అంటార్కిటికాలో 365 రోజులు... | Female General Surgeon Vaidehi Venkateswaran on an Indian Antarctica expedition | Sakshi
Sakshi News home page

అంటార్కిటికాలో 365 రోజులు...

Jan 8 2026 1:26 AM | Updated on Jan 8 2026 1:26 AM

Female General Surgeon Vaidehi Venkateswaran on an Indian Antarctica expedition

స్ఫూర్తి

అంటార్కిటికా చూసే అవకాశం భారతీయ స్త్రీలకు అతి తక్కువగా దొరుకుతుంది. ఎవరైనా వెళ్లినా కొన్ని గంటలు లేదా రోజులమజిలీ మాత్రమే చేయగలరు. కాని ముంబైకి చెందిన జనరల్‌ సర్జన్  వైదేహీ వెంకటేశ్వరన్ అంటార్కిటికాలో సంవత్సరం పాటు ఉండి భారతీయ పరిశోధక బృందానికి వైద్యసేవలు అందించారు. ‘44వ ఇండియన్  సైంటిఫిక్‌ ఎక్స్‌పెడిషన్  టు అంటార్కిటికా’లో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చిన వైదేహీ అక్కడి అనుభవాలను పంచుకున్నారు.

ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అంటార్కిటికా ఒకటి. దాని గురించి విన్న వారే తప్ప అక్కడికి వెళ్లినవారు తక్కువ.  వెళ్లి నివసించినవారు అరుదు. చుట్టూ మంచుతో నిండిన ఆ ధ్రువప్రాంతంలో జీవనం దుస్సాధ్యం. అయితే భారతదేశానికి చెందిన 31 ఏళ్ల మహిళా జనరల్‌ సర్జన్‌ వైదేహీ వెంకటేశ్వరన్‌ అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టడమే కాదు, ఏడాది పాటు అక్కడే గడిపి ఇటీవల తిరిగి వచ్చారు. అక్కడున్న ప్రతి క్షణం తన జీవితంలో మర్చిపోలేని అనుభవం అంటున్నారామె.

పదేళ్ల ముందు నుంచి ఆసక్తి
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రీసెర్చ్‌ (ఎన్ .సి.పీ.ఓ.ఆర్‌) ఆధ్వర్యంలో 44వ ఇండియన్‌ సైంటిఫిక్‌ ఎక్స్‌పెడిషన్‌ టు అంటార్కిటికా (ఐఎస్‌ఈఏ)లో భాగంగా మన దేశం నుంచి వెళ్లిన బృందంలో ఏకైక మహిళ వైదేహీ వెంకటేశ్వరన్‌. ‘అంటార్కిటికా చూడాలనేది నా చిరకాల స్వప్నం. 2015లో విద్యార్థిగా ఉన్న సమయంలో అంటార్కిటికా ఎక్స్‌పెడిషన్‌ గురించి విన్నాను. ఎప్పటికైనా అందులో పాల్గొనాలని భావించాను. 2025లో ఎన్ సీపీఓఆర్‌కు దరఖాస్తు చేసుకున్నాను. మహిళలకు ఈ అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నాకు  రాగానే చాలా ఆనందంగా అనిపించింది’ అన్నారామె.

వడపోతల ఎంపిక
అంటార్కిటికా మంచు ఖండం. అక్కడికి వెళ్లి ఏడాదిపాటు సేవలందించాలంటే చాలా మనోధైర్యం, గుండె నిబ్బరం కావాలి. అందుకే అక్కడికి వెళ్లే వారిని ప్రభుత్వం అనేక వడపోతల తర్వాత ఎంపిక చేస్తుంది.  ఎంపికైన వారికి ఇండో–టిబెటియన్‌ సరిహద్దు పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. అంటార్కిటికాలో పరిస్థితులు, వాతావరణం, అందుకు తగ్గ ఏర్పాట్లు,  చేయాల్సిన పనులు, అక్కడి జీవనవిధానం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.  ‘శిక్షణ తర్వాత నేను అంటార్కిటికాలో అడుగుపెట్టిన రోజు ‘పోలార్‌ డే’. అంటే రోజంతా సూర్యుడు ఉండే రోజది. రాత్రి ఆకాశంలో ఒకేసారి సూర్యుణ్ని, చంద్రుణ్ని చూసే ఆ వింతను జీవితంలో మర్చిపోలేను. నేను ఉన్న ప్రదేశంలో నాతో పాటు మరో వైద్యుడు, నర్స్‌ ఉంటారు. మొబైల్‌ సిగ్నల్స్‌ ఉండవు. ఇంటర్‌నెట్‌ తక్కువ. బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలియాలంటే రేడియో ఒక్కటే ఆధారం. శీతాకాలం మొత్తం నా చుట్టూ 24 మంది ఉన్నారు. రోజంతా అత్యంత నిశ్శబ్దంగా ఉండేది’ అని ఆమె వివరించారు.

ఏ క్షణంలోనైనా తప్పిపోయే అవకాశం
‘శీతాకాలంలో మంచంతా గడ్డకట్టుకుపోతుంది. బయటికెళ్లిన వారు ఏ క్షణంలోనైనా తప్పిపోయే అవకాశం ఉంటుంది. చుట్టూ పేరుకు పోయిన మంచులో ఎటు వెళ్తున్నామో కూడా తెలియని పరిస్థితి. దారి చూపేందుకు అక్కడ ఎటువంటి గుర్తులూ ఉండవు. అందుకే  వెంట ఎప్పుడూ జీపీఎస్‌ ఉండేది.  అంటార్కిటికా పెంగ్విన్లకు ఆవాసం. అయితే మాకున్న ఆదేశాల వల్ల వాటికి మేము దూరంగా ఉన్నాం’ అన్నారామె.

ఒంటరిగా మనగలగడం కష్టం
‘అంటార్కిటికా ఖండంలో ఒంటరిగా మనగలగడం కష్టం. వేలకొద్దీ కిలోమీటర్ల వరకూ మానవసంచారం ఉండదు. చుట్టూ అంతా నిశ్శబ్దంలో ఒక్కోసారి ఏమీ తోచక డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అక్కడ మన దేశంతోపాటు చైనా, రష్యా పరిశోధక స్టేషన్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు ఒకరికొకరం సాయం అందించుకునేవాళ్లం. ‘పా’ సినిమాలో అమితాబ్‌ ఒక తెల్లటి గ్లోబ్‌ తయారు చేసి ‘ఈ భూమ్మీద ఎటువంటి సరిహద్దులు లేవు’ అంటారు కదా! అంటార్క్‌టికాలో ఏడాదిపాటు జీవించి, తిరిగి వచ్చాక నాకు ఈ ప్రపంచం అలాగే అనిపిస్తోంది’ అంటున్నారు వైదేహి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement