సోవియట్ సోషలిస్ట్ నమూనా పతనం తర్వాత, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్య మంలో ఏర్పడిన శూన్యాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ ఒక గొప్ప చర్చకు వేదికగా మార్చు కుంది. సోవియట్ మోడల్‌ను గుడ్డిగా అనుసరించడం కంటే, మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలను చైనా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవాలని ఆ దేశ నాయకత్వం నిర్ణయించింది. దీని ఫలితంగా పుట్టిందే ‘చైనా లక్షణాలతో కూడిన సోషలిజం’. 1947లో స్వాతంత్య్రం పొందిన భారత దేశం కంటే రెండు ఏళ్ళు ఆలస్యంగా, 1949 అక్టోబర్1న ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ ఏర్పడినప్పటికీ, నేడుఆ దేశం సాధించిన ప్రగతి అసాధారణం. కొనుగోలుశక్తి సామర్థ్యం పరంగా చైనా ఇప్పటికే అమెరికాను అధిగమించి, అనేక రంగాలలో అగ్రగామిగా నిలిచింది.
భారతదేశం నేడు దారిద్య్రం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రూపాయి పతనం వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్) భారత ఆర్థిక గణాంకాల పారదర్శకతను ప్రశ్నిస్తూ ‘సీ గ్రేడ్’ ఇచ్చింది. ఒకవైపు డాలర్‌తో రూపాయి విలువ 90 రూపాయలకు పడి పోతుంటే, మరోవైపు ‘మేడ్ ఇన్ చైనా –2025’ ప్రణా ళికతో చైనా పారిశ్రామిక మౌలిక సదుపాయాలనుసంపూర్ణ ఆటోమేషన్ దిశగా మలుస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలు చైనాతో భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాయి. ఇది ఆ దేశ ఉత్పత్తి సామర్థ్యానికి నిదర్శనం.
1978లో డెంగ్ జియావో పింగ్ ప్రారంభించిన ‘ఓపెనింగ్ అప్’ సంస్కరణలు చైనా స్వరూపాన్ని మార్చివేశాయి. గత మూడు దశాబ్దాలలో 85 కోట్లమంది ప్రజలను పేదరికం నుండి బయటపడేయడం ప్రపంచ మానవాభివృద్ధి చరిత్రలోనే ఒక అద్భుతం. 30 ఏళ్ళ క్రితం 66%గా ఉన్న పేదరికాన్ని 2020 నాటికిసంపూర్ణంగా నిర్మూలించి, ప్రపంచానికి ఒక పాఠంగా చైనా నిలిచింది.
ప్రపంచ ఉత్పత్తిలో చైనా వాటా ఆశ్చర్యకరంగాఉంది. ఉక్కు ఉత్పత్తిలో 53.9%, సిమెంట్ ఉత్పత్తిలో 51.1% వాటాతో చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది. ప్రపంచంలోని మొత్తం హై స్పీడ్ రైల్ లైన్లలో 66% ఒక్క చైనాలోనే ఉన్నాయి. షిప్ బిల్డింగ్ రంగంలో కూడా అమె రికా, ఐరోపాలను తలదన్నేలా 51% భారీ ఓడలను చైనా నిర్మిస్తోంది. ముఖ్యంగా, ‘కొస్కో’ వంటి ప్రభుత్వ సంస్థలు 24,000 కంటైనర్ల సామర్థ్యం గల భారీ ఓడ లను అత్యంత చౌకగా నిర్మిస్తున్నాయి. కేవలం రెండు దశాబ్దాల క్రితం ఈ రంగంలో ఉనికి లేని చైనా, నేడు జపాన్, సౌత్ కొరియాలను కూడా సవాలు చేస్తోంది.
చైనా నేడు ఏఐ రేసులో అగ్రస్థానంలో ఉంది. 2024లో పరిశోధనల కోసం ఆ దేశం 570 బిలియన్ డాలర్లను కేటాయించింది. సుమారు 5,000 ఏఐకంపెనీలు, 16,000 ఇంక్యుబేటర్లతో పూర్తి స్థాయి ఆటోమేషన్ దిశగా అడుగులు వేస్తోంది. సామాజిక సామరస్యం కోసం 700 మిలియన్ల ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో ‘సోషల్ క్రెడిట్ సిస్టం’ (ఎస్‌సీఎస్)ను అమలు చేస్తూ నేరాల రేటును గణనీయంగా తగ్గించింది. విద్యా రంగంలో కూడా ప్రతి ఏటా 5 మిలియన్ల ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విద్యార్థులు పట్టా పొందుతున్నారు. ఇది అమెరికాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ.
అభివృద్ధికి వెన్నెముక విద్యుత్తు
చైనా విద్యుత్ వినియోగం అమెరికా, యూరో పియన్ యూనియన్, ఇండియా, రష్యాల మొత్తం వినియోగం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. త్రీ గార్జెస్ డ్యామ్ (22,500 మె.వా.) వంటి భారీ ప్రాజెక్టులతో పాటు, దానికంటే రెండింతలు పెద్దదైన మెడోగ్ హైడ్రో పవర్ స్టేషన్ (60 వేల మె.వా.) నిర్మాణాన్ని ప్రారంభించింది. కాలుష్య రహితవిద్యుత్తు కోసం న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియపై పరిశోధనలు చేస్తోంది. 2025 నాటికి ఏఐ డాటాసెంటర్ల కోసం భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తినిలక్ష్యంగా పెట్టుకుంది.
వ్యవసాయ ఆధునికీకరణ, పర్యావరణ పరిరక్షణ, ఆహార భద్రత విషయంలో చైనా స్వయం సమృద్ధిని సాధించింది. ‘బేదో’ శాటిలైట్ ద్వారా నడిచే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రైవర్ లేని వరి నాటు యంత్రాలతో వ్యవసాయ రంగంలో 72% ఆధునికీకరణను సాధించింది. కొండ ప్రాంతాలలో నేలకోతను అరికట్టడానికి ‘మూడు పాళ్ళు అడవి, రెండు పాళ్ళు గడ్డిభూమి’ విధానాన్ని అమలు చేస్తూ పర్యావరణాన్ని రక్షిస్తోంది. దీనివల్ల మృత్తిక క్రమక్షయం78% తగ్గింది.
1990లో 170గా ఉన్న పట్టణాల సంఖ్య నేడు 700కు పెరిగింది. ఇందులో 17 మెగా సిటీలుఉన్నాయి. ఒకప్పుడు చిన్న చేపలు పట్టే గ్రామమైన షేన్జెన్, నేడు ప్రపంచానికి ‘సిలికాన్ వ్యాలీ’గా రూపాంతరం చెందింది. ఈ అద్భుతమైన అభివృద్ధి వెనుక క్రమశిక్షణ కలిగిన రాజకీయ సంకల్పం, విప్లవాత్మక నాయకత్వం ఉన్నాయి. చైనా కేవలం ఆర్థిక శక్తిగా మాత్రమే కాక, అగ్రరాజ్యాల ఆధిపత్య వలస వాదానికి వ్యతిరేకంగా, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేస్తోంది.
చైనా అభివృద్ధి నమూనా ఇతర దేశాలకు గుడ్డిగా ఎగుమతి చేసేది కాదనీ, ప్రతి దేశం తమ భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందాలనీసీపీసీ భావిస్తోంది. పర్యావరణ హితమైన ‘నూతన ఉత్పత్తి శక్తుల’ ఆవిష్కరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చైనా, పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక వ్యవ స్థాగత సవాలుగా నిలిచింది.
చైనా సాధించిన ఈ ప్రగతి కేవలం అంకెల్లో మాత్రమే కాదు, ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులో కనిపిస్తుంది. పర్యా వరణం, సాంకేతికత మానవ వనరుల సమతుల్యతతో కూడిన ఈ నమూనా ప్రపంచ దేశాలకు ఒక సరికొత్త దిశను చూపిస్తోంది. మొత్తంగా చూసినప్పుడు చైనా ప్రస్థానం కేవలం ఒక దేశాభివృద్ధి మాత్రమే కాదు, అది ఒక సిద్ధాంతానికీ, ఆచరణకూ మధ్య జరిగిన విజయ వంతమైన ప్రయోగం.
-వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
-నైనాల గోవర్ధన్


