కొత్త ఏడాదిని హెల్దీ న్యూ ఇయర్‌గా మార్చేద్దాం ఇలా..! | Healthy Habits For The New Year 2026, Tips From Top Doctors To Make The New Year A Healthy One | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిని హెల్దీ న్యూ ఇయర్‌గా మార్చేద్దాం ఇలా..!

Jan 4 2026 1:12 PM | Updated on Jan 4 2026 3:06 PM

Healthy Habits for the New Year 2026

పేరుకు న్యూ ఇయరే గానీ తెల్లారిలేస్తే మళ్లీ అదే తిండి. అవే సరదాలు. అవే సినిమాలు. అందుకే దాదాపుగా అందరికీ తెలిసినవే అయినా అవే ఆరోగ్య సూత్రాల్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. అవే జాగ్రత్తల్ని చెబుతూ హెచ్చరిస్తున్నారు. కొత్త ఏడాది వచ్చినప్పుడల్లా ఎప్పట్లాగే రెజల్యూషన్స్‌ తీసుకుంటూ మనం మాత్రం మళ్లీ వాటిని మరుసటి ఏడాదికి వాయిదా వేయడం లేదా?  కాకపోతే ఒకసారి చెబితే కొందరైనా సీరియస్‌గా తీసుకుని ఆచరిస్తారనీ, దాంతో వాళ్లు ఆరోగ్యంగా, ఫిట్‌గా, ఆయుర్దాయం మరింతగా పెంచుకుని హెల్దీగా మారకపోతారా... కొత్త ఏడాదిని హెల్దీ న్యూ ఇయర్‌గా మార్చుకోకపోతారా అనే ఆకాంక్షతో ప్రముఖ హాస్పిటళ్లకు చెందిన పెద్ద డాక్టర్లంతా మరోమారు మనకు సుద్దులు చెబుతున్నారు. కొందరైనా ఆచరించి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకుంటే... ఈ ఏడాదికి ఈ ఆరోగ్యవచనాల లక్ష్యాలూ, ప్రయోజనాలూ నెరవేరినట్టే!  ఐదు ప్రముఖ హాస్పిటల్స్‌ నుంచి ఐదుగురు పెద్ద డాక్టర్లతో కొత్త ఏడాదిని హెల్దీగా మార్చుకునేందుకు సూచనలతో ప్రత్యేక కథనం...

ఆహార పరమైన సూచనలు...

వేళకు తినండి. ఆహారం తక్కువ మోతాదుల్లో తీసుకుంటూ రోజులో ఎక్కువసార్లు తినండి. దీనివల్ల  జీర్ణవ్యవస్థపై భారం పడదు. దాంతో అది చాలాకాలం ఆరోగ్యంగా ఉంటుంది. 

రాత్రి భోజనం మితంగా ఉండాలి. ఓ ఆంగ్ల నానుడి ప్రకారం ఉదయం భోజనం రాజభోజనంలా, మధ్యానం మధ్యస్తంగా, రాత్రిభోజనం పేదవాడి భోజనంలా ఉండాలన్నది ఒక సూక్తి. 

తినే సమయంలో మీ బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎమ్‌ఐ)ని పరిగణనలోకి తీసుకోండి. బీఎమ్‌ఐ అంటే ఒకరి బరువు డివైడెడ్‌ బై వాళ్ల ఎత్తు స్క్వేర్‌ అని అర్థం. అంటే ఒక వ్యక్తి బరువు 80 కిలోలు అనుకుందాం. అతడి ఎత్తు 1.8 మీటర్లు అయితే 80 డివైడెడ్‌ బై 1.8 స్క్వేర్‌. ఫలితంగా దాదాపు 24.69గా వచ్చే ఆ విలువను బీఎమ్‌ఐ పట్టికతో సరి΄ోల్చుకుని ఎవరికి వారు తాము ఏ స్థూలకాయం పరిధిలో ఉన్నరన్నది తెలుసుకోవచ్చు. 

