టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళిపై కేసు నమోదైంది. మహేష్ బాబుతో కలిసి భారీ బడ్జెట్‌తో ఆయన ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా గ్లోబ్‌ట్రాటర్ పేరుతో ఒక ఈవెంట్‌ను జరిపిన విషయం తెలిసిందే.. ఈ వేదికపై హనుమంతుడి గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు దుమారమయ్యాయి. దీంతో సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. రాజమౌళి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.
ఏం జరిగింది..?
మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కోసం పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వారణాసి కోసం మహేష్ చాలా కష్టపడ్డారని చెప్పారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారని ఆయన అన్నారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్ ఉన్నాడని విజయేంద్రప్రసాద్ చెప్పారు.
అయితే, వారణాసి గ్లింప్స్ విడియో రిలీజ్‌కు పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదుదు కావడంతో రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై ఇలా అన్నారు. 'నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనుకాల ఉండి నడిపించారని మా నాన్న చెప్పారు. ఆ మాటలకు నాకు వెంటనే కోపం వచ్చింది. ఆయన (హనుమంతుడు) ఉంటే ఇదేనా నడిపించేది..?' అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలను దెబ్బతినేలా ఉన్నాయని నెటిజన్లు ఫైర్ అయ్యారు.


