breaking news
indian researchers
-
అంటార్కిటికాలో 365 రోజులు...
అంటార్కిటికా చూసే అవకాశం భారతీయ స్త్రీలకు అతి తక్కువగా దొరుకుతుంది. ఎవరైనా వెళ్లినా కొన్ని గంటలు లేదా రోజులమజిలీ మాత్రమే చేయగలరు. కాని ముంబైకి చెందిన జనరల్ సర్జన్ వైదేహీ వెంకటేశ్వరన్ అంటార్కిటికాలో సంవత్సరం పాటు ఉండి భారతీయ పరిశోధక బృందానికి వైద్యసేవలు అందించారు. ‘44వ ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్‌పెడిషన్ టు అంటార్కిటికా’లో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చిన వైదేహీ అక్కడి అనుభవాలను పంచుకున్నారు.ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అంటార్కిటికా ఒకటి. దాని గురించి విన్న వారే తప్ప అక్కడికి వెళ్లినవారు తక్కువ. వెళ్లి నివసించినవారు అరుదు. చుట్టూ మంచుతో నిండిన ఆ ధ్రువప్రాంతంలో జీవనం దుస్సాధ్యం. అయితే భారతదేశానికి చెందిన 31 ఏళ్ల మహిళా జనరల్ సర్జన్ వైదేహీ వెంకటేశ్వరన్ అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టడమే కాదు, ఏడాది పాటు అక్కడే గడిపి ఇటీవల తిరిగి వచ్చారు. అక్కడున్న ప్రతి క్షణం తన జీవితంలో మర్చిపోలేని అనుభవం అంటున్నారామె.పదేళ్ల ముందు నుంచి ఆసక్తినేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ (ఎన్ .సి.పీ.ఓ.ఆర్) ఆధ్వర్యంలో 44వ ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్‌పెడిషన్ టు అంటార్కిటికా (ఐఎస్ఈఏ)లో భాగంగా మన దేశం నుంచి వెళ్లిన బృందంలో ఏకైక మహిళ వైదేహీ వెంకటేశ్వరన్. ‘అంటార్కిటికా చూడాలనేది నా చిరకాల స్వప్నం. 2015లో విద్యార్థిగా ఉన్న సమయంలో అంటార్కిటికా ఎక్స్‌పెడిషన్ గురించి విన్నాను. ఎప్పటికైనా అందులో పాల్గొనాలని భావించాను. 2025లో ఎన్ సీపీఓఆర్కు దరఖాస్తు చేసుకున్నాను. మహిళలకు ఈ అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నాకు రాగానే చాలా ఆనందంగా అనిపించింది’ అన్నారామె.వడపోతల ఎంపికఅంటార్కిటికా మంచు ఖండం. అక్కడికి వెళ్లి ఏడాదిపాటు సేవలందించాలంటే చాలా మనోధైర్యం, గుండె నిబ్బరం కావాలి. అందుకే అక్కడికి వెళ్లే వారిని ప్రభుత్వం అనేక వడపోతల తర్వాత ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి ఇండో–టిబెటియన్ సరిహద్దు పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. అంటార్కిటికాలో పరిస్థితులు, వాతావరణం, అందుకు తగ్గ ఏర్పాట్లు, చేయాల్సిన పనులు, అక్కడి జీవనవిధానం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు. ‘శిక్షణ తర్వాత నేను అంటార్కిటికాలో అడుగుపెట్టిన రోజు ‘పోలార్ డే’. అంటే రోజంతా సూర్యుడు ఉండే రోజది. రాత్రి ఆకాశంలో ఒకేసారి సూర్యుణ్ని, చంద్రుణ్ని చూసే ఆ వింతను జీవితంలో మర్చిపోలేను. నేను ఉన్న ప్రదేశంలో నాతో పాటు మరో వైద్యుడు, నర్స్ ఉంటారు. మొబైల్ సిగ్నల్స్ ఉండవు. ఇంటర్నెట్ తక్కువ. బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలియాలంటే రేడియో ఒక్కటే ఆధారం. శీతాకాలం మొత్తం నా చుట్టూ 24 మంది ఉన్నారు. రోజంతా అత్యంత నిశ్శబ్దంగా ఉండేది’ అని ఆమె వివరించారు.ఏ క్షణంలోనైనా తప్పిపోయే అవకాశం‘శీతాకాలంలో మంచంతా గడ్డకట్టుకుపోతుంది. బయటికెళ్లిన వారు ఏ క్షణంలోనైనా తప్పిపోయే అవకాశం ఉంటుంది. చుట్టూ పేరుకు పోయిన మంచులో ఎటు వెళ్తున్నామో కూడా తెలియని పరిస్థితి. దారి చూపేందుకు అక్కడ ఎటువంటి గుర్తులూ ఉండవు. అందుకే వెంట ఎప్పుడూ జీపీఎస్ ఉండేది. అంటార్కిటికా పెంగ్విన్లకు ఆవాసం. అయితే మాకున్న ఆదేశాల వల్ల వాటికి మేము దూరంగా ఉన్నాం’ అన్నారామె.ఒంటరిగా మనగలగడం కష్టం‘అంటార్కిటికా ఖండంలో ఒంటరిగా మనగలగడం కష్టం. వేలకొద్దీ కిలోమీటర్ల వరకూ మానవసంచారం ఉండదు. చుట్టూ అంతా నిశ్శబ్దంలో ఒక్కోసారి ఏమీ తోచక డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అక్కడ మన దేశంతోపాటు చైనా, రష్యా పరిశోధక స్టేషన్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు ఒకరికొకరం సాయం అందించుకునేవాళ్లం. ‘పా’ సినిమాలో అమితాబ్ ఒక తెల్లటి గ్లోబ్ తయారు చేసి ‘ఈ భూమ్మీద ఎటువంటి సరిహద్దులు లేవు’ అంటారు కదా! అంటార్క్టికాలో ఏడాదిపాటు జీవించి, తిరిగి వచ్చాక నాకు ఈ ప్రపంచం అలాగే అనిపిస్తోంది’ అంటున్నారు వైదేహి. -
Bug in Uber: ఉబర్‌లో ఫ్రీ రైడింగ్ సర్వీస్.. ఇండియన్ హ్యాకర్‌కి రూ.4.6 లక్షల రివార్డ్!
ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ 'ఉబర్' (Uber) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈ రోజు మన ప్రయాణాలను మరింత సుగమనం చేయడానికి ఈ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఈ యాప్‌లో కంపెనీ కూడా గుర్తించని ఒక బగ్ ఒక ఇండియన్ గుర్తించి సంస్థ నుంచి భారీ నజరానా పొందాడు. నివేదికల ప్రకారం.. ఉబర్ యాప్‌లో ఫ్రీ రైడింగ్‌కి సంబంధించిన ఒక బగ్ ఉన్నట్లు భారతీయ ఎథికల్ హ్యాకర్ 'ఆనంద్ ప్రకాశ్' కనిపెట్టాడు. ఈ విషయాన్నీ స్వయంగా కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి కంపెనీ అతనికి రూ. 4.5 లక్షలు బహుమతిగా అందించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉబర్‌లో కనిపించిన ఈ కొత్త బగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఫ్రీ రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది, అప్పుడు కంపెనీ ఎక్కువ నష్టాలను భరించాల్సి వచ్చేది. కానీ ఎట్టకేలకు ఇది హ్యాకర్ కంటపడి కంపెనీ దృష్టికి చేరటం వల్ల ఆ ప్రమాదం తప్పింది. దీని గురించి ఒక వ్యక్తి చెప్పే వరకు కంపెనీ గుర్తించకపోవడం గమనార్హం. (ఇదీ చదవండి: ఒకే రోజు 400 కార్లు డెలివరీ చేసిన మహీంద్రా.. బుక్ చేసుకున్న వారికి పండగే!) ప్రకాష్ 2017లో ఈ కనుగొన్నట్లు, 2019లో దీని గురించి కంపెనీకి వివరించినట్లు సమాచారం. కంపెనీకే తెలియని విషయం చెప్పిన ఇతనికి సంస్థ జీవితాంతం ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పించింది. అయితే ఇటీవల ఆనంద్ ప్రకాశ్ ఈ బగ్ గురించి వివరంగా తన లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా వివరించారు. -
పరిశోధకులకు బ్రిటన్ ప్రత్యేక వీసాలు
లండన్: పరిశోధన రంగానికి ఊతమిచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో భారతీయ పరిశోధకులు లాభపడనున్నారు. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకుల కోసం ప్రత్యేక వీసాల జారీని బ్రిటన్ ప్రారంభించింది. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభించిన యూకే సైన్స్, రీసెర్చ్, అకాడెమియా కార్యక్రమం(యూకేఆర్ఐ) ప్రస్తుతమున్న టయర్–5(ప్రభుత్వ ఆమోదిత తాత్కాలిక సిబ్బంది మార్పిడి) పథకంతోపాటు అమల్లో ఉంటుంది. కొత్త వీసాతో యూరోపియన్ యూనియన్(ఈయూ)యేతర దేశాల సైంటిస్టులు, పరిశోధకులు బ్రిటన్‌లో రెండేళ్లపాటు ఉండొచ్చు. బ్రిటన్‌లోని 7 పరిశోధన విభాగాలు,ఇన్నోవేటివ్ యూకే, రీసెర్చ్ ఇంగ్ల్లండ్లలో పనిచేసేందుకు చాన్స్ ఉంటుంది.ఈ పరిణామాలు భారత్ వృత్తి నిపుణులు, వ్యాపార వేత్తలకు అనుకూలం. -
లివర్ వ్యాధి చికిత్సలో ముందడుగు
కోల్‌కతా: ఇటీవలి కాలంలో కాలేయ సమస్యలు పెరిగిపోతున్నాయి. కాలేయ వ్యాధుల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్ఏఎఫ్డీ) ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి చికిత్సలో భారతీయ శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. ముఖ్యంగా అధిక బరువు, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో కనిపించే ఈ ఎన్ఏఎఫ్డీలో లివర్‌లో కొవ్వు పరిమాణం పెరగడంతో ప్రాణాంతకంగా మారుతోంది. భారత్‌లోని వయోజనుల్లో సుమారు 30 శాతం మంది ఎన్ఏఎఫ్ఎల్డీ బారిన పడుతున్నారు. ఇప్పటివరకూ దీనికి ప్రత్యేకంగా ఎలాంటి వైద్య చికిత్స అందుబాటులో లేదు. దీనిపై పరిశోధనలు నిర్వహిస్తున్న సీఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ శాస్త్రవేత్తలు.. కణంలోని సీఓపీ-1 ప్రొటీన్‌ను నిరోధించడం ద్వారా లివర్ ఫ్యాట్ పరిమాణం గణనీయంగా తగ్గుతోందని గుర్తించారు. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రయోగదశలోనే ఉందని.. మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన పార్థా చక్రవర్తి వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలను అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్(ఏడీఏ) జర్నల్‌లో ప్రచురించినట్లు తెలిపారు.


