‘‘భారతీయ మహిళకు మానసిక చికిత్స అవసరమైన సందర్భాల్లో ఇటు కుటుంబంగానీ అటు సమాజం కానీ మహిళ పట్ల సానుభూతితో సహానుభూతితో వ్యవహరించడం లేదు. ఇంకా చెప్పాలంటే కాస్త కఠినంగానే వ్యవహరిస్తూనే వచ్చాయి. మనది సహజంగా పితృస్వామ్య వ్యవస్థ కావడంతో అనాదిగా మహిళల పట్ల చిన్నచూపు అలా కొనసాగుతూ పోయిందం’’టూ ఆవేదన వ్యక్తం చేశారు ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ ప్రెసిడెంట్ డాక్టర్ సవిత మల్హోత్ర.
‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఫౌండేషన్ డే’ సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డాక్టర్ సవిత మల్హోత్ర ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మానసిక చికిత్సల విషయంలో భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మాట్లాడారు. మహిళలకు మానసిక వైద్యం అవసరమైనప్పుడు... చికిత్స అందాల్సిన వివిధ సందర్భాల్లో ఇప్పటికీ ఆమె ఎదుర్కొంటున్న వివక్ష గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సవిత మల్హోత్ర వెలిబుచ్చిన ఆవేదన ఆమె మాటల్లోనే...
చికిత్సలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు
మహిళలకు మానసికమైన సమస్యలున్నప్పుడు మన సమాజం వారి పట్ల వివక్షతోనే వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పటికీ పల్లెల్లో మహిళలకు మానసిక చికిత్స సక్రమంగా అందడం లేదన్నది నిర్వివాదాంశం. కాకపోతే పాశ్చాత్య సంస్కృతి, అక్కడి స్వేచ్ఛావాతావరణం తాలూకు ప్రభావాలూ మెట్రోపాలిటన్ నగరాలూ, పెద్ద పెద్ద పట్టణాల్లో వారిని స్వేచ్ఛగా వ్యవహరించేలా చేసినప్పటికీ చిన్న చిన్న పల్లెటూళ్లలో మాత్రం వివక్ష అలాగే ఉంది. అయితే ఇక్కడ మరో ప్రమాదం పొంచి ఉంది.
పాశ్చాత్య దేశాల విపరీతమైన, మితిమీరిన స్వేచ్ఛాభావన ల్లాంటి పెడ ధోరణులతో ఆమె విశృంఖలంగా ప్రవర్తిస్తున్న సందర్భాల్లో పురుషుడే కాస్తంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తోంది. అయితే మహిళలు ఈ రెండు ఎక్స్‌ట్రీమ్స్‌లో కాకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మెట్రోపాలిటన్ నగరాలూ, చాలా పెద్ద పెద్ద నగరాల్లో మితిమీరిన నాగరికతా ధోరణులున్న కొన్ని పరిమితప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్లంతా మహిళ తీవ్రమైన వివక్షకు గురవుతూనే ఉంది.
మహిళలు వివక్షకు లోనయ్యే తీరుతెన్నులు
నిజం చెప్పాలంటే ఆ వివక్ష చెప్పనలవి కాదు. ఉదాహరణకు ఓ మహిళకు పెళ్లి తర్వాత తనకేదైనా మానసిక చికిత్స అవసరమైందనుకోండి. వెంటనే అత్తింటివాళ్లు ఆమెను నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి పంపేస్తారు. ఆ మానసిక సమస్య నుంచి విముక్తి కలిగితే తప్ప అత్తింటికి రావద్దంటూ ఆంక్షలు పెడతారు. ఒకవేళ మహిళలు వైద్యం తీసుకునే పరిస్థితి లేకపోతే వాళ్లు అత్తింటి నుంచి శాశ్వతంగా దూరమయ్యే దయనీయమైన పరిస్థితి ఉంటుంది. అదే పురుషుడికి ఏదైనా మానసిక సమస్య వచ్చిందనుకుందాం. అప్పుడు అతడి చికిత్స విషయంలో ఆమె అతడికి చేయూతనందిస్తూ అతడినే అంటిపెట్టుకుని ఉంటుంది. అతడు బాగుపడేందుకు అండదండలందిస్తూనే ఉంటుంది.
