యశవంతపుర: కర్ణాటకలోని ప్రఖ్యాత ఉడుపి శ్రీకృష్ణ ఆలయానికి ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువగల బంగారం పేపర్లతో రూపొందించిన భగవద్గీత గ్రంథాన్ని కానుకగా ఇవ్వనున్నారు. 18 అధ్యాయాల్లో 700 స్లోకాలను పొందుపరిచిన స్వర్ణ భగవద్గీతను (Golden Bhagavad Gita) విశ్వగీతా పర్యాయ ముగింపు రోజున మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామికి అందజేయనున్నారు. శ్రీకృష్ణ మఠం చరిత్రలో ఇది అపరూపమైన కానుకగా చెప్పుకోవచ్చు. ఈ నెల 8న బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి మఠానికి బహూకరిస్తారు.
వైభవంగా అధ్యయనోత్సవాలు
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో శ్రీస్వామిని ఆరవ రోజు శ్రీలక్ష్మీనరసింహ స్వామిగా అలంకరించి తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ‘ఇరామానుజ నుత్తందాది ఉపదేశ రత్తినమాలై’అనుసంధానం చేసి, అధ్యయనోత్సవాలకు పరిసమాప్తి పలికారు.

కాగా.. ఆరు రోజుల పాటు రద్దు చేసిన నిత్య, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవం, శ్రీసుదర్శన నారసింహ హోమం పూజలు సోమవారం పునః ప్రారంభం అయ్యాయి.
– యాదగిరిగుట్ట
ధర్మ దర్శనానికి 3 గంటలు
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధికంగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాడవీధులు వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు.
శ్రీస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామిని 35 వేల మందికిపైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీవారికి నిత్యాదాయం రూ.40,81,041 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
చదవండి: ఆథ్యాత్మిక కథ.. తిరగలి చూడాలి!


