సాక్షి, తాడేపల్లి: పవన్ ప్రసంగాలు పరిశీలిస్తే విచిత్రంగా ఉందని.. ఓపెనింగ్‌లో ఓవరాక్షన్ చేస్తారు.. ఇంటర్వెల్‌లో ఇరిటేషన్ అవుతారు.. కన్ క్లూజన్‌లో కన్ఫ్యూజ్ అవుతారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకీ అర్థం కాదని.. వినేవాళ్లకు అంతకన్నా అర్ధం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
‘‘వైఎస్సార్‌సీపీ పార్టీని, పార్టీ నాయకత్వంపై తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. ఎందుకు పవన్ అంతలా ఊగిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎవరినో బెదిరించాలనే భావన పవన్ మాటల్లో కనిపిస్తుంది. పవన్ మిమ్మల్ని ఎవరైనా వైఎస్సార్‌సీపీ వాళ్లు ఏమైనా అన్నారా.. అంటే చెప్పండి. మిమ్మల్ని తిట్టింది తెలంగాణ వాళ్లు.. వైఎస్సార్‌సీపీ వాళ్లు కాదు. ఎందుకు వైఎస్సార్‌సీపీపై తీవ్రమైన పదజాలంతో ఊగిపోతున్నారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.
‘‘కూటమి అసమర్థత వల్ల అనేకమైన ఇష్యూలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. భవిష్యత్‌లో లక్షల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను తన మనుషులకు చంద్రబాబు కట్టబెట్టేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ స్కామ్. కోటి మందికి పైగా ప్రజలు కోటి సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల్లో స్కామ్ జరుగుతుంది
..ఈ స్కామ్‌లో ఎవరైనా చేరితే.. చంద్రబాబు, లోకేష్‌కు కిక్ బ్యాగ్‌లు ఇస్తే చట్టం ముందు శిక్షిస్తామని చెప్పాం. విచారణ క్రమంలో లోపల కూడా వేస్తామని చెప్పాం. స్కామ్ ఉందని మేం చెబుతున్నాం. మమ్మల్నే లోపల వేస్తారా.. మీ సంగతి తేలుస్తామని పవన్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాట్లాడకుండా పవన్‌తో మాట్లాడిస్తున్నాడు. ఎందుకు మీకంత భయం?. 15 ఏళ్లు కలిసే ఉంటామని చెబుతున్నావ్.. కలిసుంటే మంచిదేగా వద్దని ఎవరు చెప్పారు?. 15 ఏళ్లు అగ్రిమెంట్ రాసే పార్టీ దేశంలో ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తప్ప. 15 ఏళ్లు కలిసి ఉండేది రాష్ట్రానికి మంచి చేయడానికి కాదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడని మీకు భయం
..ఏమీ లేకపోయినా మద్యం స్కామ్ పేరుతో ఎంతమందిని లోపలేశారు. విచారణల పేరుతో లడ్డూ వ్యవహారంలో మీరు చేస్తున్నది ఏంటి?. మెడికల్ కాలేజీల స్కామ్‌లో పవన్‌కు వాటా ఉంది కాబట్టే ఊగిపోతున్నాడు. ప్రజలు మెచ్చిన రోజున వైఎస్సార్‌సీపీని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. అవినీతి, లంచాలకు తావులేకుండా పాలన ఉండాలన్నారు. డబ్బులు లేనిదే లోకేష్ ట్రాన్స్‌ఫర్లు చేస్తున్నారా?. సీజ్ ద షిప్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అమ్మకం ఆగిందా పవన్ సమాధానం చెప్పాలి
..కాకినాడ పోర్టు నుంచి బియ్యం బ్రహ్మాండంగా వెళ్లిపోతోంది. మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. బియ్యం డబ్బుల్లో మీకు వస్తుందిగా. చక్కగా డబ్బు తీసుకుని సర్దుకుంటున్నారుగా. మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా మీరు చంద్రబాబుకు కాపు కాయండి మాకేం అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఓడినా .. గెలిచినా జగన్ సింగిల్‌గానే వస్తారు. పదవుల కోసం ఎవరి వద్దా దేహీ అని మేం అడుక్కోం. పవన్ మాట్లాడితే బంధు ప్రీతి లేదు.. అవినీతి సహించను అంటారు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకు?.
