కాకినాడ జిల్లా తుని మండలం వి.కొత్తూరు సమీపంలో పోలవరం ఎడమ కాలువకు అత్యంత నాసిరకంగా లైనింగ్ చేశారనడానికి ఈ పగుళ్లే నిదర్శనం , పనులు నాసిరకంగా చేయడం వల్ల లైనింగ్‌కు పగుళ్లు రావడంతో ఇటీవల సిమెంట్ పూత పూసి మాయ చేశారనడానికి నిదర్శనం
అప్పుడు యనమల వియ్యంకుడు.. ఇప్పుడు రామోజీ కుమారుని వియ్యంకుడు
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ
5, 5ఏ ప్యాకేజీల్లో మిగిలిన రూ.81.63 కోట్ల పని
అంచనా వ్యయం రూ.293.66 కోట్లకు పెంపు
వాటిని రూ.307.41 కోట్లకు రామోజీ కుమారుని వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు అప్పగింత
నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా లైనింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్.. దాంతో అప్పుడే కాంక్రీట్ లైనింగ్‌కు పగుళ్లు.. వాటిపై సిమెంటు పూతతో మాయ చేస్తున్న వైనం
ప్రభుత్వ పెద్దల దన్ను ఉండటంతో నాణ్యతపై ప్రశ్నించలేకపోతున్న అధికారులు.. 2014–19 మధ్య రూ.142.88 కోట్ల విలువైన పనులు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ సంస్థకు నామినేషన్‌పై అప్పగింత
ఆ పనులకు ఇప్పుడు అదనపు బిల్లుల రూపంలో మరో రూ.53.34 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పోలవరం ఎడమ కాలువ పనుల్లో 2014–19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ దోచేస్తే.. ఇప్పుడు ‘ఈనాడు’ రామోజీ కుమారుని వియ్యంకుడికి చెందిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’ సంస్థ అడ్డగోలుగా దోపిడీ చేస్తోందని సాగు నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. కాలువకు అత్యంత నాసిరకంగా కాంక్రీట్ లైనింగ్ చేయడం వల్ల పనులు చేసిన కొద్ది రోజులకే పగుళ్లు రావడంతో వాటికి సిమెంటు పూతతో సరిపెట్టడమే ఇందుకు నిదర్శనం. కాంట్రాక్టర్‌కు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటం వల్ల పనుల నాణ్యతపై అధికారులు నోరు మెదపలేక పోతున్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీల్లో 2019 అక్టోబర్ 3 నాటికి మిగిలిన రూ.81.63 కోట్ల విలువైన పని అంచనా వ్యయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూ.293.66 కోట్లకు పెంచేసింది. వాటిని 4.68 శాతం అధిక ధరకు.. అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’కు గతేడాది అక్టోబర్ 17న కట్టబెట్టింది. అంటే.. మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్లు (277 శాతం) ఎక్కువకు అంచనాలను పెంచేసినట్లు స్పష్టమవుతోంది. అయినా, పనులు అత్యంత నాసిరకంగా చేస్తూ పెంచేసిన అంచనా వ్యయాన్ని ‘నీకింత.. నాకింత’ అంటూ పచ్చ ముఠా పంచుకు తింటోందని సాగు నీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ‘ఏటీఎం’గా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను గుర్తు చేస్తున్నారు.
అప్పట్లో అడ్డగోలు దోపిడీకి ఇప్పుడు నజరానా
⇒ పోలవరం ఎడమ కాలువలో ఐదో ప్యాకేజీ (93.7 నుంచి 111.487 కిలోమీటర్ల వరకు) పనులను రూ.181.60 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005 మార్చి 23న దక్కించుకుంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఈ పనులను అనుంగులకు అప్పగించడంపై దృష్టి సారించారు.
⇒ 5.754 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 11.001 కిలోమీటర్ల లైనింగ్, 33 కాంక్రీట్ నిర్మాణ పనులను 60–సీ కింద సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ నుంచి తప్పించి.. వాటిని రూ.142.88 కోట్లకు యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన పీఎస్‌కే–హెచ్‌ఈఎస్ (జేవీ)కు 2016 నవంబర్ 30న నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టారు.
⇒ వాటితోపాటు 100.3 కిలోమీటర్ నుంచి 102.5 కిలోమీటర్, 110.5 కిలోమీటర్ల నుంచి 111.487 కిలోమీటర్ వరకు కఠిన శిల (హార్డ్ రాక్)తో కూడిన భూమిని బ్లాస్టింగ్ చేసి తవ్వాలని, అందుకు 3,77,938 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి వస్తుందని.. క్యూబిక్ మీటర్‌కు రూ.29.21 చొప్పున రూ.1.11 కోట్లు అదనంగా చెల్లించాలని 2018 మే 22న బాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
పోలవరం ఎడమ కాలువ తవ్వకం కోసం కుమ్మరిలోవ వద్ద కొండను కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో కాకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్న దృశ్యం
⇒ కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పుల వల్ల అదనంగా రూ.38.986 కోట్లు చెల్లించాలని 2018 జూలై 10న మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు పీఎస్‌కే–హెచ్‌ఈఎస్ సంస్థతో పోలవరం అధికారులు సప్లిమెంటరీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. దాంతో.. ఆ సంస్థకు రూ.181.866 కోట్ల విలువైన పని అప్పగించినట్లయింది.
