రాజధాని భూసేకరణ బాధితులపై మానవీయ దృష్టి
కారుణ్య మరణం కోరిన వృద్ధురాలికి భరోసా
బాధితురాలి సొంత గ్రామానికి న్యాయవాదిని సొంత కారులో పంపిన న్యాయమూర్తి
పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
సాక్షి, అమరావతి: రాజధాని భూసేకరణ బాధితుల గోడును క్షేత్రస్థాయిలో పరిశీలించి మానవీయ దృష్టితో చర్యలు చేపట్టేందుకు హైకోర్టు శ్రీకారం చుట్టిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, రాయపూడికి చెందిన నెల్లూరు శేషగిరమ్మకు చెందిన ఐదు సెంట్ల భూమిని సీఆర్‌డీఏ అధికారులు తీసుకున్నారు. దీంతో శేషగిరమ్మ, అనారోగ్యంతో ఉన్న 70 ఏళ్ల ఆమె కూతురు వెంకాయమ్మ, మతిస్థిమితం లేని మనుమరాలు శ్యామల పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ క్రమంలో శేషగిరమ్మ కుమార్తె వెంకాయమ్మ మరణించింది.
తమ నుంచి తీసుకున్న 5 సెంట్ల భూమిని తమకు ఇవ్వాలని శేషగిరమ్మ సీఆర్‌డీఏ అధికారులను కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో శేషగిరమ్మ, ఆమె మనుమరాలు విధి లేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు. తమ బాగోగులను చూసుకునేందుకు ఓ కేర్‌టేకర్‌ను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, లేని పక్షంలో తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారణ జరుపుతున్న న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ 90 ఏళ్ల ఆ వృద్ధురాలి సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. శేషగిరమ్మ, ఆమె మనుమరాలి బాగోగులే తమకు ప్రధానమని చెప్పిన న్యాయమూర్తి కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆ అవ్వ, మనుమరాలి సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, అసలు క్షేత్రస్థాయిలో వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని నిర్ణయించారు.
అందులో భాగంగా న్యాయమూర్తి శుక్రవారం తన సొంత కారులో డ్రైవర్‌నిచ్చి రూపేష్ అనే న్యాయవాదిని ఆ వృద్ధురాలు, ఆమె మనుమరాలు ఉంటున్న రాయపూడి గ్రామానికి పంపారు. వారి పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ఆ న్యాయవాదిని ఆదేశించారు. వారి పునరావాసం, బాగోగుల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను ఆదేశించారు. చర్యలు సైతం సంతృప్తికరంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.