ఒకవేళ తమ బీఎమ్‌ఐ ప్రకారం ఎక్కువ ఊబకాయ పరిధిలోకి వచ్చేవారు  బరువు తగ్గాలనుకున్నవారు డాక్టర్‌ సలహా మేరకు ఎలాంటి జీవనశైలి నియమాలు పాటించాలో, బరువు తగ్గడానికి ఏయే ఆరోగ్యకరమైన పద్ధతులు అవలంబించాలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే అదనపు బరువు ఉన్నవారు తమ కండరాలను (మజిల్‌ మాస్‌ను) కాకుండా అదనపు కొవ్వును మాత్రమే కరిగించుకునేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. 

శాకాహారం తీసుకునేవారు అన్ని రకాల తాజా ఆకుకూరలూ, కాయగూరల వెరైటీలు తీసుకోవాలి. అదే మాంసాహారం తినేవారైతే రెడ్‌మీట్‌కు బదులు... ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే చేపలు తీసుకోవడం మంచిది. వాటితోపాటు తాజా పండ్లూ తీసుకోవాలి.
డాక్టర్‌ సోనిక రెడ్డి, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌

ఒత్తిడి నియంత్రణ కోసం... 

తీవ్రమైన ఒత్తిడితో పోలిస్తే పరిమితమైన ఒత్తిడి వల్ల పనులు సమయానికి పూర్తయ్యేలా చేయడం వల్ల కాస్తంత ప్రయోజనం ఉంటుంది. కానీ మితిమీరిన ఒత్తిడి ఆరోగ్యానికి ఎప్పటికీ హానిచేసేదే. 

మానసిక ఒత్తిడి పురుషుల కంటే మహిళలకే ప్రమాదకరం. 

ఒత్తిడి విషయానికి వస్తే పని ప్రదేశంలో ఒత్తిడి ఎదురైనప్పుడు మనం తప్ప ఇతరులైతే అంత పర్‌ఫెక్ట్‌గా చేయలేరనే భావనను వదిలిపెట్టి కొలీగ్స్‌తో పని షేర్‌ చేసుకుని ఓ టీమ్‌వర్క్‌లా చేసే పని ఒత్తిడిని తగ్గిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. 

పెంపుడు జంతువులో ఆడుకునేవారికీ, అక్వేరియమ్‌లో చేపలను చూస్తూ ఉండేవారికి, ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తుండేవారికి ఒత్తిడి తగ్గి, గుండెజబ్బులూ నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. 

ప్రకృతిసిద్ధమైన నీటి ప్రవాహం వంటి ధ్వనులూ... సంగీతం వంటివి ఒత్తిడిని తగ్గించే స్వాభావికమైన మందులు అనుకోవచ్చు. 

కోపం, విచారం వంటి ఫీలింగ్స్‌ను అణిచేయకుండా ఇతరులను ఆటంకపరచని రీతిలో వ్యక్తం చేయడమే మంచిది. 

మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఒప్పుకోవడం మంచిది. ఈగో కారణంగా ఒప్పుకోలేక΄ోతే అది మరింత ఒత్తిడి పెంచుతుంది. ఇంకా హాని చేస్తుంది. 

చక్కటి హాస్యంతో కూడిన సినిమాలు చూస్తూ, ఎప్పుడూ నవ్వుతూ ఆహ్లాదంగా ఉండేవారికి రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి జబ్బులు రావడం తక్కువ. తమ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ కారణంగా ఇలాంటివారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కాబట్టి మంచి ఆరోగ్యకరమైన హాస్యానురక్తిని పెంచుకోండి.
డాక్టర్‌ మంజుల రావు, సీనియర్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌

చెడు అలవాట్లకు దూరంగా...
సిగరెట్, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సిగరెట్‌ పొగలో కనీసం 6000 హానికరమైన వ్యర్థ పదార్థాలుంటాయి. అందులో క్యాన్సర్‌కు కారణమయ్యేవి కనీసం 60 పదార్థాలుంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సెకండ్ల వ్యవధిలో ఒకరు సిగరెట్‌ కారణంగానే ్ర΄ాణాలు వదులుతున్నారని అంచనా. 