⇒ 2019 అక్టోబర్ 3 నాటికి ఆ సంస్థ రూ.117.05 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. మరో రూ.64.816 కోట్ల విలువైన పనులు మిగిలాయి. పుట్టా సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ చేసిన సూచన మేరకు ఆ సంస్థ నుంచి ఆ పనులను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
⇒ ఎడమ కాలువలో 5–ఏ ప్యాకేజీలో 100.3 కిలోమీటర్ల నుంచి 102.50 కిలోమీటర్ల వరకు 2016–19 మధ్య కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో 16,69,476 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేశారని చూపి.. క్యూబిక్ మీటర్‌కు అదనంగా రూ.78 చొప్పున రూ.13,25,59,128 అదనంగా చెల్లించేందుకు 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్టోబర్ 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డీఎల్‌ఎస్‌సీ (డిస్ట్రిక్ట్ లెవల్ శాంక్షన్ కమిటీ) ప్రతిపాదన మేరకు చెల్లించిన రూ.9,94,19,274 పోనూ మిగిలిన రూ.3,31,39,854 చెల్లించాలని పేర్కొంది.
⇒ 2017 ఆగస్టు 6న డీఎల్‌ఎస్‌సీ చేసిన ప్రతిపాదనపై గత ఏడాది జూన్ 25న అంటే.. ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఎల్‌టీసీ (స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) ఆమోద ముద్ర వేసిందంటూ ఆ మేరకు అదనపు బిల్లులు చెల్లించేసింది.
⇒ ఇక కాలువ అడుగు (బెడ్) భాగం వెడల్పు పెరగడం వల్ల 2016–19 మధ్య అదనంగా మట్టి తవ్వకం, కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారని చూపి.. వాటికి అదనంగా రూ.4.40 కోట్ల బిల్లు చెల్లించడానికి బాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే పుట్టా సంస్థకు అదనపు బిల్లుల రూపంలో రూ.53.34 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది.
పనులు ఇలా చేయాలి
⇒ టెండర్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం పోలవరం ఎడమ కాలువను అడుగు (బెడ్) భాగంలో 68.5 మీటర్ల వెడల్పు, 4.9 మీటర్ల లోతుతో.. 17,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్వాలి.
⇒ కఠిన శిలలతో కూడిన ప్రాంతంలో కాలువను తవ్వేటప్పుడు కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయాలి.
⇒ ఆ తర్వాత కాలువ గట్లపై ఇరు వైపులా 5 మీటర్ల వెడల్పుతో.. 225 మిల్లీమీటర్ల మందంతో సర్వీసు రోడ్డు కోసం వరుస వేయాలి.
⇒ దాన్ని 8 నుంచి 10 టన్నుల సామర్థ్యంతో కూడిన షీప్ ఫుట్ రోలర్ లేదా వైబ్రేటరీ రోలర్‌తో మందం 150 ఎంఎం వరకు తగ్గేలా రోలింగ్ చేయాలి.
⇒ కాలువకు ఇరు వైపులా వాలు (స్లోప్స్)ను వైబ్రేటరీ ఇన్‌క్లెయిన్‌డ్ రోలర్‌తో పటిష్టం చేయాలి. కాలువ అడుగు భాగాన్ని వైబ్రేటరీ రోలర్‌తో గట్టి పరచాలి.
⇒ ఆ తర్వాత 40 ఎంఎం కంకర, ఇసుక, సిమెంటుతో కూడిన ఎం–10 కాంక్రీట్ మిశ్రమాన్ని 100 ఎంఎం మందంతో కాలువకు ఇరువైపులా వాలుకు పేవర్ యంత్రంతో లైనింగ్ వేయాలి.
⇒ కాలువ అడుగు భాగంలోనూ అదే రీతిలో లైనింగ్ వేయాలి.
పనులు నాసిరకంగా చేయడం వల్ల లైనింగ్‌కు పగుళ్లు రావడంతో ఇటీవల సిమెంట్ పూత పూసి మాయ చేశారనడానికి నిదర్శనం
పనులు ఇలా చేస్తున్నారు
⇒ కఠిన శిలలతో కూడిన ప్రాంతంలో కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయడం లేదు. కుమ్మరిలోవ వద్ద కాలువ కోసం కొండను ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్ చేస్తూ తవ్వేస్తుండటంతో తుని మున్సిపాల్టీలో ఒకటో వార్డులో ఇళ్లు కంపిస్తున్నాయని ఆ ప్రాంత వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
⇒ కాలువకు ఇరు వైపులా సర్వీసు రోడ్డును ఇష్టారాజ్యంగా కానిచ్చేస్తున్నారు.
⇒ కాంక్రీట్ లైనింగ్ చేయడం కోసం కాలువకు ఇరు వైపులా వాలు భాగాన్ని గట్టి పరచకుండానే అత్యంత నాసిరకం కంకర, ఇసుక, సిమెంటుతో కూడిన కాంక్రీట్‌తో చేస్తున్నారు.
⇒ కాలువ అడుగు భాగంలోనూ ఇష్టారాజ్యంగా నాసిరకం కాంక్రీట్‌తో లైనింగ్ చేస్తున్నారు.
⇒ దీని వల్ల కాంక్రీట్ వేసిన కొద్ది రోజులకే ఎక్కడికక్కడ పగుళ్లు వస్తున్నాయి. పగుళ్లు వచ్చిన చోట సిమెంటు పూత పూస్తూ మాయ చేస్తున్నారు.
⇒ పనులు అత్యంత నాసిరకంగా చేస్తుండటం వల్ల కాలువలోకి పూర్తి స్థాయి మేరకు నీటిని వదిలినప్పుడు ఎక్కడికక్కడ గండ్లు పడతాయని సాగు నీటి రంగ నిపుణులు, ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
⇒ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ఈనాడు రామోజీరావు కుమారుని వియ్యంకుడు రాయల రఘుది కావడం, ఆయనకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతోనే పనుల నాణ్యతపై అధికారులు నోరు మెదపలేకపోతున్నారని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి.


