చిలుకా పదపద నెమలి పదపద..మైనా పదపద మనసా పద.. గాలి పటమా పద పదా.. హంసలాగా పదపద.. అమాసనే పరిపదకిటా.. హద్దు కాదు పద పద..పైకి పోయే పటమే.. ఇది పందెం గెలిచే పటమే.. అంటూ సాగే ఈ పాటను వింటుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో.. పతంగుల సీజన్ వచ్చిందంటే.. పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఇప్పటికే పతంగుల సందడి మొదలైంది.
దీంతో మార్కెట్‌లో అనేక మోడళ్లు, రకాల పతంగులు ముంచెత్తుతున్నాయి. భాగ్యనగరంలోని ప్రతి గల్లీలోనూ రంగురంగుల గాలిపటాలు ఎగరుతున్నాయి. అయితే గతంలో చైనా మాంజా మిగిల్చిన చేదు అనుభవాల నేపథ్యంలో ఈ సారైనా వాటి వినియోగానికి చెక్ పెట్టాలని అధికారులు, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. చైనా మాంజాతో ప్రమాదం పొంచి ఉందని గ్రహించాలని, మన ఆనందం మరొకరిని బాధించకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో కొత్త ఏడాది అడుగుపెట్టగానే ఆకాశం రంగుల పతంగులతో నిండిపోతుంది. జనవరి ప్రారంభం నుంచి సంక్రాంతి పండుగ ముగిసే వరకూ, కొన్ని ప్రాంతాల్లో జనవరి చివరి వరకూ కూడా పతంగుల సందడి కొనసాగుతూనే ఉంటుంది. బాల్కనీల్లో, టెర్రస్‌పై నిలబడి, ఖాళీ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా చేరి.. ‘కాయ్ పో చె!’ అంటూ ఉత్సాహంగా అరవడం నగర జీవనశైలిలో ఒక ప్రత్యేకమైన పండుగ సంస్కృతిగా మారిపోయింది.
అయితే దీనిని కొందరు స్వార్థపరులు సొమ్ముచేసుకునే ప్రయత్నంలో పండుగ లాంటి ఈ వాతావరణాన్ని విషాధంగా మిగులుస్తున్నారు. పతంగులకు వాడే చైనా మాంజా, సింథటిక్ మాంజా హైదరాబాద్‌లో యేటా వందల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పండుగ ఆనందం, మరుసటి క్షణంలో విషాదంగా మారుతున్న దృశ్యాలు అనేక మందిని బాధిస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి పతంగులు ఎంచుకోవాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పండుగ ఆరోగ్య రహస్యాలు, పతంగుల పోటీలు వంటి విశేషాలు తెలుసుకుందాం..
కాలక్రమేణా మార్పు..
వాస్తవానికి మనం ప్రస్తుతం వినియోగిస్తున్న గాలిపటాలు స్థానంలో మొదట వస్త్రంతో తయారుచేసిన గాలిపటాలు తయారయ్యేవి. అయితే నెమ్మదిగా పేపరు గాలిపటాలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. అయితే వీటి వల్ల ప్రకృతికి అంత ప్రమాదం ఏమీ లేదు.. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో లభించే ప్లాస్టిక్ గాలిపటాలతో పర్యావరణానికి హాని పొంచివుందని నిపుణులు చెబుతున్నారు.
అసలు గాలిపటాల సంస్కృతి మొదటి చైనాలో పుట్టింది. కాలక్రమంలో నెమ్మదిగా ఇతర దేశాలకూ పాకింది. దేశంలో నిజాం నవాబుల ప్రోత్సాహంతో ఈ సంస్కృతి తెలుగు రాష్ట్రాలకూ విస్తరించింది. ఇప్పుడు ఒక ప్రాంతం, ప్రదేశం అంటూ లేదు.. దేశవ్యాప్తంగా గాలిపటాల సందడి కనిపిస్తుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనడం చూస్తుంటాం.
ఆరోగ్య రహస్యం..
యేటా శీతాకాలంలో.. అంటే సంక్రాంతి సమయంలో ఈ గాలిపటాల సందడి కనిపిస్తుంటుంది. అయితే దీనికీ కొన్ని శాస్త్రీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ సమయంలో గాలి ఒకే దిశగా వీచడం వల్ల గాలిపటాలు ఎగరేయడానికి అనువుగా వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో పాటు చలికాలంలో ఇన్ఫెక్షన్లు, అనేక ఆరోగ్య సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయంపూట సూర్య రశ్మిని ఆస్వాదిస్తూ పతంగులు ఎగరేయడం వల్ల విటమిన్ ‘డి’ శరీరానికి లభించడమే కాకుండా ఎండ వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
మన సామాజిక బాధ్యత..
గాలిపటాలు ఎగరేయడమంటే ఎవరికైనా ఆసక్తే. అందుకే ‘పతంగుల పండగలు’ పేరుతో ప్రత్యేక పోటీలు పెట్టుకొని మరీ గాలిపటాలు ఎగరేయడాన్ని ఆస్వాదిస్తారు. అయితే మాంజా ప్రమాదాల నేపథ్యంలో పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పెద్దలదే. రంగు రంగుల పతంగులు, ప్లాస్టిక్ మోడళ్లకు ఆకర్షితులవుతున్న చిన్నారులకు సామాజిక బాధ్యతను నేర్పించాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది..
ముఖ్యంగా గాలిపటం అంటే పత్తి దారం, ఇప్పటి సింథటిక్ మాంజా మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించాలి. దీని వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పాలి. గాలిపటాల పోటీలను ఆస్వాదించే వారు.. వాటి వినియోగంలో ఉపయోగించే మెటీరియల్‌లోని తేడాలను, దాని వల్ల కలిగే అనర్థాలను భవిష్యత్తు తరానికి తెలియజెప్పడంలోనూ పోటీపడాలి.
అలనాటి స్మృతులు..
ఇప్పటి వారికంటే మార్కెట్‌లో రెడీమేడ్ గాలిపటాలు దొరుకుతున్నాయిగానీ..ఓ ఇరవైయేళ్ల క్రితం గాలిపటాలు కావాలంటే.. వార్తాపత్రికలను చింపి కొబ్బరి ఈనెలు, మైదాపిండి జిగురును ఉపయోగించి పతంగులు తయారుచేసుకునే వాళ్లు. అయితే వీటిలోనూ అనేక మోడళ్లు.. విభిన్న రకాల పేర్లు ఉన్నాయి. గుడ్లందార్, గుడ్డి లంగోటి, అద్దా వంటివి మన దగ్గర సాధారణంగా వినిపించే పేర్లు.. ‘గుడ్లందార్’ అంటే రెండు కళ్లున్న గాలిపటం.
ఒంటికన్ను ఉన్న దాన్ని ‘గుడ్డి లంగోటి’ అంటారు. ‘అద్దా’ అంటే చాలా పెద్ద పతంగి అని అర్థం. వీటితోపాటు విభిన్న రకాల్లో, వర్ణాల్లో గాలిపటాలు మార్కెట్లో సందడి చేస్తాయి. మోడ్రన్ గాలిపటాలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టెక్నాలజీ నేపథ్యంలో ఎల్‌ఈడీ లైట్లతో వెలిగే పతంగులు.. చీకట్లో మిలమిలా మెరిసే పతంగులూ కనిపిస్తున్నాయి.
(చదవండి:


