సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై కేసులో పోలీసులు స్వామి భక్తి ప్రదర్శించారు. ఈ కేసులో బాధితురాలినే పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి డైరెక్షన్‌లో విచారణ చేసిన పీఏను కాపాడేందుకు యత్నిస్తున్న పోలీసులు.. కేసు పెట్టిన బాధితురాలినే అరెస్ట్ చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో నిందితులను కాపాడిన పోలీసులు.. వాట్సాప్ చాటింగ్ సైబర్ క్రైమ్ అంటూ కేసు పక్కదారి పట్టించారు.


మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్ పై లైంగికదాడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. టీచర్‌గా పనిచేస్తున్న భర్త కరోనాతో చనిపోయిన తన నుంచి కారుణ్య నియామకం కోసం డబ్బులు వసూలు చేయడంతోపాటు మానసికంగా, శారీరకంగా వేధించాడని, లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించాడని బాధితురాలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే, లైంగికదాడి కేసులో నిందితుడు సతీష్‌ను ఇప్పటివరకు టచ్ చేయని పోలీసులు.. బాధితురాలినే అరెస్ట్ చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ దురాగతాలపై బాధితురాలి కథనం ప్రసారం చేసినందుకు సాక్షి మీడియాకు సాలూరు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ ఫిర్యాదుతో సాక్షి మీడియాకు పోలీసులు ఫిర్యాదులు ఇచ్చినట్టు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపకుండా తాత్సారం చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం ఆగమేఘాల మీద కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. కాగా, బాధితురాలిని 24 గంటలపాటు పోలీసులు అదుపులోనే ఉంచుకున్న కథనాన్ని సాక్షి ప్రసారం చేసింది.


