సాక్షి, ఢిల్లీ: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులు, విద్యార్థి సంఘాల నేతలు ఉమర్ ఖాలీద్, శార్జీల్ ఇమామ్‌కు బెయిల్ తిరస్కరించింది. అలాగే.. మరికొందరికి మాత్రం బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆదేశాలు తీర్పు ఇచ్చారు.
ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కుట్ర పన్నారని ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్‌లపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ట్రయల్ ఆలస్యం బెయిల్ ఇచ్చేందుకు ఆధారం కాదని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. జాతీయ భద్రత అంశంలో స్వేచ్ఛకు భిన్నమైన అర్థం ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో నిందితుల బెయిల్ పిటిషన్లను వేర్వేరుగా విచారించాలని నిర్ణయించింది.
ఢిల్లీ అల్లర్ల కేసులో గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మహమ్మద్ షకీల్‌ఖాన్, షాబాద్ అహ్మద్‌లకు మాత్రమే ఊరట లభించింది. మిగిలిన నిందితులతో పోలిస్తే ఖాలీద్, ఇమామ్‌ల విషయంలో భిన్నమైన పరిస్థితి నెలకొందని.. అల్లర్లలో వీళ్లిద్దరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా ఆధారాలున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి వీళ్లిద్దరూ ఏడాది తర్వాతే బెయిల్ కోసం ఆశ్రయించాలని సూచించింది.
అల్లర్ల నేపథ్యం..
కేంద్ర ప్రభుత్వం 2019లో సిటిజన్ అమెండ్‌మెంట్ యాక్ట్(CAA)ను 2019లో ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఢిల్లీలో జాఫ్రాబాద్, షాహీన్ బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు చేపట్టారు. వీటిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన మౌజ్‌పూర్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘‘నిరసనకారుల్ని అణచివేయాలి. లేకుంటే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటాం’’ అని పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి మూడు రోజులపాటు ఉత్తర ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి.
2020 ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా మైనారిటీలే ఉన్నారు. సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. అనేక ఇళ్లు, వ్యాపార సంస్థలు, మసీదులు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దీంతో కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ అల్లర్ల వెనుక మేధావుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని.. రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్ర చేశారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. విద్యార్థి సంఘాల నేతలు అయిన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లను UAPA (Unlawful Activities Prevention Act) కింద అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
దీర్ఘకాలిక కస్టడీ.. విచారణ ఆలస్యం, ట్రయల్ ప్రారంభం కాని పరిస్థితులను ప్రధానంగా ప్రస్తావిస్తూ బెయిల్ కోరగా.. అల్లర్లకు ప్రణాళికాబద్ధంగా సహకరించారని, ఇది దేశ భద్రతకు ముప్పు అని పోలీసులు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.