గుండెకు సంబంధించిన వ్యాధులతో చని΄ోయేవారిని పరిశీలించినప్పుడు వారిలో కనీసం 40 శాతం మంది తమ పొగతాగే అలవాటు కారణంగా తమ గుండెకు చేటు తెచ్చుకున్నవారేనని చాలా అధ్యయనాల్లో తేలింది. అలాగే ఊపిరితిత్తులు, హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్లు వచ్చినవారిలో దాదాపు 80 శాతం మంది తమ పొగతాగడం అలవాటు కారణంగా ప్రాణాంతకమైన ఆ జబ్బును తమ చేజేతులారా తెచ్చుకున్నవారే. 

పొగతాగే అలవాటు వల్ల రక్త΄ోటు పెరుగుతుంది. అది గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ సిగరెట్‌ పొగవల్ల దేహంలో పేరుకునే కార్బన్‌ మోనాక్సైడ్‌ వల్ల దేహం తనకు ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్‌ను అంతగా తీసుకోలేక΄ోవడం, ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం జరుగుతాయి.ఇవన్నీ ఆరోగ్యానికి చేటు చేసే పరిణామాలే. 

పరిమితంగా రెడ్‌ వైన్‌ వంటి మద్యం తీసుకుంటే అది గుండెకు మేలు చేస్తుందనీ, రెండు పెగ్గులకు మించకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే మాటలన్నీ కేవలం అ΄ోహ మాత్రమే. ఎంత పరిమితంగా తీసుకున్నా మద్యం చేసే చేటు మాత్రం అపరిమితం. కాలేయం మొదలుకొని, రక్తనాళాలూ, రక్తప్రసరణ వ్యవస్థ, గుండె, కిడ్నీలు... అన్నిటికంటే ముఖ్యంగా కీలకమైన మెదడు... ఇలా దేహంలోని అన్ని  అవయవాలనూ, సంబంధిత వ్యవస్థలను మద్యం దెబ్బతీస్తుంది. 

పైన పేర్కొన్న కారణాల నేపథ్యంలో పొగతాగడం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆ అలవాట్లు ఉన్నవారు క్రమక్రమంగా కాదు... తక్షణం వాటిని మానేయాలి. మంచి ఆరోగ్యం కోసం ఇలా మానేయడం అవసరం కూడా.
డాక్టర్‌ పి. కిరణ్మయి, సీనియర్‌ ఫిజీషియన్, డయాబెటాలజీ అండ్‌ థైరాయిడ్‌ స్పెషలిస్ట్‌ 

వ్యాయామం తప్పనిసరి... 
ఒకేచోట కదలకుండా చాలాసేపు కుదురుగా కూర్చొని ఉండటం గానీ, ఏ పనీ చేకుండా బద్ధకంగా కాలం గడపడం గానీ దేహానికి చేటు చేస్తాయని చాలా అధ్యయనాల్లో తేలిన విషయమే. 

పొగతాగే అలవాటు వల్ల దేహానికీ, దేహంలోని అవయవాలూ, వాటి వ్యవస్థలకు ఎలాంటి హాని చేకూరుతుందో, శారీరక శ్రమలేకుండా ఉండటం, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా అలాంటి అనర్థాలే వస్తాయంటూ అనేక అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 

ఒక అధ్యయనం ప్రకారం... క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వల్ల గుండె బలంగా తయారవుతుంది. దాంతో రక్తపోటు అదుపులో ఉండటం, రక్తప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో ప్రతి కణానికీ తగినంత ఆహారం, ఆక్సిజన్‌ అందడం, గుండె కొట్టుకునే లయ (రిథమ్‌) క్రమం తప్పకుండా కొనసాగడం, ఎముకలకు తగిన న్యూట్రిషన్‌ అందడం, కండరాలు బలిష్టంగా ఉండటం, వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో కొలాజెన్‌ తగ్గడం వల్ల చర్మం వదులవుతూ వృద్ధాప్యం తాలూకు చిహ్నాలు కనిపించడంవంటి ఏజింగ్‌ అనర్థాలు నివారితమై చాలాకాలం పాటు యౌవనంగా ఉండటం వంటి అనేక ప్రయోజనాలూ చేకూరతాయి. 

నడక లేదా ఇతరత్రా తేలికపాటి వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గడం, నిద్రలేమి వంటివి నివారితం కావడం, ఫలితంగా మంచి గాఢమైన నిద్రపట్టడం, రోజంతా ఉల్లాసంగా చురుగ్గా ఉండటం సాధ్యమవుతుంది. 

