టైటిల్: మదం
నటీనటులు: హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి తదితరులు
నిర్మాతలు: సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన్నబాబు), రమేష్ బాబు కోయ
దర్శకత్వం: వంశీ కృష్ణ మళ్ల
సంగీతం: డేవ్ జాండ్
ఎడిటింగ్: నందమూరి తారక రామారావు
సినిమాటోగ్రఫీ: రవి. వి
విడుదల తేది: జనవరి 2, 2026
బిగ్‌బాస్ షో కంటే ముందు ఇనయా సుల్తానా పేరు ఎవరికీ తెలియదు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని..తనదైన ఆటతీరుతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ అయిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మదం. రాఅండ్ రస్టిక్ సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(జనవరి 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1980ల నేపథ్యంలో సాగుతుంది. ఓ అవినీతి పోలీసు అధికారి, అతని భార్య స్వార్థం వల్ల సర్వస్వం కోల్పోయిన ఒక నిరుపేద కుటుంబం యొక్క విషాద గాథ ఇది. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై హీరో(హర్ష గంగవరపు) ఎలాంటి పోరాటం చేశాడు?, తన అందచందాలతో మగవాళ్లను పావుగా వాడుకునే బోల్డ్ లేడీ(ఇనయ సుల్తానా)కి,ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు హీరో ఫ్యామిలీకి న్యాయం జరిగిందా లేదా అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
'మదం' అనే టైటిల్ వినగానే ఇది కేవలం అడల్ట్ మూవీ అని అనుకుంటే పొరపాటే. ఇది ఒక మహిళా మనస్తత్వాన్ని, సమాజంలోని అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టే సామాజిక చిత్రం. దర్శకుడు ఎక్కడా అసభ్యతకు తావులేకుండా, కథకు అవసరమైన మేరకే బోల్డ్ సీన్లను ఉపయోగించుకున్నారు. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అంతా హీరో ఫ్యామిలీ నేపథ్యం, పోలీసు అధికారి వల్ల వారి కుటుంబానికి వచ్చే కష్టాలను చూపించారు. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఇనయ సుల్తానా పాత్ర ఎంట్రీతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆమెను బోల్డ్‌గా చూపిస్తూనే.. ఫ్లాష్‌బ్యాక్ ఏదో ఉంటుందన్న క్యూరియాసిటీని పెంచేశాడు. ఫస్టాఫ్‌లో సిల్లీగా అనిపించే కొన్ని సీన్లకు.. సెకండాఫ్‌లో ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కొన్ని బోల్డ్ సీన్లు..ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేస్తాయి. చివరిలో ఇచ్చిన సందేశం బాగుంటుంది. కథను మరింత బలంగా రాసుకొని.. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం ఇనయ సుల్తానా. గటివ్ షేడ్స్ ఉన్న, బోల్డ్ అండ్ అగ్రెసివ్ పాత్రలో ఆమె జీవించేసింది. తెలుగు తెరపై హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కోసమే అన్నట్లు కాకుండా, ఒక ఇంటెన్స్ పవర్‌ఫుల్ పాత్రలో ఆమె కనిపించడం విశేషం. హీరోహర్ష గంగవరపు తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఎమోషనల్ సీన్లలో బాగా చేశాడు. అనురూప్, లతా రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఈగల్ ఫేమ్ డేవ్‌జాండ్ సంగీతం ఈ సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు యావరేజ్గానే ఉన్నా..బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగదీశాడు. రవి వి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


