జరగబోయేవన్నీ చెప్పగలనంటాడు! | Health Tips: Schizophrenia: What It Is Causes And Symptoms | Sakshi
Sakshi News home page

జరగబోయేవన్నీ చెప్పగలనంటాడు!

Nov 20 2025 10:08 AM | Updated on Nov 20 2025 11:29 AM

Health Tips: Schizophrenia: What It Is Causes And Symptoms

నమస్తే డాక్టర్‌ గారు! నాకు 3 నెలల క్రితమే వివాహం అయింది. నా భర్త ఒక ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తాడు. ఆయన ప్రవర్తన, మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. ఎప్పుడూ తన ఆలోచనల్లోనే మునిగిపోయి ఉంటాడు. ఎవరినీ నమ్మకూడదు అంటాడు. బయటకు వెళ్ళడానికి ఇష్టపడడు, ఇంట్లో కూడా వింతగా మాట్లాడుతుంటాడు. మొక్కలు, జంతువులు, పక్షుల భాషలు తనకు తెలుసని వాటితో ఏవేవో శబ్దాలతో మాట్లాడుతుంటాడు. 

ఇంటికి ఎవరైనా వస్తే వారి మొహం చూసి, కళ్ళు మూసుకొని, మీకిలా జరుగుతుంది అని అందరికీ భవిష్యత్తు గురించి చెబుతున్నాడు. నన్ను బాగానే చూసుకుంటాడు. డాక్టర్‌ దగ్గరికి వెళదామంటే ‘నీకేమైనా పిచ్చా’ అని అందరినీ దబాయిస్తున్నాడు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీరే ఏదైనా మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను! 

మీరు వివరించిన లక్షణాల ప్రకారం మీ భర్తకు కనిపిస్తున్న ప్రవర్తన ‘స్కిజో టైపల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ ‘ అనే ఒక మానసిక భ్రాంతికి దగ్గరగా ఉంది. ఈ సమస్యతో బాధపడే వ్యక్తుల ఆలోచనలు, నమ్మకాలు, ప్రవర్తన ఇతరులకు చాలా విచిత్రంగా, అసాధారణంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, విపరీతమైన మూఢనమ్మకాలు, వాళ్ళకి ప్రత్యేక శక్తులు ఉన్నాయనుకోవడం, అందరిపై అనుమానం, మీరు చెప్పినట్లు, జంతువులు, మొక్కలతో మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. మిగిలిన వారికి సాధారణంగా అనిపించే విషయాలలో కూడా వీళ్ళు నిగూఢ అర్థాలు వెతుకుతారు. 

వీరు ప్రపంచాన్ని చూసే విధానమే వేరుగా ఉంటుంది. ఎక్కువగా ఊహా ప్రపంచంలో బ్రతుకుతారు. అయితే వీరు తమ పనిని చేసుకోగలరు. లిమిటెడ్‌గా కుటుంబం వరకు బాగానే ఉన్నా బయట సామాజిక సంబంధాలు మాత్రం కలిగి ఉండలేరు. తమకి ఉన్నది ఒక సమస్య అని వారు గుర్తించలేరు. ఇది స్కిజోఫ్రీనియా అనే తీవ్రమైన మానసిక జబ్బు కాదు, కానీ దాని తేలికపాటి రూపం ఇది అని చెప్పవచ్చు. అనేక పరిశోధనల ప్రకారం స్కిజోఫ్రీనియా ఉన్న వారి కుటుంబ సభ్యులలో ఈ సమస్య ఎక్కువగా కనపడినట్లు నిరూపణలు ఉన్నాయి. 

కొన్నిసార్లు ఈ సమస్య తరువాతి కాలంలో పూర్తిస్థాయి ‘స్కిజోఫ్రేనియా’ లేదా ‘ఓసీడీ’ జబ్బు లాగా రూపాంతరం చెందవచ్చు కూడా. ఇదొక అరుదైన సమస్య కాబట్టి పూర్తిగా మార్చడం కూడా కష్టం, అయినా, సహనంతో, ప్రేమతో, మానసిక నిపుణుల సహాయంతో అతని ప్రవర్తనను చాలా వరకు మెరుగు పరచవచ్చు. మీరు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్‌ని సంప్రదించండి. కొన్ని లక్షణాలు మందులతో తగ్గించవచ్చు, అతని ఆలోచనలు మార్చడం కోసం, సామాజిక వైపుణ్యాల అభివృద్ధి కోసం ‘సైకో థెరపీ’ చాలావరకు ఉపయోగపడుతుంది. అన్నింటికీ మించి కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్
(విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com)

(చదవండి: PM Narendra Modi's Watch: రూపాయి నాణెంతో కూడిన ప్రధాని మోదీ వాచ్‌..! ధర ఎంత ఉంటుందంటే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement