ప్రియాంకా చోప్రాకు మరోసారి ఆస్కార్ నుంచి ఆహ్వానం అందింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ నెల మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16) జరగనున్న 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఓ ప్రెజంటర్‌గా పాల్గొననున్నారు ప్రియాంకా చోప్రా. ఆమెతో పాటు హాలీవుడ్ యాక్టర్స్ అన్నే జాక్వెలిన్ హతావే, గ్వినేత్ పాల్ట్రో, రాబర్ట్ డౌనీ జూనియర్, ఆర్నేట్, పాల్ మెస్కల్ ప్రజెంటర్స్‌గా పాల్గొననున్నట్లు ఆస్కార్ అకాడమీ కమిటీ ప్రకటించింది.
ఇక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రియాంకా చోప్రా ప్రజెంటర్‌గా పాల్గొనడం ఇది తొలిసారి కాదు. 2016లో జరిగిన 88వ ఆస్కార్ అవార్డుల వేడుకకు ప్రియాంక తొలిసారి ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు పదేళ్లకు ఈ వేదికపై ఆమె మరోసారి విజేతలకు ఆవార్డులను ప్రదానం చేయనున్నారు.
వారణాసి సినిమా ఓ గొప్ప అనుభవం: ప్రియాంకా చోప్రా
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చో ప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ జార్జియాలో ప్రారంభమైంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను అంటార్కిటికాలో ప్లాన్ చేశారని సమాచారం. కాగా, గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలోని ఫారెస్ట్ లొకేషన్స్‌లో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఆ షూటింగ్ అనుభవాలను ప్రియాంకా షేర్ చేసుకున్నారు. ‘‘కెన్యాలోని అడవుల్లో షూటింగ్ చేయడం గొప్ప అనుభూతి. వేల సంఖ్యలో అడవి జీవులు వలస వెళ్తున్న సమయంలో వాటి మధ్య మేం ఉన్నప్పుడు షూటింగ్ జరిగింది. ఆ జంతువుల ముఖాలను అంత దగ్గరగా చూస్తుంటే ఈ భూమ్మీద అవి ఎన్నో ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నాయని అర్థమైంది. ప్రకృతి ఎంత శక్తిమంతమైనదో, జీవపరిణామ క్రమం ఎంత గొప్పదో వాటిని చూస్తే తెలిసింది’’ అని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చె΄్పారు ప్రియాంకా చోప్రా.


