ఆధ్యాత్మికథ
ఓ ఉదయం పాండిచ్చేరి పట్టణం నుంచి కారులో ఒక జంట తిరుమల కొండకు దర్శనానికి బయలుదేరింది. వారిది పాండిచ్చేరి స్వంత పట్టణమైనా, ప్రస్తుతం వారు అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. దారి మధ్యలో తిరువళ్ళూరు వద్ద కారు పంక్చర్ అయ్యింది. కారును రోడ్డు పక్కన ఆపి టైరు మార్చుకోవడానికి అవస్థలు పడుతూ ఉన్నారు.
అదే దారిలో తిరువళ్ళూరు నుంచి తిరుమలకు మరో జంట వెళ్తూ ఉన్నారు. ఆ తిరువళ్ళూరు జంట, పాండిచ్చేరి జంటను చూసి కారు ఆపింది. సమస్య తెలుసుకుని టైరు మార్చడంలో సహాయం చేయసాగారు. మాటల్లో రెండు జంటలూ దేవుని దర్శనానికి తిరుమలకు వెళ్తున్నట్లు తెలుసుకుని సంతోషపడ్డారు.
పాండిచ్చేరి జంట కొంచెం ఒత్తిడితో ఉన్నట్లు గుర్తించింది తిరువళ్ళూరు జంట. దర్శనానికి ఇంకా చాలా సమయం ఉంది కదా, ఎందుకు ఆదుర్దా పడుతున్నారని అడిగింది.‘‘మేము దారిలో ఉన్న నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. అక్కడ శ్రీ పద్మావతీ శ్రీనివాసుల దర్శనం చేసుకుని తిరగలి చూసి ఆపైన కొండకు రావాలి’’ అని సమాధానమిచ్చింది పాండిచ్చేరి జంట.
‘‘అవునా... నారాయణవనం అనేది స్వామివారికి కళ్యాణం జరిగిన ప్రదేశమని తెలుసు. కానీ తిరగలి గురించి తెలియదు. అక్కడి తిరగలి అంత విశేషమైనదా?’’ అని ఎదురు ప్రశ్న వేశారు.
‘‘ఎంతో విశేషమున్న తిరగలి అది. తప్పకుండా చూసి తీరాలి. గుడిలోని పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన ఉంటుంది. స్వామివారి పరిణయోత్సవ వేడుకల్లో నలుగుపిండి, వడియాల పిండి, పసుపును విసరిన తిరగలి అది. వేల సంవత్సరాలైనా అది చెక్కు చెదరలేదు. మనవారు దాన్ని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు’’ అని వివరించారు.
‘‘అయ్యో... మేము ఇంత దగ్గర ఉండి కూడా ఇన్నాళ్ళూ చూడలేకపోయామే. మీరు అమెరికానుంచి వచ్చి దాన్ని చూస్తున్నారు’’ అని ఆశ్చర్యపోయారు.
ఇంతలో టైరును మార్చే పని పూర్తయ్యింది.
అందరూ కలిసి నారాయణవనం వెళ్ళారు. ఏడుకొండలస్వామి ఎరుకలసాని వేషంలో ఆ పుర వీధుల్లోనే తిరిగినాడని తెలుసుకుని పులకరించిపోయారు. ఆకాశరాజు పుత్రిక పద్మావతిగా అవతరించిన శ్రీ మహాలక్ష్మిని శ్రీనివాసుడు వివాహమాడిన పుణ్యక్షేత్రాన్ని కనులారా చూశారు. అమ్మవారు విహారం చేసే విమాన ప్రదక్షిణ మార్గంలో పసుపు కుంకుమలు పెట్టి ఉన్న తిరగలి కనిపించింది.
అంత పెద్ద తిరగలిని తామెప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోతూ ముక్కుమీద వేలు వేసుకున్నారు. తిరగలిని భక్తిభావంతో తాకిన ఆ నలుగురూ పరవశించిపోయారు. తిరగలిని చూస్తూ ఎంతో బలవంతులైతే కానీ దాన్ని తిప్పలేరని అనుకున్నారు. అప్పట్లో మనుషులు అంత బలంగా ఉండేవారు కాబట్టి అది సాధ్యమయిందని తిరగలికి దణ్ణం పెట్టుకుని తిరుమల ప్రయాణం కొనసాగించారు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు


