అంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న గుడివాడ అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ
మాజీ మంత్రి అంబటి రాంబాబును తిట్టి ఘర్షణకు ప్రేరేపించింది టీడీపీ నేతలే
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
టీడీపీ కూటమి ఆగడాలను ప్రశ్నింస్తే గొంతు నొక్కుతున్నారు: కరణం ధర్మశ్రీ
పరామర్శకు వచ్చే వారినీ అడ్డుకుంటున్నారు: అంబటి కుమార్తె మౌనిక
అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తరాంధ్ర కాపు నేతలు
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): టీడీపీ తొలినుంచీ కాపులు తమ చెప్పు కింద ఉండాలన్న భావనతోనే వ్యవహరిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. 1988లో వంగవీటి రంగా హత్య మొదలుకుని.. ఇటీవల ముద్రగడ పద్మనాభంపై దాడి వరకు కాపులపై టీడీపీ దాష్టికాలు చేస్తూనే ఉందని చెప్పారు. తాజాగా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి కూడా టీడీపీ కాపు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. శనివారం గుంటూరు నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్సార్‌సీపీ నేతలు, ఉత్తరాంధ్ర కాపు నేతలు వచ్చారు. ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
టీడీపీ నేతలే ఘటనలన్నిటికీ కారణం
ఈ సందర్భంగా గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. అంబటి నివాసం, ఆయన కార్యాలయం, కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడి చేయటం సిగ్గుచేటన్నారు. ఘర్షణకు ప్రేరేపించింది, తిట్టింది, కార్యాలయం తగలబెట్టింది, అంబటిపై హత్యాయత్నం చేసింది టీడీపీ నేతలేనని స్పష్టం చేశారు. చివరకు అంబటిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కుట్రపన్ని రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారని, కొవ్వు లేదని నివేదికలు రావటంతో తమ ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని ఫ్లెక్సీలు వేయించారని ఆరోపించారు.
ఆ ఫ్లెక్సీలు తొలగించాలని అంబటి పిలుపునిచ్చారని, దీంతో ఉద్దేశపూర్వకంగా ఆయనపై దాడికి తెగబడ్డారన్నారు. కుటుంబ సభ్యులను తిడుతుంటే అంబటి మాట తూలారని, దానికి పొరపాటు జరిగిందని కూడా చెప్పారని గుర్తు చేశారు. అంబటిపై 17 కేసులు పెట్టి అక్రమ అరెస్ట్‌కు తెరదీశారని, తాజాగా ఆయనపై మరో 16 కేసులు పెట్టినట్టు తెలుస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. అంబటి టైగర్ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని.. కచ్చితంగా పులి బయటకు వస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించదన్నారు.
పరామర్శించేందుకు వచ్చే వారినీ అడ్డుకుంటున్నారు
అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ.. తన తండ్రిపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ తమకు మద్దతివ్వటానికి వస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. పరామర్శకు వస్తున్న వారి ఆస్తులు అయిపోవాల్సిందేనని ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే మాధవి తిరిగి దాడి చేస్తానంటున్నారని, ఆమెను అధికార అహంకారం ఆవరించిందన్నారు. ‘మీరు మొదటిసారి గెలిచారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం ఎవరి వల్లా కాదు. క్షమాపణ అడగడానికి కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో ఇళ్లకు వస్తారా? ఎమ్మెల్యే గల్లా మాధవి సమాధానం చెప్పాలి.
కేంద్ర మంత్రి పెమ్మసాని రాజకీయాలు ప్రక్షాళన చేస్తామన్నారు. చివరకు అయనే మరింత కలుషితం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌కళ్యాణ్‌ను ఇటువంటి ఘటనపై స్పందించాలని అడగటం తప్పా? కేవలం దాడి విషయంలో ప్రశ్నించి, భద్రత కల్పించాలని అడిగాను’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, పార్టీ నేతలు చింతలపూడి వెంకట్రామయ్య, కంది రాజీవ్‌గాం«దీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు
మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నింస్తే గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. అంబటిపై దాడిని చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ చేతకాని విధానాలను ప్రశ్నింస్తే ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ దుర్మార్గంగా వ్యవహరించారని, అందుకు నిలువెత్తు నిదర్శనం అంబటిపై దాడేనని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా కాపులపై దాడి చేయటం పరిపాటిగా మారిందన్నారు. కాపులపై దాడి చేయడం టీడీపీ డీఎన్‌ఏలోనే ఉందని దుయ్యబట్టారు. ప్రణాళిక ప్రకారమే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ల నరేంద్ర కనుసన్నల్లోనే టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు లోకేశ్ ఆదేశాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నేతలంతా అంబటి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.