వ్యాయామం చేయడం అన్నది బోరుగా అనిపిస్తే ఆరుబయట ఉల్లాసంగా ఆటలాడటం, ఈదడం, ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు చెప్పుకుండా నడవడం వంటి ప్రక్రియల ద్వారా దేహానికి వ్యాయామాన్ని సమకూర్చడం చాలా ఆహ్లాదకరమైన, సంతోషదాయకమైన మార్గాలు. దేహానికి ఆహారం ఎంత అవసరమయో, వ్యాయామమూ అంతే అవసరమని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అందుకే జిమ్‌లో చేరేందుకూ.. కుదరక΄ోతే కనీసం ఆటలాడేందుకైనా షూలేస్‌లు కట్టుకోవడం మొదలుపెట్టండి.
డాక్టర్‌ ఆరతీ బెల్లారీ,సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌

రిలాక్సేషన్, విశ్రాంతి, నిద్ర విషయంలో... 
రోజంతా పని చేస్తూనే ఉండకుండా, మధ్యమధ్య చిన్న చిన్న విరామాలు తీసుకోవడం అవసరం.ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక అలసట తగ్గి, పని మీద ఏకాగ్రత, సామర్థ్యం మెరుగవుతాయి.

వారంలో కనీసం ఒక రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి ముఖ్యం. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో సమయం గడపడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రకృతిలో నడక, తోటలో గడపడం, పనుల్లో బాగా బిజీగా ఉండేవారు... ఒకవేళ వాళ్లు మంచి యుక్తవయసులో ఉన్న యువత అయితే ట్రెక్కింగ్‌ లేదా హైకింగ్‌ వంటివి తమ ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. వీళ్లంతా ఒక స్నేహబృందంగా ఏర్పడి వెళ్లడం ఒత్తిడిని తగ్గించి మంచి ప్రయోజనాన్నిస్తుంది. 

శరీరానికి తగినంత నిద్ర తప్పనిసరి.  ఎలాంటి అంతరాయం లేని 6 నుంచి 8 గంటల రాత్రి నిద్ర అవసరం. నిద్ర అనేది శరీరంలో, మెదడులో, కండరాల్లో పునరుత్తేజం తెచ్చే సహజ ప్రక్రియ.

నిద్రలోనే మన రోగనిరోధక శక్తి బలపడుతుంది. తగినంత నిద్రలేక΄ోతే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఉంటాయని ఎన్నో అధ్యయనాలలో తేలింది. 

తగిన నిద్ర వలన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం మెరుగవుతాయి.

తక్కువగా నిద్ర ΄ోయేవారిలో రక్త΄ోటు, షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు, మైగ్రేన్‌ వంటి ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రతిరోజూ రాత్రిఒకే సమయానికి పడుకోవడం (సాధారణంగా రాత్రి 9 తర్వాత), ఉదయం ఒకే సమయానికి (సాధారణంగా ఉదయం 6 గంటలకు) నిద్రలేవడం చాలా ముఖ్యం. దీనివల్ల మన శరీర గడియారం (సర్కేడియన్‌ రిథమ్‌) సరిగ్గా పనిచేస్తుంది, నిద్ర నాణ్యత మెరుగవుతుంది.

చాలా తక్కువ నిద్ర (నాలుగు గంటల వ్యవధి కంటే తక్కువ నిద్రించడం) కూడా మంచిది కాదు, అలాగే అవసరానికి మించిన నిద్ర (ఎనిమిది గంటల కంటే ఎక్కువగా నిద్ర΄ోవడం) కూడా సమస్యలకు సంకేతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో అధిక నిద్రకు డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలతో సంబంధం ఉండవచ్చు.

ప్రతి వ్యక్తికి అవసరమైన నిద్ర కొంత భిన్నంగా ఉండవచ్చు. అయితే సాధారణంగా పెద్దలలో రోజుకు 7–9 గంటల నిద్ర ఆరోగ్యానికి అవసరమని నిద్ర వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ శరీరం సూచించే అవసరాన్ని గమనిస్తూ, క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడమే మంచి ఆరోగ్యానికి మార్గం. 
డాక్టర్‌ ఎల్‌.సునందిని, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ 

(చదవండి: ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement