సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు పనిచేసే పొలిటికల్ టూల్‌లా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని.. అందుకోసం ఆయన దగ్గర మేత తిని వైఎస్సార్‌సీపీ గురించి నోటికొచ్చినట్టు కూతలు కూస్తున్నాడంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు పోతిన మహేష్ మండిపడ్డారు.
మంగళవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని, దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పవన్ కళ్యాణ్ సమయం, సందర్భం లేకుండా మధ్యలో వచ్చి వైఎస్సార్‌సీపీ నాయకుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే స్పష్టత ఉండదని, సినిమా భాషలో ఆయన మైండ్ సెట్ గురించి చెప్పాలంటే ఓపెనింగ్‌లో ఓవరాక్షన్, ఇంటర్వెల్‌లో ఇరిటేషన్, క్లైమాక్స్‌లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా ఉందంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. సింగపూర్‌లో అమలు చేసే కేనింగ్ పనిష్మెంట్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న జనసేనలో ఎమ్మెల్యేల దగ్గర నుంచే మొదలుపెట్టాలని సూచించారు. చంద్రబాబుకి సపోర్టు చేయడానికి జనసేన పార్టీ పెట్టి ఆ పార్టీ కార్యకర్తలతో టీడీపీ జెండాలు మోయిస్తున్న పవన్ కళ్యాణ్‌కి ఆత్మాభిమానం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.
పిల్లనిచ్చిన మామ నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు, చిరంజీవి ద్వారా సినిమాల్లోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్ పేరెత్తే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ఈ 18 నెలల కాలంలో ప్రజల కోసం తాను చేసిన ఒక్క మంచి పని ఉన్నా చూపించాలని పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నా, 18 లక్షల మంది జాబ్ కార్డులు తీసేసినా నోరు మెదపని పవన్ కళ్యాణ్ ప్రజల బాగోగులు అంటూ డ్రామాలాడుతున్నారని, ముందుగా తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పోతిన మహేష్ హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
పాలన చేతకాక వైఎస్సార్‌సీపీని తిడుతున్నాడు..
వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాత్రం వైఎస్సార్‌సీపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారి ప్రవర్తన చూస్తుంటే అధికారంలో ఉన్నది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమా లేక వైఎస్సార్‌సీపీనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టి లేదా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏనాడూ ఒక్కదానికీ సమాధానం చెప్పకపోగా చంద్రబాబుకి వకాల్తా పుచ్చుకుని మరో 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉండాలని కోరడం చూస్తుంటే ఆయనకు ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలా?. చంద్రబాబు అధికారంలో ఉండటం కావాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూల్ లా మారిపోయాడు. ఆయనకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు పవన్ బయటకొస్తాడు. ఒకపక్క సొంత పార్టీని, ఇంకోపక్క ప్రజలను మభ్యపెడుతున్నాడు. పాలన చేయడం చేతకాకనే ఇలా వైఎస్సార్‌సీపీని తిట్టి పబ్బం గడుపుతున్నాడు.
చంద్రబాబు ఆదేశాలతో డైవర్షన్ పాలిటిక్స్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. అధికారంలో వస్తే మెడికల్ కాలేజీలు కట్టబెట్టేలా చంద్రబాబు ఎన్నికలకు ముందే ఒక ఒప్పందం చేసుకుని ఆ విధంగా ఇప్పుడు ముందుకుపోతున్నాడు. మళ్లీ అధికారంలోకి రావడం కలలో మాటేనని వారికి అర్థమైంది అందుకే ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఆయన వెనక్కి తగ్గకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీ నాయకులపై బూతులతో విరుచుకు పడుతున్నాడు.
చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని కోటికి పైగా సంతకాలు చేసిన ప్రజలను అవమానించేలా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించడమే మర్చిపోయాడు. ఆయన డ్రామాలు గుర్తించలేని స్థితిలో ప్రజలున్నారని పవన్ కళ్యాణ్ భ్రమపడుతున్నాడు.