..కులతత్వానికి వ్యతిరేకమంటారు. జనసేనలో రెండు మంత్రి పదవులు ఓసీలకే ఎలా ఇచ్చారు?. బీసీలు, ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా?. పవన్ కళ్యాణ్ సోదరుడే ఎమ్మెల్సీ అవ్వాలా?. క్యాబినెట్‌లో పవన్ కళ్యాణ్ సోదరుడికి మంత్రి ఇస్తామని చంద్రబాబు రాసిచ్చాడు. చంద్రబాబు ఈ మాట చెప్పి ఏడాదైంది.. ఏమైంది మంత్రి పదవి. దేహీ అని పదవులు అడుక్కునే మీరు మమ్మల్ని దూషించడమా?. ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారని డీఎస్పీ జయసూర్య పై ఫిర్యాదు చేశావ్ ఏమైంది?
..నీ ఫిర్యాదు ఎవరైనా పట్టించుకున్నారా...ఆ డీఎస్పీపై చర్యలు తీసుకున్నారా?. రోమాలు తీస్తాం.. అరచేతిలో గీతలు చెరిపేస్తాం లాంటి పిచ్చిమాటలను పవన్ మానుకోవాలి. నా ఇష్టం నేను చేస్తాను అంటే కచ్చితంగా అనుభవిస్తారు. మాట్లాడితే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి మీకు చేతనైతే వాటిపై పోరాడండి. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో వాటా లేదని పవన్ ప్రమాణం చేయగలరా?. పవన్ జలధారపై ప్రమాణం చేసి చెప్పండి... నేను క్షమాపణ చెబుతా. జనసేన పార్టీ కార్యాలయం క్రమంగా పెరిగిపోతోంది. పార్టీ కార్యాలయం కోసం 20 ఎకరాలు కొన్నారు. మీ సినిమాలన్నీ ప్లాపులవుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది
..చంద్రబాబు, లోకేష్ నెలకు ఇంత అని లెక్కగట్టి పవన్ కు ఇస్తున్నారు. పవన్ వాళ్ల దగ్గర మేస్తున్నాడు. మాపై కూస్తున్నాడు. మీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ ప్రొఫెసర్‌ను కొట్టాడు అది రౌడీయిజం కాదా? మాట్లాడితే పీకుతాం పీకుతాం అని మాట్లాడుతున్నారు. పవన్ ఏంటీ ఈ పీకుడు లాంగ్వేజ్. నువ్వు మాత్రం చంద్రబాబు, లోకేష్ దగ్గర కమిషన్లను స్ట్రాపెట్టి మరీ పీకేస్తున్నావ్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని ఏం పీకలేరు.
..ఏపీలో అనేక స్కామ్‌లు జరుగుతున్నాయి. అన్ని స్కాములపై వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక చట్టప్రకారం లోపలేస్తాం. అన్ని స్కాముల పై విచారణ జరుగుతుంది. మీ రెడ్ బుక్‌ను మా కుక్క కూడా లెక్కచేయదు. రెడ్ బుక్ సాంప్రదాయాన్ని తెచ్చింది మీరే. మీరు తెచ్చిన రెడ్ బుక్ సాంప్రదాయానికి మీరూ బలయ్యే పరిస్థితులు వస్తాయేమో ఆలోచించండి. రెడ్ బుక్ సంప్రదాయాన్ని సమాజానికి ఎక్కిస్తున్నారు. పిల్లకాకి లోకేష్‌కు ఏం తెలుసు ఉండేలు దెబ్బ. ముందుంది మొసళ్ల పండుగ’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు.