ఇక పెళ్లికాని అమ్మాయిల పరిస్థితి ఇంకా దారుణం. మానసిక చికిత్స అవసరమైన మహిళకు అసలు పెళ్లికావడమే పెద్ద సమస్యగా మారుతుంది. ఇక్కడ కూడా పురుషుడికి ఉండే అనుకూతలు వేరు. మగవాడికి ఏదైనా మానసిక సమస్య వస్తే... ‘‘పెళ్లయితే అంతా సర్దుకుంటుంది’’ అంటూ అతడి సమస్య బాధ్యత నుంచి తల్లిదండ్రులు తప్పించుకుని ఓ మహిళ నెత్తిమీదికి నెట్టేస్తారు.
ఒక్కమాటలో చెప్పాలంటే పురుషుడికి మానసిక సమస్య వస్తే మహిళ ఓ సపోర్ట్ సిస్టమ్‌గా అతడికి అండగా ఉంటుంది. కానీ మహిళకే ఆ సమస్య వస్తే అది ఆమెలో ఎమోషనల్ స్ట్రెస్‌ను మరింత పెంచుతుంది.
గతంతో పోలిస్తే కొంత పురోగతి!
నగరాలూ పట్టణప్రాంతాల్లో కొంతమేరకు నయమేగానీ చిన్నచిన్న ఊళ్లల్లోనూ, పల్లెల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఉదాహరణకు పల్లెప్రాంతాల్లో అమ్మవారు పూనడం, దెయ్యం పట్టడం లాంటి ‘΄÷సెషన్ స్టేట్’ మానసిక సమస్యలు మహిళల్లోనే కనిపిస్తుండటం గమనించవచ్చు. దెయ్యాన్ని వదిలించడంలో భాగంగా... చికిత్స పేరిట వాళ్లను బెత్తంతో కొట్టడం, దారుణంగా బాధించడం చేస్తుంటారు. గతంతో పోలిస్తే కాస్త నయమే అయినప్పటికీ పల్లెల్లో ఇంకా ఈ ధోరణులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడొచ్చిన మార్పు సరిపోదు. ఇలాంటి మానసికమైన సమస్యలు ఎవరిలో వచ్చినా... ఇంకా ప్రధానంగా మహిళల్లో కనిపించినప్పుడు ఆధునిక వైద్యచికిత్స అందించడం అన్నది ఇప్పుడు చాలా ముఖ్యం.
మానసికమైన అంశాల మీద ఆహారం ప్రభావం
గతంలో మానసిక సమస్యలతో బాధపడే బాధితుల ఆహారం గురించి పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ అనేక ఆధునిక పరిశోధనల తర్వాత ‘న్యూట్రిషనల్ సైకియాట్రీ’ విభాగం కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారుతోంది.
మహిళలకుమరింత మెరుగైనచికిత్స అందడానికి కుటుంబం, సమాజం అందించాల్సిన సపోర్ట్
కెరియర్ విషయంలోగానీ, మేధస్సుపరంగాగానీ మహిళా, పురుషుడూ సమానం. కానీ బయాలజీ, ఫిజియాలజీ పరంగా మహిళ మానసిక స్థితిగతులూ, పురుషుడి మానసిక పరిస్థితులూ వేర్వేరుగా ఉంటాయి. దీన్ని అంగీకరించి తీరాలి. మానసిక ప్రవర్తనల ధోరణుల విషయంలోనూ పురుషుడూ, మహిళలూ భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు సాధారణంగా ఒక పురుషుడు ఒక అంశంపై ఫోకస్‌గా వ్యవహరిస్తూ ఉంటే మహిళ మాత్రం తన మల్టీటాస్కింగ్ నైపుణ్యాలతో ఏకకాలంలో అనేక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది.
