చిన్న వయసు నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు రాఘవ్ రాయ్. ‘మోర్ దెన్ ప్లే’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమం కోసం ఒకరోజు పేద పిల్లలకు ఫుట్‌బాల్ ఆట నేర్పించడానికి ఢిల్లీలోని నిజాముద్దీన్ బస్తీకి వెళ్లాడు. ప్రాక్టీస్ కోసం వచ్చిన పిల్లలు బలహీనంగా ఉన్నారు. బాగా అలిసిపోయినట్లు ఉన్నారు. వారు తినేది...చౌకైన జంక్‌ఫుడ్.
పిల్లలతో మాట్లాడినప్పుడు రాయ్‌కు అర్థమైనది ఏమిటంటే, వారికి పోషకాహారం గురించి బొత్తిగా అవగాహన లేదు అని. తన అనుభవాన్ని స్వచ్ఛంద సంస్థ ‘మోర్ దేన్ ప్లే’ వ్యవస్థాపకుడు జైదీప్ భాటియాతో పంచుకున్నాడు. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకొని ఎన్నోసార్లు సమావేశం అయ్యారు. ‘ఏంచేస్తే బాగుంటుంది?’ అనే కోణంలో పరిశోధించారు.
పోషకాహార లోపోనికి ఒక పరిష్కారంగా కిచెన్ గార్డెన్ ఐడియా వచ్చింది. ప్రతి బిడ్డకు పోషకాలతో కూడిన భోజనం ఉండేలా బస్తీలలో కిచెన్ గార్డెన్‌లను ఏర్పాటు చేయడమే ఆ ఐడియా. ‘గార్డెన్స్ ఆఫ్ హోప్’ అలా ఆవిర్భవించింది. ‘ఇంటింటా కిచెన్ గార్డెన్’ లక్ష్యంతో పనిచేస్తోంది గార్డెన్స్ ఆఫ్ హోప్. ‘మీరు సొంతంగా కూరగాయలు పండించుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది’ అని ప్రచారం ప్రారంభించారు. అయితే ఈ ప్రచారాన్ని మహిళలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అర్బన్ ఫార్మింగ్ కన్సల్టెన్ట్, కిచెన్ గార్డెన్స్ ఎక్స్‌పర్ట్ జూలీ సహాయం తీసుకున్నారు. జూలీ, రాయ్ గల్లీ గల్లీకి తిరిగారు.
జూలీ మాటలతో ఎంతోమంది తల్లులలో మార్పు వచ్చింది. ‘ఏమిటి? ఎందుకు? ఎలా?’ ఇలా పలు కోణాలలో కిచెన్ గార్డెన్స్ గురించి ప్రశ్నలు అడిగి ప్రయత్నం మొదలుపెట్టారు. ఇప్పుడు గల్లీలలో ఎన్నో ఇళ్లలో కిచెన్ గార్డెన్‌లు కనిపిస్తున్నాయి.
మార్పు..
పోషకాహార లోపంతో ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు. ఆ పేదింటి తల్లుల దుఃఖాన్ని దగ్గరి నుంచి గమనించిన ఫుట్‌బాల్ కోచ్ రాఘవ్ రాయ్ ‘కిచెన్ గార్డెన్’ ఐడియాతో ముందుకు వచ్చాడు. దిల్లీలో గల్లీ గల్లీ తిరిగాడు. మహిళలు ఎవరూ అతడి మాటలనుమొదట సీరియస్‌గా తీసుకోలేదు.
అర్బన్ ఫార్మింగ్ కన్సల్టెన్ట్, కిచెన్ గార్డెన్స్ ఎక్స్‌పర్ట్ జూలీ మాటలతో వారిలో మార్పు వచ్చింది. ఢిల్లీలో ఎన్నో బస్తీలలోని మహిళలు తమకు ఉన్న పరిమిత స్థలంలోనే కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. రసాయన కూరగాయలకు దూరంగా ఆరోగ్యకరమైన, పౌష్టికాహారాన్ని సొంతం చేసుకుంటున్నారు...
(చదవండి: బాలీవుడ్ టు కార్పొరెట్ వరల్డ్)


