాగేస్తోంది. వాస్తవానికి జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లకు గ్యారెంటీ ఉంటుంది. నిత్యం చెల్లింపులు, ఉపసంహరణలకు అవకాశం ఉంటుంది. 

కానీ చంద్రబాబు ట్రాక్‌ రికార్డు చూస్తే వర్సిటీలు, ఉన్నత విద్యా మండలి నిధులను తిరిగిచ్చే అవకాశమే ఉండదని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక శాతం అధిక వడ్డీకి ఆశపడి జాతీయ బ్యాంకుల్లోని డిపాజిట్లను తీసుకొచ్చి నాన్‌ బ్యాకింగ్‌  ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సంస్థల్లో పెట్టడం మంచిదికాదని మండిపడుతున్నారు. 

పైగా ప్రభుత్వమే ఎడా పెడా అప్పులు చేస్తుంటే.. వర్సిటీలకు తిరిగి చంద్రబాబు నిధులు చెల్లిస్తారనుకోవడం భ్రమేనని తెగేసి చెబుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి జపం చేస్తున్న చంద్రబాబు అభివృద్ధిని, పేదల సంక్షేమాన్ని పూర్తిగా అటకెక్కించేశారని, ఉద్యోగులకు 10వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించడం లేదని గుర్తు చేస్తున్నారు.

కొండలా పేరుకుపోయిన బకాయిలు
చంద్రబాబు ఏలుబడిలో ఉన్నత విద్య అంతకంతకూ దిగజారిపోతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతోపాటు, ప్రైవేటు సంస్థలు సైతం తాము విద్యాలయాలను నడపలేమనే స్థాయికి వచ్చేశాయి. వీటన్నింటికీ ముఖ్య కారణం ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ చెల్లింపుల్లో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అత్యంత దుర్మార్గపు, నిర్లక్ష్యపు వైఖరేనని స్పష్టంగా తెలుస్తోంది. 

దాదాపు రూ.5,600 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.2,200 కోట్ల వసతి దీవెన బకాయిలు కొండలా పేరుకుపోవడం ప్రభుత్వ ఆర్థిక అనిశ్చితిని బట్టబయలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు సర్కార్‌ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నిధులను బలవంతంగా లాక్కోవడం వర్సిటీల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement