కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.ఓ ప్రభుత్వం మరోసారి ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకోబోతోంది. యువతను ప్రోత్సహించేలా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. యువ నాయకత్వంపై మోదీ సర్కారు ఫోకస్ పెంచింది. ప్రభుత్వంలో వారికి పెద్దపీట వేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర కేబినెట్‌లో యువ నేతలకు మరిన్ని కొలువులు కట్టబెట్టడానికి కసరత్తు చేస్తోంది. మోదీ 3.ఓ కేబినెట్‌లో యువతరానికి త్వరలో తగిన ప్రాధాన్యం దక్కబోతోంది. దీనికి కొంత సమయం పడుతుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడంతో కమలనాథులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నిల్లోనూ ఇదే జోరు చూపించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కార్యాచరణలోకి దిగిపోయారు. వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్ మధ్యలో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీదీని నాలుగోసారి సీఎం కాకుండా అడ్డుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు బెంగాల్ పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బెంగాల్‌లో సభలు నిర్వహిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఆశ్చర్యపరిచే నిర్ణయాలు
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ సర్కారు ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకోబోతోందని సమాచారం. కేంద్ర కేబినెట్ విస్తరణతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్టు 'ది సండే గార్డియన్స్ నివేదించింది. బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత 45 ఏళ్ల నితిన్ నబీన్‌ను (Nitin Nabin) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి అందరినీ బీజేపీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదే విధంగా బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎవరూ ఊహించని నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.
యువతకు పెద్దపీట
పార్టీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వానికి కేంద్ర కేబినెట్‌లో పెద్దపీట వేయనున్నారని సమాచారం. ఒకవేళ బెంగాల్‌లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే ఆ రాష్ట్రం నుంచి మరికొంత మందికి కేబినెట్ బెర్త్‌లు దక్కే చాన్స్ ఉంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన పనితీరు కనబరిస్తే.. ఇద్దరు పూర్తిస్థాయి కేంద్ర మంత్రులను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమచారం.
పనితీరే గీటురాయి
జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్‌ను ఎంపిక చేయడానికి ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారో దాదాపు వాటినే కొత్త మంత్రుల ఎంపికలో పాటిస్తారని తెలుస్తోంది. ఎటువంటి వివాదాలు లేకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడంతో పాటు ఎక్కువ కాలం బాధ్యతలు చేపట్టగల యువ నాయకులకు అవకాశం ఇస్తారని సమాచారం. పార్టీకి ఎక్కువ కాలం పాటు బాధ్యతలు చేపట్టగల సామర్థ్యంతో పాటు, స్థిరమైన సంస్థాగత పనితీరుతో మంచి ఫలితాలు రాబట్టగలిగే యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూనే.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా ఎంపికలు ఉంటాయని సమాచారం.
చదవండి: కలిసి వస్తున్నాం.. కాస్కోండి!
కేబినెట్‌లో 10 ఖాళీలు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 72 మంది మంత్రులు ఉన్నారు. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం గరిష్టంగా 81 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుత కేబినెట్‌లో 9 ఖాళీలు ఉన్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) బీజేపీ ఇటీవల ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. దీంతో కేబినెట్‌లో ఖాళీల సంఖ్య 10కి చేరుతుంది. ప్రధానిగా తన రెండవ హయాంలో 78 మంత్రులకు కేబినెట్‌లో చోటు కల్పించారు. దీని ప్రకారం చూసుకున్నా ప్రస్తుత మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. చూడాలి బెంగాల్ ఎన్నికలు ఎవరిని అందలం ఎక్కిస్తాయో!


