World Childrens Day 2025 సర్ విలియం బ్లాక్‌స్టోన్ ప్రకారం తల్లితండ్రులకు పిల్లల పట్ల మూడు ప్రధాన బాధ్య తలు ఉంటాయి. పిల్లల పెంపకం, రక్షించడం, వారికి విద్యను అందించడం. ఐక్యరాజ్య సమితి ‘మానవ హక్కుల ప్రకటన’లో 25(2)వ నిబంధన రక్షణ, సహాయం పొందడం అనేది పిల్లల హక్కుగా పేర్కొంది. పిల్లలకు సాధారణంగా మనం పొందే హక్కులతో పాటు ప్రత్యేకంగా బాలల హక్కులుంటాయి. బాలలకు ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగ స్వామ్య హక్కులుంటాయి. వీటిలో భాగంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు, తల్లితండ్రుల సంరక్షణలో ఉండే హక్కు, పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకొనే హక్కు, లైంగిక వేధింపుల నుండి విముక్తి పొందే హక్కు;
వినోదం–విశ్రాంతి పొందే హక్కు, ఉచిత విద్యతో పాటు ఆడుకొనే హక్కు, భావవ్యక్తీకరణతో పాటు గౌరవాన్ని పొందే హక్కులుంటాయి. వీటితో పాటు స్వేచ్ఛగా ఆలోచించే హక్కు కూడా పిల్లలకుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల అంతర్గత ఘర్షణ వల్ల పలువురు బాలలు పసిప్రాయంలోనే ప్రాణాలు కోల్పోతుండగా, ఆఫ్రికా ఖండంలో సోమాలియా, నైజీరియా వంటి దేశాలలో పిల్లలకు పౌష్టికాహారం లభించక ఆకలి మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశంలో ఎక్కువగా బాల్య వివాహ బాధితులున్నారు. దేశంలో ఏటేటా బాల కార్మికులు, వీధిబాలలు, వివక్షకు గురి అయినవారు, ఎయిడ్స్ తదితర బాధిత బాలలు పెరుగుతున్నారు. పాకిస్తాన్ వంటి దేశాల్లో మత సంబంధమైన కారణాలతో ఆడపిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నారు.
చదవండి : H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరు
పిల్లలను పనిచేసే వారిగా, డబ్బు సంపాదించే వనరుగా చూడరాదు. ఈ ఏడాది ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం థీమ్ ‘నా రోజు, నా హక్కులు’. ఈ థీమ్ పిల్లల జీవితం, వారి హక్కులు ఎలా ఉన్నాయి, ఎలా మెరుగుపరచవచ్చనే దానిపై పిల్లల నుండి నేరుగా వినడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది పిల్లలకు వారి అభిప్రాయాలను తెలియజేయడానికీ, వారి భవి ష్యత్తుపై తమ అభిప్రాయాలను పంచుకోవడానికీ అవకాశాన్నిస్తుంది.
– ఎం. రాంప్రదీప్ జన విజ్ఞాన వేదిక
(నేడు ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం)


