విశ్లేషణ
ప్రజా పథకాల అమలులో చిత్తశుద్ధి ముఖ్యం గానీ, పేరు మార్పుతో ప్రజలకు ఒరిగేదేముంది? కేంద్రంలో ఎన్డీయే సర్కారు ‘మహాత్మాగాంధీ’ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాక విధానాలనూ మార్చి కొత్త పథకం తెస్తోంది. పాలన వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వ్యవస్థ పేరు మార్పునకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అమలు అధోగతి పాలై, వ్యవస్థ కుప్పకూలుతుంటే దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా చట్టం ద్వారా పథకం పేరు మార్చే క్రమంలో ఆర్డినెన్స్ తేవడానికి రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమైంది. కొత్త పేరు ‘స్వర్ణ గ్రామం’ ‘స్వర్ణ వార్డు’ అట! ఈ ‘స్వర్ణం’ పిచ్చి ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త కాదు. పాతికేళ్ల కింద ‘స్వర్ణాంధ్ర’ రాగాలు పాడారు. బంగారం ధరలు సామాన్యులకు అందనంత పైపైకి వెళుతుంటే, జనానికి చేరువగా పాలనను తెచ్చే పథకాలకు ఈ ‘బంగారం’ పేర్లేంటో అర్థమే కాదు!
ప్రభుత్వ పాలనను పౌరులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో వికేంద్రీకృత ‘సచివాలయ’ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌లో 2019లో తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా ఏర్పడ్డవే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు. పౌరులకు పెన్షన్ వంటి వ్యక్తిగత లబ్ధి చేకూర్చే వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు రెవెన్యూ, విద్య, వైద్యం, విద్యుత్తు, వ్యవసాయం, పశుపోషణ, మహిళా భద్రత వంటి వివిధ విభాగాల సేవల్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల్ని ఏర్పరచి, అందులో పది మందికి పైగా ఉద్యోగుల్ని నియమించి ఈ వికేంద్రీకరణ చేపట్టారు.
ముందు కన్సాలిడేటెడ్ వేతనాలపై పనిచేసిన ఈ సిబ్బంది ఇప్పుడు పూర్తిస్థాయి స్కేల్–జీత భత్యాలు పొందుతున్నారు. దీనికి తోడు సగటున ప్రతి 50 కుటుంబాలకు ఒకరి చొప్పున ‘స్వచ్ఛంద సేవకుల’ను నియమించి, వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం నడిపింది. వాలంటీర్లకు నెలనెలా అయిదువేల రూపాయల గౌరవ భృతి ఇచ్చేది. సచివాలయానికి, గ్రామస్థులు/వార్డు పౌరులకు మధ్య సంధానకర్తగా ఉండే ఈ వాలంటీర్లు పెన్షన్ డబ్బుల్ని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అప్పగించడం నుంచి పలు సేవలు అందించేది. కుల, జన్మ, మరణ ధ్రువపత్రాలను ఇప్పించడం, వేర్వేరు సేవలకు సంబంధించిన దరఖాస్తుల్ని సచివా లయం ద్వారా సంబంధిత శాఖా కార్యాలయాలకు చేర్చడం, సర్కారు స్పందనల్ని, పరిష్కారాల్ని పౌరులకు అందించడం వరకు వారికి సహాయకారులుగా ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ రద్దయింది.
మొదట మొత్తంగా 15,000 పై చిలుకు సచివాలయాలు ఏర్ప డగా 1.34 లక్షల ఉద్యోగులు, 2.52 లక్షల వాలంటీర్లు ఇందుకోసం నియమితులయ్యారు. 35 విభాగాలకు చెందిన 500 సేవలు సకాలంలో, సజావుగా ప్రజలకు అందాలని, ఏ అంశమైనా గరిష్ఠంగా 72 గంటల్లో పరిష్కారమవ్వాలని ఉద్దేశించారు. అసలీ వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలే దిశలో సాగుతోంది. ఏపీ మంత్రివర్గంలోని ఒకరు ప్రైవేటు సంభాషణలో అన్నట్టు ‘ఆకాశాన్నంటుతున్న ధరలతో ఒక బంగారు చెవిపోగు కూడా కొనలేని పరిస్థితుల్లో ఈ స్వర్ణ గ్రామమేంటో, స్వర్ణ వార్డేంటో!’ అనే భావన అక్షర సత్యం.
