సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఏ మాత్రం మెచ్చుకోవడం లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల భాష ఏ మాత్రం బాగోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, వైఎస్సార్‌సీపీ కోటి సంతకాలు సేకరించడంపై కూటమి నేతలు వణికిపోతున్నారని అన్నారు.
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల భాష, ఆలోచన విధానాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలి. వారి ప్రవర్తనను రాష్ట్ర ప్రజలు గమనించాలి. కోటి సంతకాల సేకరణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రికి రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా?. జనంలోకి వెళ్లి అడిగితే ఎంత మంది మెడికల్ కాలేజీల కోసం సంతకాలు చేశారో అర్ధం అవుతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి.. అప్పుడు వాళ్ళే సమాధానం చెబుతారు. మెడికల్ కాలేజీల విషయంలో అవినీతికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. ప్రజారోగ్యాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తున్నారో వారిపై మా ప్రభుత్వం వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం..
20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తారో.. చస్తారో పక్కన పెడితే గ్రామీణ ఉపాధి హామీ పథకం అటక ఎక్కేసింది. రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ వలసలు మొదలవుతాయి. పేదలకు అన్నం దొరకలేని దయనీయ పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఉపాధి హామీ పథకం కోసం కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. ఉపాధి హామీ పథకం డిప్యూటీ సీఎం శాఖలోకే వస్తుంది కదా కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. చంద్రబాబుకి పేదలు అవసరం లేదు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి కూడా అవసరం లేదు. చంద్రబాబు ఏనాడూ పేదల కోసం ఆలోచన చేయలేదు.
ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్నారు కదా పవన్.. మరి ఎందుకు ప్రశ్నించడం లేదు?. అధికారం, గెలుపు ఓటములు సహజం. సిద్దాంతం, ఆలోచన ముఖ్యం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే.. శాంతి భద్రతలు లేవు. హాస్టల్ పిల్లలు మధ్యాహ్నం మంచి భోజనం తినే పరిస్థితి లేదు.. పవన్ వ్యాఖ్యలు విన్నాక ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగి ఏపీలో యూరియా కొరత వస్తే.. మిగతా రాష్ట్రాల్లో యూరియా ఎలా వచ్చింది?. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు అన్నింటిలో యూరియా కొరత లేదు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు ఆయన టీమ్ కన్ను పడింది. ఇక్కడున్న భూములు దోచుకుందామని ప్రయత్నిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఎక్కడైనా ఉందా?. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవకుండా కేటాయింపులు ఎప్పుడైనా జరిగాయా?. భూ కేటాయింపులు అన్నింటిని తిరగదోడుతాం. గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు. సీ పోర్టుల్లో చూస్తే అక్రమ రవాణా?. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమా లేక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉందా అని డిప్యూటీ సీఎంను సూటిగా ప్రశ్నిస్తున్నా?. తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు వెనకాడుతున్నారు. ప్రతీ రోజూ రాష్ట్రంలో అత్యాచారమో, హత్య, కిడ్నాప్ ఇలా ఏదో ఒక సమస్య చూస్తున్నాం. పెద్ద ఎత్తున అప్పు చేసింది ఈ ప్రభుత్వం ఆ డబ్బు ఏం చేశారంటే సమాధానం లేదు. భూ కేటాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు.. కేటాయింపులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా?. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఎలా ఇస్తారు?.
ఫీజురియింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం చెందింది. రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ఈ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 15వ ఆర్ధిక నిధులు వినియోగానికి బ్రేకులు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్‌కు ఆ విషయం తెలుసా?. ఉన్నప్పుడు ఏం పీకారని పవన్ అడుగుతున్నారు.. ఏంటి ఈ మాటలు. మాటలు ఎక్కువ మాట్లాడే వారికి చేతనైంది తక్కువ. రెండేళ్ల పాలనపై ఈ ప్రభుత్వానికి, మంత్రులపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. సంక్రాంతికల్లా గోతులు కప్పేయాలని చంద్రబాబు అంటున్నారు.. కానీ ఏ సంక్రాంతో చెప్పడం లేదు. గోతులు కప్పడానికి నిధులు ఇవ్వండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి భోజనం పెట్టంది. పిల్లల అవసరాలను తీర్చండి’ అని హితవు పలికారు.


