నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్‌..! | Rashmika Mandanna’s Kodava wedding saree look: Coorg bridal tradition | Sakshi
Sakshi News home page

నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్‌..! ఈ చీరకట్టు స్పెషాల్టీ ఇదే..

Feb 27 2026 11:02 AM | Updated on Feb 27 2026 11:09 AM

Rashmika Mandanna’s Kodava wedding saree look: Coorg bridal tradition

నటి రష్మిక మందన్న పెళ్లి గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో, సాయంకాలం కొడగు (కూర్గి) సంప్రదాయ పద్ధతిలో  వైభవంగా జరిగింది. తన సంప్రదాయ మూలాలను మర్చిపోకుండా కొడగు స్టైల్‌ కట్టును వివిధ సందర్భాలలో ధరించడం మనం చూశాం. వివాహం, ఇతర వేడుకలలో కొడగు సంప్రదాయ చీరకట్టుదే ప్రత్యేక ఆకర్షణ.

రష్మిక వివాహ వేడుక సందర్భంగా కొడగు చీరకట్టు ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశ సంప్రదాయ డ్రేపింగ్‌ శైలిలో  విలక్షణంగా కనిపించే కొడగు కట్టును రీ క్రియేషన్‌ చేసి, బాలీవుడ్‌ క్లాసిక్‌ సినిమాలలోనూ కనువిందు చేశారు తారలు. కొడగు స్టైల్‌ డ్రేప్‌ ట్రెండ్‌ గురించి..

కర్నాటకలోని కొడగు జిల్లాలో మగువల చీరకట్టులో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ శారీ డ్రేపింగ్‌. కొండ ప్రాంతంలో పుట్టిన సంప్రదాయ శైలి ఇది. కొడగు లేదా కొడవ లేదా కూర్గి అని పిలిచే కమ్యూనిటీలోని వివాహ సమయంలో అక్కడి వధువు జరీ అంచుతో ఉన్న పట్టు చీరను వారి సంప్రదాయ శైలిలో ధరిస్తుంది. ఇది కేవలం ఒక శైలి కాదు ఒక తరం నుండి మరొక తరానికి అందివస్తున్న వారసత్వం. 

ఈ చీరకట్టు కొడవ మహిళల బలం, అందం, స్వాతంత్య్రాన్ని ప్రతిబింబింపజేస్తుంది. వేడుకలలో సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ, బంగారు రంగులలో .. జరీ అంచుతో ఉండే కాంతిమంతమైన పట్టు చీరలను ఎంచుకుంటారు. ఇవి శుభాన్ని, శ్రేయస్సును తీసుకువస్తాయని వారి నమ్మకం.

నడుము వద్ద చీరను పెట్టికోట్‌ లోపలికి టక్‌ చేస్తారు. 

సాధారణ చీరకట్టుకు భిన్నంగా ముందు వైపు కాకుండా కూర్గి శారీ డ్రేప్‌కు వెనకవైపు కుచ్చిళ్లు పెడతారు.

చీరను రెండుసార్లు శరీరం చుట్టూ తిప్పుతూ, చీర పల్లూ ఛాతీ మీదుగా ఎడమ భుజం కింద నుంచి, కుడి భుజం పై నుంచి ముందుకు తీస్తారు.

కుడి భుజం నుంచి తీసిన పల్లూని బ్లౌజ్‌తో కలిపి పిన్‌తో అటాచ్‌ చేస్తారు. పల్లూ అలంకరణ కొంత వరకు బెంగాలీ స్టైల్‌ను పోలి ఉంటుంది. 

కొడవ సంప్రదాయ ఆభరణాలలో చంద్రవంక, నాగాభరణం.. వంటి పొడవాటి హారాలతోపాటు ఇతర సంప్రదాయ నగలను అలంకరించుకుంటారు.

కొడవ యువతులు షిఫాన్, జార్జెట్, ఆర్గంజా చీరలతో డ్రేపింగ్‌లో వివిధ రకాల ప్రయోగాలు చేస్తారు.

యువతుల కోసం రెడీమేడ్‌ కొడవ కట్టు శారీస్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. 

ప్రత్యేక ఆకర్షణతో ఉండే బెల్టులు, బ్రోచ్‌లు ఈ కట్టుకు ఇప్పుడు ఫ్యూజన్‌ ట్విస్ట్‌ను తీసుకువస్తున్నాయి.  

 

(చదవండి: ఆ పాదాలకు నమస్కారం..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..)

Advertisement
 
Advertisement
Advertisement