ఏపీ సీఎం చంద్రబాబు తొలిదఫా ముఖ్యమంత్రి అయిన కాలంలో ‘స్వర్ణాంధ్ర’ కలలు కనేది! అదే క్రమంలో ‘విజన్ 2020’ విధాన పత్రాన్ని ప్రకటిస్తే నాటి విపక్ష నేత డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి దాన్నొక ‘దశాబ్ది ఉత్తమ కాల్పనిక పత్రం’గా విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘విజన్–2047’ అంటూ రెండు దశాబ్దాల కలల్ని ఇప్పట్నుంచే ఆమ్మ జూపుతున్నాయి. తక్షణ ఆచరణలో నిబద్ధత, చిత్తశుద్ధి లేకుండా సుదూర భవిష్యత్తుకు గేలాలు వేయడం, ‘బంగారు తాపడం’ పూయడం మాయ కాక మరేమవుతుంది? తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి పదేళ్లు పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‘బంగారు తెలంగాణ’ నినాదం కూడా విమర్శలను ఎదుర్కొంది.
చేసేందుకు ఎంతో ఉంది!
ఏపీలో పదిహేను వేల వరకున్న గ్రామ వార్డు సచివాలయాల్లో కనీసం రోజూ ఆఫీస్ ఊడ్చేవారు లేరు. అందుకవసరమైన వ్యవస్థే లేదు. ఏమంటే ‘ఇందుకోసం నిధులు లేవు, జీరో బడ్జెట్’ అని నోడల్ అధికారిగా ఉన్న ఒక డిప్యూటీ ఎంపీడీవోనే చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద లక్ష్యాలతో వస్తే మొదట వాలంటీర్లతో చేయించిన పనులు ఇప్పుడు తమతో చేయిస్తున్నారనే ఆవేదన, తమ సేవలకు తగిన గుర్తింపు దక్కడం లేదనే ఆక్రోశం మెజారిటీ సచివాలయ ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
‘సచివాలయ వ్యవస్థ’ తాజా స్థితిపై రాష్ట్రవ్యాప్త అధ్యయనం చేపట్టిన ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ పరిశీలనకు వస్తున్న అంశాలు ఆసక్తికరంగానే కాదు, ఒకింత ఆందోళన కలిగించేవిగానూ ఉన్నాయి. పెద్దమొత్తంలో ప్రజాధనం వెచ్చించి నిర్వహిస్తున్న ఈ వ్యవస్థను సంస్కరించకుండా ఇలాగే నడిపిస్తే సమీప కాలంలోనే కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యవస్థ సమర్థ నిర్వహణకు సరైన నిఘా, నియంత్రణ, అజమాయిషీ తక్షణావసరమని సర్వేలో వెల్లడవుతున్న అభిప్రాయం. ఈ అధ్యయనం జరుగుతున్న సమ యంలోనే ‘పేరు మార్పు’ మంత్రివర్గ నిర్ణయం వెలువడింది. అవస రానికి మించి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారనేది ఒక విమర్శ. అందుకే, ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధం చేసే ప్రక్రియను ఇటీవల చేపట్టారు. ఇదివరకున్నట్టు అన్ని సచివా లయాల్లో 11 మంది కాకుండా, జనాభాను బట్టి 6, 7, 8 మంది సిబ్బందితో సరిపెట్టడం, ఆ మేర సర్దుబాటు చేయడం అనే ప్రక్రియ మొదలైంది. కానీ అది సవ్యంగా జరగటం లేదు. దాన్ని సరిగా జరిపించి, ఆశించిన లక్ష్యం మేరకు ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో, సులభంగా అందేట్టు చూడాలి. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసే దిశలో ఇదొక మార్గం కావాలి.
ప్రభుత్వం నిరంతర ప్రక్రియ
పాలనలోకి రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రభుత్వమన్నది నిరంతరంగా ఉండే ఒక బాధ్యత, అంతకు మించి జవాబుదారీతనం! నిన్నటి ప్రభుత్వ విధానాలను, పేర్లను నేడు గౌరవించక, గుడ్డిగా మార్చేసే వారికి రెండు, మూడు దశాబ్దాల ‘విజన్ ’ పేరిట కార్యక్రమాలు మొదలెట్టే నైతిక హక్కు ఏముంటుంది? ‘మీరు ఎన్నికైంది అయిదేళ్లకోసమే కదా, మీలాగానే మీ తర్వాత వచ్చినవారు మీ విధానాలను కొనసాగించక, పక్కన పడేస్తే ఏమిటి పరిస్థితి?’ అని అడిగితే ఏం సమాధానమిస్తారు! పైగా ప్రజోపయోగంగా విధానాలను సరిదిద్దకుండా పేరు మారిస్తే ఏమొస్తుంది? ‘ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల కంపు’ అన్నట్టుంటే– గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థే కాదు, ఏదీ సవ్యంగా ఉండదు. పౌర సేవల్ని సజావుగా అందిస్తూ, పాలనను ప్రజలకు చేరువ చేసే చిత్తశుద్ధిని ప్రభుత్వాలు ప్రదర్శించాలి. ఇదే ప్రజాస్వామ్య ధర్మం!
దిలీప్ రెడ్డి
వ్యాసకర్త పొలిటికల్, సోషల్ ఎనలిస్ట్;
డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ


