అనగనగా ఓ ఊళ్లో రామశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని వద్ద కొందరు శిష్యులు ఉండేవారు. అయితే వారంతా మందమతులు కావడంతో భవిష్యత్తులో వారేమై పోతారో, ఎలా బతుకుతారో అని దిగులు పడుతూ ఉండేవాడు. కొద్దికాలానికి పక్క ఊరిలోని బంధువు మరణించడంతో రామశర్మ అక్కడికి వెళ్లాడు. బంధువు అంత్యక్రియలు ఆయన కొడుకులు చేయడం చూశాడు. తాను మరణించిన తర్వాత తనకు అలా చేసేవారెవరూ లేరని అనుకుంటూ దిగులు చెందాడు. తిరిగి ఇంటికొచ్చినా అదే బాధ వెంటాడుతూ ఉంది. గురువు దిగులుగా ఉండటం చూసి శిష్యులు విషయమేమిటని కనుక్కున్నారు. రామశర్మ తన మనసులో బాధ బయటపెట్టాడు.
‘గురువుగారూ! మేము మీ పిల్లలం కాదా? మీరు అనుకున్నట్లే మేమే ఆ కార్యక్రమాలు చేస్తాం’ అని వారంతా అన్నారు. ‘మీరు చేస్తారని నాకు తెలుసు. కానీ మీరు మందమతులు. ఆ కార్యక్రమాలు సరిగ్గా చేయకపోతే నాకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవు. అదే నా బాధ’ అని రామశర్మ దిగాలుగా అన్నాడు.
ఆ రాత్రి శిష్యులంతా కలిసి ఓ పథకం వేశారు. తెల్లారి గురువు కన్నా ముందే లేచి ఆయన పడుకున్న మంచానికి ఆయన్ని కట్టేశారు. శబ్దం చేయకుండా ఆయన నోట్లో గుడ్డలు కుక్కారు. మంచంతోసహా ఆయన్ని అలా బయటకు తీసుకెళ్లారు. ఆయన భార్య అరుస్తున్నా వినిపించుకోకుండా ఊరంతా అలాగే ఆయన్ని ఊరేగించారు. ఆ శబ్దానికి రామశర్మకు మెలకువొచ్చి చూస్తే మంచం గాల్లో ఉంది. తనను కిందకు దించమని చెప్పాలని ప్రయత్నించినా చేతులకు కట్లు, నోట్లో గుడ్డలు ఉండటంతో చెప్పలేకపోయాడు.
శిష్యులు ఆయన్ని ఊరేగించి చివరకు శ్మశానం దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ ముందే సిద్ధం చేసిన చితి మీద ఆ మంచాన్ని ఉంచారు. తలకొరివి పెట్టాలని చూస్తున్న సమయంలో రామశర్మ భార్య ఊరి పెద్దల్ని తీసుకొని అక్కడికి వచ్చి వారిని అడ్డుకుంది. మంచం మీద ఉన్న రామశర్మ కట్లు విప్తారు. ఊరివారంతా కలిసి ఆయన శిష్యుల్ని కొట్టబోగా ఆయన అడ్డుకున్నారు.
‘ఎందుకిలా చేశారు నాయనా? నా మీద ఏదైనా కోపమా?’ అని రామశర్మ శిష్యుల్ని అడిగారు. ‘లేదు గురువు గారూ! మీరు పోయాక ఆ కార్యక్రమాలు సరిగ్గా చేయకపోతే మీకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవని నిన్న మీరు బాధపడ్డారు కదా! అందుకే రాత్రి ఈ ఆలోచన చేశాం. మీరు పోయాక ఆ కార్యక్రమాలు ఎలా చేస్తామో మీకు చూపించడానికే ఇలా చేశామండీ!’ అని అమాయకంగా చెప్పారు. వారు చేసిన పనికి కోపం వచ్చినా, తన మీద వారి అభిమానానికీ రామశర్మ ఆనందపడ్డాడు. వారు మందమతులైనా తన మీద చూపిన ప్రేమకు తబ్బిబ్బయ్యారు.