ఒక విషయాన్ని పురుషుడు తన మెదడు పరిష్కార ధోరణితో ఆలోచిస్తున్న తరుణంలో... అదే సమస్య విషయంలో మహిళ తన మనసుతో ఆలోచిస్తుంది. తన పార్ట్‌నర్ తాలూకు ఎమోషనల్ సపోర్ట్‌తో ఉద్వేగభరితమైన చేయూతతో దాన్ని పరిష్కరించాలనే ధోరణిని పురుషుడి నుంచి ఆశిస్తుంటుంది. ఆ భావోద్వేగాల సపోర్ట్ పురుషుడి నుంచి రావాలని ఎదురుచూస్తుంటుంది. కెరియర్‌కు సంబంధించిన రంగంలో లేదా ప్రొఫెషనల్ స్కిల్స్ ప్రదర్శించాల్సిన చోట మహిళకు తన తోటి ప్రొఫెషనల్స్ నుంచే తాను కోరుకునే సమాన భావన అందదు. మరో మూడువారాల్లో దేశరాజధానిలో సైకియాట్రిస్టుల సదస్సు జరగనుంది. ఈ విషయమే అక్కడ ప్రస్తావనకు తేవాలనుకుంటున్నాను.
ఒక తల్లికి నలుగురు బిడ్డలుంటే... తాను పెద్దగా చదువుకోకపోయినా... ఆ నలుగురు చిన్నారుల స్వభావాలూ, మనస్తత్వాలూ, ప్రవర్తనల తీరుతెన్నులు ఆమెకు స్పష్టంగా తెలుస్తాయి. అలా ఆమెలో అవ్యక్తంగానే లోపల ఓ మనస్తత్వవేత్త ఇన్‌బిల్ట్‌గా ఉంటారు. దాంతో మానసిక రంగాల విషయంలో రానున్న రోజుల్లో ఆమె మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తుందని నా భావన. ఈలోపు వ్యక్తిగతంగా ఆమెకు ఇవ్వాల్సిన స్పేస్‌ను ఇస్తూ, ఆమెను ఓ మనిషిగా చూస్తూ, మహిళను తన తోటి వ్యక్తిగా గౌరవించాల్సిన బాధ్యత పురుషులపై ఉందనేది నా స్పష్టమైన అభిప్రాయం. కుటుంబ సభ్యులకే కాదు... ఆమెనో సాటిమనిషిగా చూడాల్సిన బాధ్యత ఈ సమాజానికీ ఉంది’’ అంటూ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు డాక్టర్ సవిత మల్హోత్రా.
పిండదశలో ఉన్నప్పట్నుంచే మానసిక సమస్యలు!
ఓ చిన్నారి పిండదశలో ఉన్నప్పట్నుంచే మానసిక సమస్యలను ఎదుర్కొంటూ వస్తోంది. ఉదాహరణకు... ఓ మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఒత్తిడి (స్ట్రెస్)గానీ, ఉద్విగ్న పరిస్థితుల్ని (యాంగై్జటీ)గానీ, ఆందోళన, వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్) వంటివి చోటుచేసుకున్నప్పుడు ఆమె మెదడులోని జీవరసాయనాల్లో మార్పులు రావడం సహజం. ఆ జీవరసాయనాలూ, హార్మోన్ల వంటివే ఆమెలోని మూడ్స్ మార్పులకు కారణమవుతాయి. కాబోయే తల్లిలో... ఆ హార్మోన్లు, జీవరసాయనాల సమతుల్యతల్లో మార్పులు వచ్చాయంటే అవి కడుపులోని బిడ్డపైనా, తన మానసిక స్థితిపైనా ప్రభావాలు చూపే అవకాశముంది.
అందుకే గతంలోని మామూలు చైల్డ్ సైకియాట్రీ కంటే ఇప్పుడు మరింత లోతుగా... సైన్స్ గణనీయంగా పురోగమించడంతో... కడుపులోని పిండానికి మానసికంగా కలిగే ప్రభావాలను అధ్యయనం చేసే ఫీటల్ సైకియాట్రీ, అప్పుడే పుట్టిన బిడ్డ విషయంలో ఇన్‌ఫ్యాంట్ సైకియాట్రీ, చైల్డ్ సైకియాట్రీ, అడాలసెంట్ సైకియాట్రీ, వృద్ధాప్యంలోని మానసిక సమస్యల గురించి తెలిసే జీరియాట్రిక్ సైకియాట్రీ అంటూ మానసిక శాస్త్రం ఇప్పుడు చాలా చాలా విస్తృతంగా, ఎంతో లోతుగా అధ్యయనం చేయాల్సిన సైన్స్‌గా పరిణమిస్తూ... విస్తరిస్తోంది.


