మార్చి 20న జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్ష మర్నాటికి వాయిదా
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో ప్రభుత్వం స్వల్ప మార్పు చేసింది. మార్చిలో నిర్వహించనున్న పబ్లిక్ పరీక్షల్లోని ఇంగ్లిష్ పరీక్ష తేదీని మార్చింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌లో ప్రకారం మార్చి 20న (శుక్రవారం) ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆ రోజు రంజాన్ పండుగ సెలవు కావడంతో ఇంగ్లిష్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ మరుసటి రోజు 21వ తేదీన ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించనుంది.
ఈ మేరకు పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మిగిలిన అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని తెలిపారు. అయితే, గత డిసెంబర్ 4న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మార్చి 20న (ఈద్–ఉల్–ఫితర్) రంజాన్ పండుగ సెలవు ప్రకటించారు. అయినా పాఠశాల విద్యాశాఖ ఆలస్యంగా తేరుకుని ఇప్పుడు పరీక్ష తేదీని మార్చడం గమనార్హం.


